దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పేపర్ లీక్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో సీబీఐ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. 13 మంది నిందితులపై దిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. 13 మంది నిందితులపై నేరపూరిత కుట్ర, మోసం, సాక్ష్యాలు, ఆధారాలు ధ్వంసం కింద ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. వీరిలో ఎన్టీఏ నిపుణులు, కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు, మధ్య వర్తులు ఉన్నారు.
ఈ సీబీఐ అధికారులు దాదాపు 360 మంది సాక్షుల వాంగ్మూలాలను సేకరించి.. 92 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. తద్వారా కీలక ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు నిందితుల బ్యాంక్ అకౌంట్స్, డీ మాట్ అకౌంట్స్ ఫ్రీజ్ చేశామని.. తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని సీబీఐ స్పష్టం చేసింది. ప్రస్తుతం నిందితులంతా జ్యూడిషియల్ కస్టడీలో ఉన్నట్లు సీబీఐ విచారణ బృందం పేర్కొంది. ఇక కేంద్రం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఈ కేసుపై విచారణ చేపట్టనుంది.
ఇక నీట్ పేపర్ లీక్ ఆరోపణల నేపథ్యంలో మే 3 న నిర్వహించిన నీట్ యూజీ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ రద్దు చేసింది. ఆ తర్వాత జూన్ 21న తిరిగి నిర్వహించింది. ఇక నీట్ పేపర్ లీక్ అంశంపై కేంద్ర విద్యాశాఖ ఇచ్చిన లిఖితపూర్వక ఫిర్యాదు ఆధారంగా సీబీఐ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.
మరోవైపు ఈ నీట్ పేపర్ లీక్ కు బాధ్యులుగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ దాదాపు నెల రోజుల పాటు నిరసనలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నిరసనల్లో భాగంగా పర్యావరణ వేత్త సోనమ్ వాంగ్ చుక్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చింది. ప్రధాన్ రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో ప్రహ్లాద్ జోషీని కేంద్రం నియమించింది.