పేపర్ లీక్ ఘటనలు దేశాన్ని కుదిపేస్తున్నాయి. ఇప్పటికే నీట్ ప్రశ్నాపత్రం లీక్ వివాదం దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. తాజాగా ఒడిశాలో పేపర్ లీక్ ఘటన జరిగినట్లు స్పష్టం అవుతోంది. ది ఒడిశా యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్(OUHS) ఈ వివాదంపై అంతర్గతంగా దర్యాప్తునకు ఆదేశించింది. పీజీ మెడికల్ ఎగ్జామ్ జరుగుతున్న క్రమంలో వాటికి సంబంధించిన క్వశ్చన్ పేపర్ సోషల్ మీడియాలో వైరల్ కావడం కలకలం రేపుతోంది. ఓ వైపు పరీక్ష జరుగుతుంటే మరోవైపు క్వశ్చన్ పేపర్ బయటకు రావడం ఆందోళన కలిగిస్తోంది.
ఈ ఘటన జూలై 27 న జనరల్ సర్జరీ థియరీ ఎగ్జామ్ 2023-26 ఎంఎస్/ ఎండీ బ్యాచ్ కు జరుగుతున్న క్రమంలో జరిగింది. పరీక్ష ప్రారంభమైన కొద్ది నిమిషాలకే ఈ ఎగ్జామ్ కు సంబంధించిన క్వశ్చన్ పేపర్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నట్లు నెటిజన్లు గుర్తించారు. ఇదే అంశంపై ఒడిశా రాజధాని భువనేశ్వర్ లోని ఓ మెడికల్ కు చెందిన పీజీ విద్యార్థి మాట్లాడుతూ ఇందుకు సంబంధించిన క్వశ్చన్ పేపర్ ఫొటోలను విడుదల చేశారు.
తనకు బర్హాంపూర్ కు చెందిన విద్యార్థి క్రియేట్ చేసిన వాట్సాప్ గ్రూప్ ద్వారా ఇవి వచ్చినట్లు పేర్కొన్నాడు. మరికొంతమంది విద్యార్థులు కూడా ఈ పేపర్ లీక్ అంశంపై మాట్లాడారు. తమ ఫోన్ నెంబర్స్ కూ ఈ క్వశ్చన్ పేపర్ ఫొటోలు వచ్చాయని పరీక్ష జరుగుతున్న సమయంలోనే ఇవి సామాజిక మాధ్యమాల్లో సర్క్యూలేట్ అయ్యాయని స్పష్టం చేశారు.
మరోవైపు ఈ ఘటనపై ది ఒడిశా యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వైస్ ఛాన్సెలర్ మానస్ రంజన్ సాహూ మాట్లాడుతూ.. ఇది పేపర్ లీక్ కాదని.. పరీక్ష ప్రారంభానికి ముందే క్వశ్చన్ పేపర్స్ బయటకు వస్తే అది పేపర్ లీక్ అవుతుందని.. కానీ ఇక్కడ పరీక్ష ప్రారంభం అయ్యాక అభ్యర్థులకు పరీక్ష పత్రం ఇచ్చాక వాటిని బయటకు స్మగుల్ చేశారని పేర్కొన్నారు. ఈ ఘటనపై సమగ్రంగా దర్యాప్తు జరుపుతున్నట్లు స్పష్టం చేశారు. అయితే కేంద్ర మాజీ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సొంత రాష్ట్రంలో ఇలాంటి ఘటన జరగడం చర్చనీయాంశంగా మారింది.