ప్రస్తుతం భారత్- పాకిస్థాన్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంతగా పరిస్థితులు ఉన్నాయి. గతేడాది పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రతరం అయ్యాయి. ఈ నేపథ్యంలో అట్టారీ- వాఘా సరిహద్దు వద్ద ఇండియన్ ఆర్మీ అధికారికి పాకిస్థాన్ జవాన్ సెల్యూట్ కొట్టిన దృశ్యాలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. పరేడ్ కార్యక్రమాన్ని చూసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు ఇక్కడకు వచ్చారు. అయితే ఈ వీడియో ఎప్పుడు తీసిందో తెలియదు. కానీ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో మాత్రం తెగ వైరల్ అవుతోంది.
ఈ వీడియోలో ఓ వైపు పాకిస్థాన్ ఆర్మీ అధికారులు, జవాన్లు ఉన్నారు. మరోవైపు భారత ఆర్మీ అధికారులు, జవాన్లు ఉన్నారు. అయితే ఇదే సమయంలో పాకిస్థానీ రేంజర్స్.. భారత ఆర్మీ అధికారులకు సెల్యూట్ చేస్తూ కనిపించారు. అయితే ఇరు దేశాల ఆర్మీ అధికారుల మధ్య ఉన్న గౌరవం, మర్యాద, ప్రొఫెషనలిజం తదితర అంశాల ఆధారంగా ఇలా ఇరు దేశాల సైన్యం గౌరవించుకుందని నెటిజన్లు సామాజిక మాధ్యమాల్లో అభిప్రాయ పడుతున్నారు.
లైన్ ఆఫ్ కంట్రోల్ లోని అట్టారీ- వాఘా సరిహద్దు వద్ద భారత్- పాకిస్థానీ అధికారులు ఒకర్నొకరు చేతులను కలుపుతూ అఫీషియల్ ఫ్లాగ్ హోస్టింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే మిలిటరీ ప్రొటోకాల్ లో.. హై ర్యాంకింగ్ అధికారులకు దేశాలతో సంబంధం లేకుండా సెల్యూట్ చేయాలని ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అయితే చాలామంది పాకిస్థాన్ జవాన్ సెల్యూట్ ను ప్రశంసిస్తున్నారు. మిలిటరీ ప్రొటోకాల్ లో భాగం అని మాట్లాడుకుంటున్నారు. ఇది క్రమశిక్షణ.. యూనిఫామ్ అండ్ ర్యాంక్ ఉన్న అధికారులకు సెల్యూట్ ఉంటుందని రకరకాలుగా నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
ఇక గతేడాది ఏప్రిల్ 22 న జరిగిన పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడి వెనకాల ఉన్నది పాకిస్థాన్ అని తేలిన నేపథ్యంలో ఆ దేశంపై భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని 9 కీలక ఉగ్ర స్థావరాలపై దాడులు చేసి వాటిని ధ్వంసం చేసింది.