విజయ్ పార్టీలో చేరడంపై తేల్చి చెప్పిన పన్నీర్ సెల్వం: ఆ భావజాలమే నడిపిస్తోంది.. !!

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే ఎమ్మెల్యే పన్నీర్‌సెల్వం పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలపై స్పష్టత ఇచ్చారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు కొద్దిరోజుల ముందు ఆయన డీఎంకేలో చేరారు. తన కంచుకోట బోడినాయకన్నూర్ నుంచి పోటీ చేసి ఘన విజయం సాధించారు. టీవీకే అభ్యర్థి ప్రకాష్ పై దాదాపు 6,000లకు పైగా ఓట్ల తేడాతో గెలిచారు. ఈ ఎన్నికల్లో డీఎంకే అధికారాన్ని నిలబెట్టుకోలేకపోయింది.

Advertisement

దీంతో ఆయన డీఎంకేను వీడబోతోన్నారని, త్వరలో ముఖ్యమంత్రి విజయ్ ను కలిసి, టీవీకేలో చేరబోతున్నారనే ప్రచారం తమిళనాడు రాజకీయాల్లో జోరుగా సాగుతోంది. దీనిపై పన్నీర్ సెల్వం స్పందించారు. ఈ ప్రచారాన్ని ఖండించారు. ఇందులో ఎలాంటి నిజం లేదని, ఇవన్నీ నిరాధారమైన పుకార్లేనని కొట్టిపారేశారు. ఇందులో ఎలాంటి నిజం లేదని, ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదని అన్నారు.

Advertisement

తేని జిల్లాలో విలేకరులతో మాట్లాడారు పన్నీర్‌ సెల్వం. పార్టీ మారుతున్నట్లు వచ్చిన వార్తల గురించి విలేకరులు ప్రస్తావించాగా.. వాటిని తోసిపుచ్చారు. రాజకీయాల్లో కొందరు కావాలనే ఇటువంటి తప్పుడు ప్రచారాలకు తెరలేపుతున్నారని వ్యాఖ్యానించారు. ఇవి.. కొందరు నాయకులు ఉద్దేశపూర్వకంగా చిచ్చు పెట్టే ప్రయత్నమని అభివర్ణించారు. వీటికి ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

తమిళనాడు రాజకీయ చరిత్రలో డీఎంకేకు ఉన్న ప్రాధాన్యతను ఓపీఎస్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. రాష్ట్రంలోని ద్రవిడ ఉద్యమాలకు, ఇతర ద్రవిడ పార్టీలన్నింటికీ డీఎంకే మాతృసంస్థ లాంటిదని, ద్రవిడ సిద్ధాంతాలకు అది ఒక ప్రధాన వనరు అని ఆయన కొనియాడారు. తాను అటువంటి గొప్ప సిద్ధాంతాలు, ప్రజల్లో బలమైన పునాది ఉన్న పార్టీలో కొనసాగుతున్నానని గుర్తు చేశారు. ద్రవిడ భావజాలమే తనను నడిపిస్తోందని వ్యాఖ్యానించారు.

Advertisement

ఇటీవల కాలంలో తమిళనాడులో చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలపై పన్నీర్‌ సెల్వం అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో నాయకులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం చాలా సులువుగా పార్టీలు మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమను నమ్మి ఓట్లేసిన ప్రజా విశ్వాసాన్ని వమ్ము చేస్తూ ఇలా పార్టీలు మారడం ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయడమేనని, ప్రస్తుత రాజకీయాల్లో కనీస విలువలు లోపించడం ఆందోళనకరమని పేర్కొన్నారు.

టీవీకే పార్టీ నేతృత్వంలోని ప్రస్తుత ప్రభుత్వంపై తమిళనాడు ప్రజలు ఇప్పటికే విమర్శలు చేయడం ప్రారంభించారని పన్నీర్‌సెల్వం ఈ సందర్భంగా పేర్కొన్నారు. భవిష్యత్తులో తమిళనాడు రాజకీయాల్లో ఊహించని విధంగా, అత్యంత ఆసక్తికరమైన కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని అన్నారు. దీనిపై ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేనని చెప్పారు.

English Summary

Panneerselvam Dismisses Rumours of Quitting DMK for TVK as Political Mischief Reaffirms Loyalty to DMK. He described the reports as rumour, urging caution over unverified political speculation and focusing on his party role in Tamil Nadu politics.