పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు ఏమాత్రం తగ్గడం లేదు. అమెరికా- ఇరాన్ మధ్య ప్రతీకార దాడులు కొనసాగుతున్నాయి. అమెరికా స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ సైన్యం దాడులు చేస్తుండగా.. ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులు చేపడుతోంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా ప్రపంచదేశాలతో పాటు భారత్ లోనూ అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
ఈ నేపథ్యంలో పశ్చిమాసియాలో సంక్షోభంపై ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన నాలుగోసారి కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ (CCS) భేటీ జరిగింది. ఈ సమావేశంలో ఇంధనం, ఎల్పీజీ, ఎల్ ఎన్ జీ, ఎరువుల సరఫరా, సముద్ర కార్మికుల భద్రత, భారతీయుల రక్షణ, పునరుత్పాదక ఇంధనాలపై కీలక ఆదేశాలు జారీ చేశారు. అలాగే దేశ ఎగుమతులు, దిగుమతులపై యుద్ధ ప్రభావం, భద్రతాపరమైన పరిణామాలు తదితర అంశాలపై చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.
భారత్ కు అంతర్జాతీయ వాణిజ్యం పరంగా కీలకమైన హార్మూజ్ జలసంధిలో ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత్ కు సరుకు రవాణా అంశంపై అధికారులను ప్రధాని మోదీ ఆరా తీసినట్లు సమాచారం. నల్ల సముద్రం, ఎర్ర సముద్రం అలాగే గల్ఫ్ ఆఫ్ ఈడెన్ లను ప్రత్యామ్నాయ మార్గాలుగా ఉపయోగించుకోవడంపై చర్చలు జరిపినట్లు సమాచారం అందుతోంది.
ఇక ఈ సమావేశంలో కేబినెట్ కార్యదర్శి ప్రస్తుత భౌగోళిక పరిస్థితులను వివరించారు. ఎల్ ఎన్ జీ, ఎల్ పీజీ, పెట్రోలియం ప్రొడక్ట్స్ అలాగే ఎరువుల సరఫరాకు కేంద్రం తీసుకున్న చర్యలను వివరించారు. పెట్రోలియం ఉత్పత్తుల నిల్వలు, సరఫరా తగిన స్థాయిలో ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు చూస్తే.. భారతీయ నావికులకు సాయం, కౌన్సెలింగ్ అందించేందుకు ఓ ప్రత్యేకమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రధాని మోదీ అధికారులను ఆదేశించారు.
రానున్న రబీ సీజన్ ను దృష్టిలో ఉంచుకుని కావలసిన ఎరువుల అవసరాలపై సమీక్ష జరిపి రైతులకు ఎరువుల సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా చూడాలని అధికారులను ప్రధాని మోదీ ఆదేశించారు.