ఆ ఎయిర్‌పోర్ట్ మా తాత ఆస్తే!  35 ఏళ్లుగా రెండో ప్రపంచ యుద్ధం నాటి జాగా కోసం.. 

సాధారణంగా మనం ఊళ్లలో ఒక మాట తరచూ వింటుంటాం. "అదుగో.. ఆ కనిపిస్తున్న పాడుబడిన భవనం, ఆ పక్కన ఉన్న వందల ఎకరాల పొలాలు ఒకప్పుడు మా తాతలవే.. వాళ్లు అలా పోగొట్టేశారు" అని చెబుతుంటారు. చాలామంది దీన్ని కేవలం గొప్పల కోసం, లేదంటే గతాన్ని తలుచుకుని బాధపడుతూ చెప్పే మాటగానే కొట్టిపారేస్తుంటారు. కానీ, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఓ రైతు మాత్రం అక్షరాలా ఇలాగే అన్నాడు. "అదుగో.. ఆ కనిపిస్తున్న ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు మా తాతలదే" అని చెప్పడమే కాదు, ఏకంగా ఆ విమానాశ్రయం కట్టిన భూమికి పరిహారంగా తనకు 3,500 కోట్ల రూపాయలు కావాలంటూ సుప్రీంకోర్టు మెట్లెక్కాడు. వినడానికి ఏదో సినిమా కథలా అనిపిస్తున్నా.. ఇది అక్షరాలా నిజం!

Advertisement

రెండో ప్రపంచ యుద్ధం నాటి ఫ్లాష్ బ్యాక్

ఛత్తీస్‌గఢ్‌కు చెందిన 53 ఏళ్ల రైతు అశ్విని బండే సుప్రీంకోర్టులో దాఖలు చేసిన ఓ పిటిషన్ ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. రాయ్‌పూర్‌లోని ప్రసిద్ధ స్వామి వివేకానంద ఎయిర్‌పోర్టు (అప్పటి మానా ఎయిర్‌ఫీల్డ్) నిర్మించిన సుమారు 30 ఎకరాల 18 డెసిమల్స్ భూమి తన పూర్వీకులదేనని బండే వాదిస్తున్నాడు. 1942లో రెండో ప్రపంచ యుద్ధం సమయంలో మిలిటరీ అవసరాల కోసం అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం ఈ భూమిని తాత్కాలికంగా తీసుకుందని, యుద్ధం ముగిశాక తిరిగి ఇచ్చేస్తామని అప్పట్లో ఒప్పందం చేసుకున్నారని ఆయన పేర్కొంటున్నాడు. ఆ భూమికి వార్షిక అద్దె కింద రూ. 1,300 చెల్లిస్తామని చెప్పిన బ్రిటిష్ ప్రభుత్వం, ఆ తర్వాత ఆ ఊసే ఎత్తలేదట. యుద్ధం ముగిసింది కానీ, బండే కుటుంబానికి ఆ భూమి దక్కలేదు, అద్దె రాలేదు, పరిహారమూ అందలేదు.

Advertisement

35 ఏళ్ల సుదీర్ఘ పోరాటం.. 20 కోట్ల ఖర్చు

తన తాతల ఆస్తిని దక్కించుకోవడం కోసం అశ్విని బండే ఏకంగా 35 ఏళ్లుగా న్యాయ పోరాటం చేస్తున్నాడు. దేశంలోని వివిధ గ్రంథాలయాలు, ప్రభుత్వ ఆర్కైవ్స్, పలు శాఖల కార్యాలయాల చుట్టూ తిరిగి తన వాదనకు బలాన్నిచ్చే పాత రికార్డులను సేకరించాడు. ఆ భూమిని ప్రభుత్వం శాశ్వతంగా సేకరించలేదని నిరూపించే పత్రాలను బయటకు తీశాడు. అయితే, ఈ సుదీర్ఘ న్యాయపోరాటం కోసం ఆయన ఇప్పటికే సుమారు రూ. 15 కోట్ల నుంచి రూ. 20 కోట్లు ఖర్చు చేయడం గమనార్హం.

Advertisement

బలమైన సాక్ష్యాలు దొరికిందిలా..

బండే పోరాటానికి ఇటీవలే ఓ బలమైన ఆధారం దొరికింది. రాయ్‌పూర్‌లోని సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఓ ఎగ్జిబిషన్‌లో పాత రికార్డులను ఆయన గమనించాడు. వెంటనే ప్రజా సేవా హక్కు చట్టం (పబ్లిక్ సర్వీస్ గ్యారెంటీ యాక్ట్) కింద ఆ పత్రాల సర్టిఫైడ్ కాపీలను సంపాదించాడు. 1946లో డిఫెన్స్ ఆఫ్ ఇండియా చట్టం రద్దయ్యాక, 1952లో వచ్చిన కొత్త చట్టంతో భూముల నిర్వహణ వివిధ ప్రభుత్వ శాఖల చేతుల్లోకి వెళ్లిపోయిందని, ఈ క్రమంలోనే తన కుటుంబ హక్కులు కాలరాశారని ఆయన ఆరోపిస్తున్నాడు. సాంస్కృతిక శాఖ సైతం ఆ కాలం నాటి భూసేకరణ రికార్డులు, అందులో రైతుల పేర్లు తమ వద్ద ఉన్నాయని ధృవీకరించడం బండే వాదనకు మరింత బలాన్నిస్తోంది.

Advertisement

సుప్రీం కోర్టులో తేలాల్సిన తీర్పు

సేకరించిన పత్రాలు, సాక్ష్యాల ఆధారంగా ఆనాటి నుంచి నేటి వరకు తమకు దక్కాల్సిన పరిహారం ఏకంగా రూ. 3,500 కోట్లు ఉంటుందని అంచనా వేసిన బండే.. ఆ మొత్తాన్ని తనకు ఇప్పించాల్సిందిగా సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఎన్నో ఏళ్లుగా సాగుతున్న ఈ పోరాటంలో అశ్విని బండే కల నెరవేరుతుందా? ఆ పాత డాక్యుమెంట్లలో చట్టపరమైన బలం ఎంత ఉందనేది ఇప్పుడు సర్వోన్నత న్యాయస్థానం తేల్చాల్సి ఉంది. మరి, ఈ హై-డ్రామా రియల్ లైఫ్ స్టోరీకి సుప్రీంకోర్టు ఎలాంటి ముగింపు పలుకుతుందో వేచి చూడాలి.

English Summary

A Chhattisgarh farmer, Ashwini Bande, has moved the Supreme Court claiming ownership of the land where Raipur Airport is located. He alleges the British government seized the land during World War II without compensation. Bande is seeking Rs 3,500 crore, citing his 35-year legal struggle for his ancestral rights.