తృణమూల్ కేంద్ర కార్యాలయం కూడా పాయె: నిలవ నీడలేని మమత బెనర్జీ

పశ్చిమ బెంగాల్ ప్రతిపక్ష పార్టీ తృణమూల్ కాంగ్రెస్ లో తీవ్ర రాజకీయ ఉత్కంఠ నెలకొంది. పార్టీలో చెలరేగిన అంతర్గత విభేదాలు ఒక్కసారిగా రోడ్డుకెక్కాయి. రితబ్రత బెనర్జీ నేతృత్వంలోని తిరుగుబాటు వర్గం కోల్‌కతాలోని పార్టీ ప్రధాన కార్యాలయాన్ని కూడా తమ ఆధీనంలోకి తీసుకుంది. కార్యాలయానికి తాళం వేసింది. అసలైన తృణమూల్ కాంగ్రెస్ తమదేనని, కేంద్ర ఎన్నికల కమిషన్ సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేయవచ్చని తిరుగుబాటు నేతలు ప్రకటించుకున్నారు.

Advertisement

రితబ్రత బెనర్జీ తన సహచర నేతలు ఫిర్హాద్ హకీం, సందీపన్ సాహా, జావేద్ ఖాన్, అఖ్రుజ్ జమాన్‌తో కలిసి మెట్రోపాలిటన్ ఈఎం బైపాస్ వద్ద ఉన్న పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు. మమతా బెనర్జీ, అరూప్ రాయ్‌ల ఫోటోలతో కూడిన నూతన పోస్టర్లను భవనం బయట ప్రదర్శించారు. పార్టీ అధినేత్రి మమతా బెనర్జీని తమ వర్గం సలహాదారుగా మాత్రమే పరిగణిస్తోందని, నూతన అధ్యక్షుడిగా అరూప్ రాయ్‌ను నియమించామని చీలిక వర్గం ప్రకటించడం సంచలనం రేపింది.

Advertisement

ఈ పరిణామాలన్నీ రితబ్రత బెనర్జీ వర్గం ఢిల్లీ వేదికగా కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసిన మరుసటి రోజే చోటుచేసుకోవడం గమనార్హం. గురువారం ఈసీని కలిసిన చీలిక వర్గం.. పార్టీలో జరిగిన సంస్థాగత మార్పులకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లను ఈసీకి సమర్పించింది. కిందటి నెల 22న ఏర్పాటుచేసిన ప్రత్యేక సమావేశంలో తాము అరూప్ రాయ్‌ను కొత్త అధ్యక్షుడిగా ఎన్నుకున్నామని, ఈ విషయాన్ని అదే నెల 23వ తేదీ నాడే ఈసీకి తెలియజేశామని వారు స్పష్టం చేశారు.

కేంద్ర కార్యాలయాన్ని స్వాధీనం చేసుకున్న అనంతరం తిరుగుబాటు వర్గం నాయకులు సందీపన్ సాహా, జమాల్ మాట్లాడారు. మెజారిటీ తృణమూల్ ఎమ్మెల్యేల మద్దతు తమకే ఉందని, ప్రజల మద్దతు కూడా తమవైపే ఉందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యాలయం తమదేనని, పార్టీ అధికారిక గుర్తుపై తమ వర్గానికే పూర్తి హక్కులు ఉన్నాయని తేల్చి చెప్పారు. పార్టీ కేంద్ర కార్యాలయం నిర్వహణ, అక్కడ సాగే కార్యకలాపాలన్నీ ఇకపై అరూప్ రాయ్ పర్యవేక్షణలోనే ఉంటాయని, మమత బెనర్జీ సలహాదారు మాత్రమేనని అన్నారు.

Advertisement

తిరుగుబాటు వర్గం చేస్తోన్న ఈ వాదనలపై మమతా బెనర్జీ ప్రధాన వర్గం తీవ్రంగా స్పందించింది. మమతా బెనర్జీకి అత్యంత నమ్మకస్తుడు, ఎంపీ కళ్యాణ్ బెనర్జీ ఈ ఆరోపణలను పూర్తిగా కొట్టిపారేశారు. కొందరు గూండాలు, సమాజ వ్యతిరేక శక్తులు కలిసి ఒక సొంత ముఠాలా ఏర్పడితే, వారిని ఒక రాజకీయ పార్టీగా ఎలా గుర్తిస్తారని ఈసీని ప్రశ్నించారు. ఈ ప్రకటనలకు ఎలాంటి చట్టబద్ధమైన విలువ లేదని, నిజమైన పార్టీ తమదేనని ఆయన తేల్చిచెప్పారు.

నాయకత్వ వివాదం ముదరడంతో కోల్‌కతాలో శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా యంత్రాంగం అప్రమత్తమైంది. పార్టీ కార్యాలయం వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా కోల్‌కతా పోలీసులతో పాటు కేంద్ర భద్రతా బలగాలను భారీగా మోహరించారు. తృణమూల్ కాంగ్రెస్ పేరు, ఎన్నికల గుర్తు ఎవరికి చెందుతాయనే తుది నిర్ణయం ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం చేతుల్లోనే ఉంది.

English Summary

Ritabrata Banerjee-Led Faction Moves to Trinamool Bhavan After EC Claim Padlock Controversy Erupts. The group led by Ritabrata Banerjee and Firhad Hakim returned from New Delhi and moved to assert control over Trinamool Bhavan on EM Bypass.