కేరళలోని ప్రఖ్యాత శబరిమల ఆలయంలో నేడు అత్యున్నత ఘట్టం చోటుచేసుకోనుంది. అయ్యప్పస్వామి భక్తులకు ఎంతో పవిత్రమైన మకరజ్యోతి దర్శనం సంక్రాంతి రోజున లభించనుంది. ఈ సందర్భంగా గురువారం అయ్యప్ప సన్నిధానానికి తిరునాభరణం ఊరేగింపు చేరుకోనుంది.
దేశవ్యాప్తంగా కొన్ని లక్షల మంది అయ్యప్పస్వామి భక్తులు సంక్రాంతి పండుగ రోజు శబరిమలకు వెళ్లి ప్రత్యక్షంగా మకరజ్యోతిని దర్శించుకోవాలని ఆశపడతారు. మకరజ్యోతిని వీక్షించి, తరించేందుకు పెద్దసంఖ్యలో భక్తులు శబరిమలకు చేరుకుంటారు. అయితే ఈ ఏడాది కరోనా నేపథ్యంలో ఆలయ అధికారులు శబరిమలలో కోవిడ్ నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నారు. శబరిమలకు వచ్చే భక్తులు కోవిడ్ నెగటివ్ సర్టిఫికెట్ తీసుకుని రావాలని సూచించారు.
కేవలం ఐదు వేల మంది భక్తులు, అర్చకులు, అధికారుల సమక్షంలో మకరవిలక్కు ఉత్సవాలు జరగనున్నాయి. శబరిమల చరిత్రలోనే మొదటిసారి మకరసంక్రాంతి నాడు ఇలా నిరాడబరంగా పూజలు జరుగుతున్నాయి. ఈసారి ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. కట్టుదిట్టమైన భద్రత, కొవిడ్ ప్రొటోకాల్స్ నడుమ ఈ ఏడాది ఉత్సవాలు జరుగుతున్నాయి..