నీట్ ప్రశ్నాపత్రం లీకేజీపై దేశ రాజధాని దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద దాదాపు నెల రోజులుగా విద్యార్థులు ఆందోళన చేపడుతున్న సంగతి తెలిసిందే. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేనని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే విద్యార్థుల నిరసనలకు మద్దతుగా ప్రముఖ పర్యావరణవేత్త సోనమ్ వాంగ్ చుక్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. ఇక ఇటీవల కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో విద్యార్థులు పార్లమెంట్ ముట్టడి చేసిన సంగతి తెలిసిందే. విద్యార్థులను నిలువరించేందుకు పోలీసులు లాఠీ ఛార్జ్, బాష్ప వాయువును ప్రయోగించాల్సి వచ్చింది. అయితే విద్యార్థులపై ఇలాంటి దాడులు చేయడంతో ప్రతి పక్షాలతోపాటు అనేక మంది కేంద్ర ప్రభుత్వంపై మండిపడుతున్నారు.
ఇక ఇదే విషయంపై ప్రధాని మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు తన అధికారిక ఎక్స్ లో పోస్టు పెట్టారు. 'పరీక్ష పేపర్ లీక్ లో భాగమైన వారికి త్వరలోనే కఠినమైన శిక్ష పడుతుంది. దీని కోసం ఒక ఫాస్ట్-ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాం' అని తెలిపారు. ఈ విషయంలో అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు మోదీ స్పష్టం చేశారు. తమకు యువత సంక్షేమం, భవిష్యత్తే ముఖ్యమని వెల్లడించారు.
ఇదిలాఉంటే తాజాగా ఈ పరిణామాలపై బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కీలక ట్వీట్ చేశారు. ఆందోళనల్లో పాల్గొంటున్న విద్యార్థులు దయచేసి తమ ఇళ్లకు వెళ్లాలని కోరారు. వారి కోసం తల్లిదండ్రులు ఎదురుచూస్తుంటారని తెలిపారు. భద్రత, విద్య పరంగా యువతే దేశానికి ముఖ్యం అని అన్నారు.
ఇదే విషయంపై ప్రధాని మోదీ ట్వీట్ చేశారని.. దోషులకు కఠిన శిక్ష పడుతుందని తనకు పూర్తి విశ్వాసం ఉందని తెలిపారు. . విద్యార్థుల నిరసనలకు మద్దతుగా ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన ప్రముఖ పర్యావరణవేత్త సోనమ్ వాంగ్ చుక్ తక్షణమే దీక్షను విరమించాలని కోరారు. అవసరమైతే తన ఇంటి నుంచి సోనమ్ కు భోజనం పంపిస్తానని స్పష్టం చేశారు. సల్మాన్ ఖాన్ ట్వీట్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అంతకుముందు రోజు కూడా ఇదే అంశంపై సల్మాన్ ఖాన్ ట్వీట్ పెట్టారు. ప్రశ్నాపత్రం లీకేజీ చాలా తీవ్రమైన అంశంగా అభివర్ణించారు.