భారతీయ జనతా పార్టీలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఆ పార్టీలో సుదీర్ఘ కాలంగా అత్యంత క్రియాశీలకంగా వ్యవహరిస్తూ వస్తోన్న సీనియర్ నాయకుడొకరు అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. బీజేపీకి రాజీనామా చేశారు. కొద్దిసేపటి కిందటే పార్టీ అగ్ర నాయకత్వానికి తన రాజీనామా లేఖను పంపారు. ఆయన రాజీనామా పత్రాన్ని పార్టీ అగ్రనాయకత్వం ఆమోదించిందా లేదా అనే విషయం తెలియరావట్లేదు. దీనిపై త్వరలోనే ఓ స్పష్టత రానుంది. తన ఎక్స్ బయోలో కూడా మార్పులు చేశారు. బీజేపీ పదాన్ని తొలగించారు. ఇదే రాజీనామా వార్తలకు ప్రధాన కారణమని భావిస్తోన్నారు.
దీనిపై సీఎన్ఎన్- న్యూస్ 18 ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఆయన పేరు.. షెహజాద్ పూనావాలా. ఈ కథనం ప్రకారం షెహజాద్ పార్టీలో తన పదవికి, ప్రాథమిక సభ్యత్వానికీ రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాల వల్లే ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో పార్టీ గళాన్ని సమర్థవంతంగా వినిపించగల సామర్థ్యం ఉన్న షెహజాద్ పూనావాలా హఠాత్తుగా రాజీనామా చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
వివిధ జాతీయ అంశాలపై ప్రతిపక్షాల విమర్శలను తనదైన శైలిలో పదునైన వాదనలతో తిప్పికొట్టడంలో ఆయనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. కొన్నేళ్లుగా బీజేపీ మీడియా విభాగంలో కీలకమైన పాత్రను పోషిస్తోన్నారు. నేషనల్ టీవీ డిబేట్లల్లో కేంద్ర ప్రభుత్వ విధానాలు, పార్టీ నిర్ణయాలను ఆయన ఎంతో బలంగా సమర్థించేవారు. కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాలు, రాజకీయ వ్యూహాలపై ఆయనకున్న లోతైన అవగాహన బీజేపీ మీడియా మేనేజ్‌మెంట్‌కు ఎంతో ప్లస్ పాయింట్ అయింది. అటువంటి బలమైన వక్త హఠాత్తుగా పార్టీకి దూరం కావడం ఆ పార్టీ భవిష్యత్తు ప్రచార వ్యూహాలపై కొంత ప్రభావం చూపే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. ఈ పరిణామం వెలుగులోకి వచ్చినప్పటి నుంచి దేశ రాజధానిలో అనేక రకాల ఊహాగానాలు మొదలయ్యాయి. వ్యక్తిగత కారణాల వల్లే తాను పార్టీ నుంచి తప్పుకొంటోన్నానని పూనావాలా స్పష్టం చేసినప్పటికీ, దీని వెనుక ఇతర అంతర్గత రాజకీయ సమీకరణాలు లేదా అసమ్మతి ఏవైనా ఉన్నాయా అనే కోణంలో విశ్లేషణలు ఊపందుకున్నాయి. పార్టీ అగ్రనేతలు ఆయనతో మాట్లాడి రాజీనామాను ఉపసంహరింపజేసే ప్రయత్నాలు చేసే అవకాశం కూడా లేకపోలేదనే అభిప్రాయాలు సైతం ఉన్నాయి. ఈ హఠాత్ పరిణామం తర్వాత షెహజాద్ పూనావాలా భవిష్యత్తులో ఎటువైపు అడుగులు వేస్తారనేది రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆయన ఇతర పార్టీల వైపు చూస్తున్నారా లేదా కొంతకాలం పాటు ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రస్తుతానికి ఈ వ్యవహారంపై అటు షెహజాద్ పూనావాలా నుంచి గానీ, ఇటు బీజేపీ కార్యాలయం లేదా అగ్ర నేతల నుంచి గానీ ఎలాంటి అధికారిక నోట్ వెలువడలేదు. ఇంకాస్సేపట్లో ఈ రాజీనామాకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడయ్యే అవకాశం ఉందని సమాచారం.చంద్రుడిపై హ్యూజ్ క్రాష్- ఇక ఉండేది 5 రోజులు మాత్రమే..!!
భారత విద్యార్థులపై అమెరికా లక్ష డాలర్ల ఫీజు- OPT కి కోలుకోలేని దెబ్బ