కన్న కొడుకునే హత్య చేసిన తల్లిదండ్రులు - ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు..!!

గుజరాత్‌లోని రాజ్‌కోట్ జిల్లా గోండల్ తాలూకా గుండాలా గ్రామంలో ఒక 26 ఏళ్ల యువకుడి మరణం తీవ్ర విషాదాన్ని నింపింది. మొదట అంతా దీనిని సాధారణ ఆత్మహత్య అనే అనుకున్నారు. కానీ, ఆ మృతదేహానికి జరిగిన పోస్ట్‌మార్టం నివేదిక పోలీసుల చేతికి రావడంతో ఆ కేసు ఒక్కసారిగా ఊహించని మలుపు తిరిగింది. ఒక మరణం వెనుక దాగి ఉన్న అత్యంత షాకింగ్ నిజాలు చివరకు బయటపడ్డాయి.

పోలీసుల వివరాల ప్రకారం.. రామ్ భర్వాడ్ జూన్ 30న తన ఇంట్లో విగతజీవిగా పడి ఉన్నాడు. మొదట ఇది ఆత్మహత్యేనని ప్రచారం జరిగింది. అయితే మృతదేహంపై నిర్వహించిన పోస్ట్‌మార్టం పరీక్షల్లో పోలీసులకు తీవ్ర అనుమానాలు రేకెత్తించే అంశాలు వెలుగుచూశాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కుటుంబ సభ్యులను లోతుగా విచారించారు. ఆ విచారణలో వెల్లడైన నిజాలు అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసాయి.

ఒక్కొక్కటిగా వెలుగులోకి వచ్చిన దారుణం

పోలీసులు జరిపిన విచారణలో ఆ యువకుడి మరణం వెనుక నమ్మలేని నిజాలు బయటపడ్డాయి. రామ్‌కు మద్యం అలవాటు ఉందని, దానిపై ఇంట్లో తరచూ గొడవలు జరుగుతుండేవని తెలిసింది. అలాంటి గొడవ సమయంలోనే తండ్రి బాబూభాయ్ బాంబ్వా, తల్లి మణీషాబెన్ బాంబ్వా కలిసి కొడుకు రామ్‌కు బలవంతంగా ఆమ్లం (యాసిడ్) తాగించినట్లు తేలింది. ఆ తర్వాత అతని గొంతు నులిమి హత్య చేసినట్లు దర్యాప్తులో వెల్లడైందని పోలీసులు తెలిపారు.

“తల్లిదండ్రులు చెప్పిన ఆత్మహత్య కథనానికి పోస్ట్‌మార్టం ఫలితాలు ఎక్కడా సరిపోలలేదు. గట్టిగా నిలదీయడంతో వారు నేరాన్ని ఒప్పుకున్నారు.” అని రాజ్‌కోట్ రూరల్ ఎస్పీ విజయ్ సింగ్ గుర్జర్ తెలిపారు. అత్యంత దారుణంగా కన్నకొడుకునే తల్లిదండ్రులు హతమార్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

భార్య ఫిర్యాదుతో కేసు నమోదు

పోస్ట్‌మార్టం నివేదిక ద్వారా అసలు విషయం తెలియడంతో రామ్ భార్య తన అత్తమామలపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు ఆధారంగా పోలీసులు భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 103(1) కింద హత్య కేసు, సెక్షన్ 124 కింద ఆమ్లంతో తీవ్ర గాయానికి కారణం కావడం, సెక్షన్ 54 కింద ఉమ్మడి ఉద్దేశంతో చేసిన చర్యగా కేసులు నమోదు చేసి నిందితులను అరెస్టు చేశారు.

ఈ కేసులో తల్లిదండ్రుల అరెస్టుతో దర్యాప్తు మరింత కీలక దశకు చేరింది. ఆత్మహత్యగా కనిపించే ప్రతి మరణంలోనూ పోస్ట్‌మార్టం ఎంత ముఖ్యమో ఈ ఘటన మరోసారి నిరూపించింది.

English Summary

A tragic incident in Rajkot, Gujarat, saw a 26-year-old man murdered by his own parents. Initially, the death was reported as a suicide, but post-mortem results revealed the horrifying truth that he was forced to consume acid before being strangled. The parents have since confessed to the gruesome crime.