సిటీలో నివసించే వారికి లిఫ్ట్ అనేది ప్రతీ ఒక్కరి జీవితంలో ఒక భాగమైపోయింది. కింద నుంచి పైకి వెళ్లాలన్నా, పైనుంచి కిందికి రావలన్నా క్షణాల్లో తీసుకెళ్లే లిఫ్ట్‌ను మనం గుడ్డిగా నమ్ముతాం. అయితే, అదే లిఫ్ట్‌లో ప్రమాదం జరిగితే ఆ తప్పు ఎవరిది? బాధితులకు న్యాయం ఎలా జరుగుతుంది? అనే అంశంపై భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మకమైన తీర్పును వెలువరించింది.
లిఫ్ట్ ప్రమాదాలు సంభవిస్తే కేవలం ఒక్కరిని మాత్రమే బాధ్యులను చేయడం కుదరదని.. తయారీ సంస్థ, మెయింటెనెన్స్ ఏజెన్సీ, ఆ బిల్డింగ్ ఓనర్.. ఈ ముగ్గురిపైనే ఉమ్మడి బాధ్యత ఉంటుందని తేల్చిచెప్పింది.
'లిఫ్ట్' సాధారణ రవాణా వ్యవస్థే!
జస్టిస్ పి.ఎస్. నరసింహ, జస్టిస్ అలోక్ అరధేలతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును వెలువరిస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది. లిఫ్ట్‌ను ఒక "కామన్ కేరియర్" గా పరిగణించాలని కోర్టు స్పష్టం చేసింది. మనుషులు లిఫ్ట్ ఎక్కగానే తలుపులు మూసుకుపోతాయి.. ఆ క్షణంలో తమ ప్రాణాలను, రక్షణను పూర్తిగా ఆ యాంత్రిక వ్యవస్థ చేతిలోనే పెడతారు. అలాంటప్పుడు ప్రయాణికుల భద్రతను కాపాడాల్సిన మొదటి ప్రాథమిక బాధ్యత లిఫ్ట్ తయారు చేసిన కంపెనీ, దాన్ని నిర్వహించే ఏజెన్సీ, ఆ భవన యాజమాన్యానిదే అని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
2003లో కేంద్ర ప్రభుత్వానికి చెందిన 'రా' (R&AW) ప్రధాన కార్యాలయంలో జరిగిన ఒక విషాదకర ప్రమాదానికి సంబంధించి ఈ తీర్పు వెలువడింది. ఆ ప్రమాదంలో మాజీ దౌత్యవేత్త విపిన్ హండా దారుణంగా ప్రాణాలు కోల్పోయారు. లిఫ్ట్ 6, 7 అంతస్తుల మధ్య నిలిచిపోగా, రెస్క్యూ ఆపరేషన్ సమయంలో విపిన్ బయటకు వస్తుండగా లిఫ్ట్ ఒక్కసారిగా జారడంతో ఆయన తీవ్రంగా గాయపడి మరణించారు. ఈ కేసులో వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ (NCDRC) 2014లో ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ప్రముఖ 'ఓటిస్ ఎలివేటర్ కంపెనీ' సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే ఓటిస్ పిటిషన్‌ను కొట్టివేసిన కోర్టు, హండా కుటుంబానికి రూ. 3.01 కోట్ల పరిహారాన్ని 9 శాతం వడ్డీతో చెల్లించాలని స్పష్టం చేసింది. విచారణ సందర్భంగా "మానవ పొరపాటు వల్ల ప్రమాదం జరిగింది" అని ఓటిస్ కంపెనీ చెప్పిన వాదనలను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. సదరు లిఫ్ట్‌లో చాలా కాలంగా సాంకేతిక లోపాలు ఉన్నాయని తెలిసి కూడా కంపెనీ తగిన చర్యలు తీసుకోలేదని ఆక్షేపించింది. అలాగే సరైన పర్యవేక్షణ లేని మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్ (MES), ఫిర్యాదులు వచ్చినా పట్టించుకోని ప్రభుత్వ భవన యాజమాన్యం కూడా ఈ తప్పులో భాగస్వాములేనని కోర్టు నిర్ణయించింది. ఈ నష్టపరిహారంలో ఓటిస్ కంపెనీ 70 శాతం, ఎంఈఎస్ 25 శాతం, ప్రభుత్వ శాఖ 5 శాతం చొప్పున చెల్లించాలని బాధ్యతలను ఖరారు చేసింది. ప్రమాదం జరిగితే బాధితులు ప్రతి ఒక్కరి తప్పు ఎంత అని వెతుక్కుంటూ తిరగలేరని, బాధ్యులైన వారి నుంచి పూర్తి పరిహారం పొందే హక్కు వారికి ఉంటుందని కోర్టు తీర్పునిచ్చింది.2003 నాటి హైప్రొఫైల్ కేసుకు తుది ముగింపు!
ఎమ్మెల్యే కాకుండానే 6 నెలలకు పైగా మంత్రి పదవిలో.. ! సుప్రీం ఆశ్చర్యం..!
తప్పు ఎవరిదో తేల్చుకోవాల్సింది బాధితులు కాదు!
26 ఏళ్ల తర్వాత భర్తకు దక్కిన న్యాయం! మీర్జాపూర్ కేసులో సుప్రీం సంచలన తీర్పు..