మగాళ్లకు షాక్: అక్రమ సంబంధాలపై సుప్రీం సంచలన తీర్పు

సాధారణంగా భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చినప్పుడు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం సహజం. ముఖ్యంగా భర్తకు వేరే మహిళతో అక్రమ సంబంధం ఉందనే అనుమానం వస్తే.. దాన్ని కోర్టులో నిరూపించడం భార్యకు చాలా పెద్ద సవాల్‌గా మారుతుంది. తగిన సాక్ష్యాలు లేక ఎంతోమంది మహిళలు అన్యాయానికి గురవుతున్నారు. అయితే, ఇలాంటి భార్యలకు ఊరటనిస్తూ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఒక సంచలన తీర్పును ఇచ్చింది. భర్త వివాహేతర సంబంధాన్ని (Adultery) నిరూపించేందుకు అతడి ఫోన్ కాల్ డేటా రికార్డులు (CDRs), హోటల్ బుకింగ్ వివరాలను సేకరించే హక్కు భార్యకు ఉందని స్పష్టం చేసింది.

Advertisement

తన భర్త కాల్ డేటా, హోటల్ రికార్డులను సేకరించేందుకు అనుమతించాలంటూ ఓ భార్య దాఖలు చేసిన పిటిషన్‌ను గతంలో ఫ్యామిలీ కోర్టు, ఢిల్లీ హైకోర్టు సమర్థించాయి. అయితే, దీనిని సవాల్ చేస్తూ భర్త సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఈ అప్పీల్‌ను తాజాగా విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. భర్త పిటిషన్‌ను పూర్తిగా కొట్టివేసింది. హైకోర్టు ఆదేశాల్లో జోక్యం చేసుకునేందుకు నిరాకరిస్తూ, భార్యకు అనుకూలంగా వచ్చిన తీర్పును ఖరారు చేసింది. వైవాహిక బంధంలో భాగస్వామి మోసానికి పాల్పడినప్పుడు, ఆ విషయాన్ని రుజువు చేసుకునేందుకు అవసరమైన సాక్ష్యాధారాలను అడిగే హక్కు అవతలి వ్యక్తికి ఉంటుందని ఈ కీలక తీర్పు ద్వారా తేల్చిచెప్పింది.

Advertisement

గోప్యత హక్కు ఎప్పుడూ సంపూర్ణం కాదు!

ఈ కేసు విచారణ సందర్భంగా న్యాయస్థానాలు 'వ్యక్తిగత గోప్యతా హక్కు' (Right to Privacy) పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాయి. భర్త వ్యభిచారానికి పాల్పడుతున్నాడన్న ఆరోపణలను రుజువు చేయడానికి భార్య వద్ద బలమైన ప్రత్యామ్నాయాలు లేనప్పుడు, కోర్టులు తప్పనిసరిగా జోక్యం చేసుకుని సహాయపడాలని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. వ్యక్తిగత గోప్యత హక్కు అనేది అన్ని సమయాల్లోనూ సంపూర్ణమైనది కాదని స్పష్టం చేసింది. వివాహాల రద్దు, గృహ హింస కేసుల్లో ఆరోపణల నిజానిజాలు తేల్చడానికి ఇలాంటి కఠినమైన సాక్ష్యాధారాలు ఎంతో అవసరమని న్యాయ నిపుణులు కూడా విశ్లేషిస్తున్నారు.

Advertisement

అసలేం జరిగిందంటే..?

ఈ కేసు నేపథ్యాన్ని గమనిస్తే.. సదరు దంపతులకు 1998 డిసెంబర్ 4న వివాహం జరిగింది. వీరికి 2000 సంవత్సరంలో ఒక కుమార్తె జన్మించింది. అయితే తన భర్త తనను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడని, వేరొక మహిళతో వివాహేతర సంబంధం కలిగి ఉన్నాడని భార్య విడాకుల పిటిషన్ దాఖలు చేసింది. 2022 ఏప్రిల్-మే మధ్య కాలంలో తన భర్త జైపూర్‌లోని ఒక హోటల్‌లో వేరే మహిళతో కలిసి ఉన్నాడని ఆమె ఆరోపించింది.

సీసీటీవీ ఫుటేజ్ లేదు.. కానీ ప్రత్యామ్నాయం ఉంది!

నిజానిజాలను తేల్చేందుకు సదరు హోటల్ సీసీటీవీ విజువల్స్ భద్రపరచాలని భార్య మొదట కోరింది. కానీ హోటల్ నిబంధనల ప్రకారం అప్పటికే ఆ ఫుటేజ్ డిలీట్ అయిపోయింది. దీంతో ఆమె ప్రత్యామ్నాయంగా హోటల్ బుకింగ్ వివరాలు, గదుల చెల్లింపు రశీదులు, గుర్తింపు కార్డులతో పాటు భర్త ఫోన్ కాల్ రికార్డులను సమర్పించేలా ఆదేశించాలని కోరగా ఫ్యామిలీ కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Advertisement

దీనిపై భర్త తరపు లాయర్లు ప్రసిద్ధ 'పుట్టుస్వామి కేసు' లోని గోప్యతా హక్కును ఆధారంగా చేసుకుని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కానీ కోర్టు కేవలం భర్తకు సంబంధించిన రికార్డులను మాత్రమే అడిగిందని, ఇతర వ్యక్తుల ప్రైవసీకి భంగం కలగడం లేదని హైకోర్టు స్పష్టం చేసింది. పైగా సదరు సాక్ష్యాధారాలను సీల్డ్ కవర్‌లో కోర్టుకు అందించడం ద్వారా గోప్యతను కాపాడవచ్చని పేర్కొంది. సుప్రీంకోర్టు సైతం ఈ వాదనలతో ఏకీభవించడంతో భార్యల హక్కులకు చట్టబద్ధంగా మరింత బలం చేకూరినట్లయింది.

English Summary

Supreme Court upholds landmark ruling allowing wives to access a husband's phone call records (CDRs) and hotel booking details as essential evidence to legally prove extramarital affairs.