విజయ్ ఫస్ట్ బడ్జెట్: సూపర్ క్లీన్- సూపర్ క్యాంపస్: వెట్రి ల్యాప్‌టాప్ స్కీమ్: ఆ శాఖకు వేల కోట్లు

తమిళనాడు రాజకీయాల్లో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ టీవీకే ప్రభుత్వం తన మొట్టమొదటి బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఈ వార్షిక బడ్జెట్‌ ప్రతిపాదనలను సభ ముందుకు తెచ్చింది. ఆర్థిక శాఖ మంత్రి మరియా విల్సన్ కొద్దిసేపటి కిందటే దీన్ని టేబుల్ చేశారు. బడ్జెట్ ప్రసంగం వినిపించారు. తమిళనాడు సమగ్ర ప్రగతి కోసం కట్టుబడి ఉన్నామని, రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపించేలా ఈ ప్రతిపాదనలకు రూపకల్పన చేశామని అన్నారు.

Advertisement

ముఖ్యమంత్రి విజయ్ సారథ్యంలో అధికార టీవీకే ప్రభుత్వం ప్రవేశపెడుతున్న మొదటి బడ్జెట్ కావడంతో ప్రజల్లో దీనిపై భారీ ఆశలు నెలకొన్నాయి. ఎన్నికల సమయంలో ఇచ్చిన సంక్షేమ హామీలు ఎలా అమలువుతాయనే అంశంపై ఉత్కంఠత నెలకొంది. ప్రధాన ప్రతిపక్షం డీఎంకే కూడా బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ ఆధ్వర్యంలో డీఎంకే శాసనసభ్యులు అసెంబ్లీ ప్రారంభానికి ముందే సమావేశమై సభలో సర్కారును నిలదీసేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై సుదీర్ఘంగా చర్చించారు.

Advertisement

బడ్జెట్ లో విద్యారంగానికే పెద్ద పీట వేశారు. పాఠశాల విద్యా మంత్రిత్వశాఖకు అత్యధికంగా రూ. 44,527 కోట్లు, ఉన్నత విద్యకు రూ. 8,393 కోట్లను కేటాయించారు. కాలేజీ విద్యార్థుల్లో స్కిల్ డెవలప్మెంట్ కోసం ప్రవేశపెట్టిన వెట్రి ల్యాప్‌టాప్ పథకం కింద రూ.2,000 కోట్లను ప్రకటించారు. ప్రభుత్వ పాఠశాలల్లో పారిశుధ్య లోపాలను నివారించి మెరుగైన వసతులు కల్పించడానికి రూ.139 కోట్లతో సూపర్ క్లీన్- సూపర్ క్యాంపస్ పథకాన్ని ప్రారంభించారు. దీన్ని 10,000 పాఠశాలల్లో అమలు చేయనున్నారు.

బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం: ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలకు ఛాన్స్
Advertisement

డిజిటల్ విప్లవానికి అనుగుణంగా తమిళనాడును తీర్చిదిద్దేందుకు విద్యావేత్తలు, పారిశ్రామిక నిపుణులతో కూడిన కమిటీ ద్వారా సరికొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యప్రణాళికను రూపొందిస్తామని ప్రభుత్వం తెలిపింది. న్యాయ విద్యను మరింత అందుబాటులోకి తెచ్చేందుకు రాష్ట్రంలో ప్రత్యేకంగా ఓ ప్రభుత్వ లా కాలేజీని కూడా ఏర్పాటు చేయనున్నారు. ఇక జాతీయ స్థాయి ప్రవేశ పరీక్ష నీట్ (NEET) పట్ల వ్యతిరేకతను ఈ బడ్జెట్‌లోనూ కొనసాగించారు.

బంగారం ధరల్లో స్ట్రాంగ్ ర్యాలీ- అటు వైపు పరుగులు

ఇంటర్ మార్కుల ఆధారంగానే వైద్య సీట్లను భర్తీ చేయాలని, నీట్ రద్దు కోసం కేంద్రంపై తమ ప్రభుత్వం పోరాడుతూనే ఉంటుందని ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు. ప్రస్తుతం ఎదుర్కొంటోన్న ఆర్థిక సంక్షోభం, అప్పుల ఊబి నుంచి గట్టెక్కడానికి తమ ప్రభుత్వం గట్టి చర్యలు చేపడుతోందని మంత్రి మరియా విల్సన్ పేర్కొన్నారు. నిధుల కొరత ఉన్నప్పటికీ, ఎన్నికల నాటి సంక్షేమ పథకాలను నిలిపివేయకుండా వాటిని సమర్థవంతంగా అమలు నిర్వహణ చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు వివరించారు.

Advertisement
విజయ్- ఉదయనిధి: ఢీ అంటే ఢీ: ఒక్క మాట మాట్లాడినా సహించేది లేదు

ఈ క్రమంలో తిరుక్కురళ్‌లో ప్రస్తావించిన 'అరం, పొరుళ్, ఇన్బమ్' అనే జీవన సూత్రాలను ఆయన చదవి వినిపించారు. వీటి ఆధారంగా ఆదర్శవంతమైన, అవినీతి రహిత ప్రజా రంజక పాలనను అందించడమే తమ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని మంత్రి విల్సన్ స్పష్టం చేశారు. సామాజిక న్యాయశాఖకు ఈ బడ్జెట్‌లో రూ.3,937 కోట్లు కేటాయించారు. ప్రముఖ సంఘ సంస్కర్త అయోధ్యదాస పండితార్ నివాస స్థలాల సమగ్ర అభివృద్ధి పథకానికి ప్రత్యేకంగా రూ.300 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించారు.

Advertisement

రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో నూతనంగా 500 అంగన్‌వాడీ కేంద్రాలను నిర్మించనున్నట్లు ఆర్థిక మంత్రి మరియా విల్సన్ స్పష్టం చేశారు. క్రీడా రంగానికి నూతన జవసత్వాలు కల్పించేలా యువజన సంక్షేమం, క్రీడల విభాగానికి ప్రభుత్వం రూ.1,051 కోట్లు కేటాయించింది ప్రభుత్వం. అందులో గ్రామీణ ప్రాంతాల్లో అంతరించిపోతున్న సంప్రదాయ గ్రామీణ క్రీడలను సంరక్షించి, యువకులలో ఆసక్తిని రేకెత్తించేందుకు రూ.42 కోట్లు ప్రత్యేకంగా కేటాయించారు.

నిధుల కొరత, రుణాల భారం వంటి ఆర్థిక సమస్యలు చుట్టుముట్టినప్పటికీ ప్రజలకు మేలు చేసే పంథాలో సరికొత్త పథకాన్ని ప్రవేశపెడుతున్నామని, తాము ప్రతిపాదించని ఈ మొదటి బడ్జెట్ ద్వారా చిరస్మరణీయ ముద్రను వేస్తామని మరియా విల్సన్ పేర్కొన్నారు. పారదర్శక పాలనను ప్రజల ముందుకు తెచ్చేందుకు ఓ స్పష్టమైన రోడ్ మ్యాప్‌ను బడ్జెట్ లో రూపకల్పన చేశామని, దీనికి అనుగుణంగా అవన్నీ అమలులోకి వస్తాయని చెప్పారు.

English Summary

Tamil Nadu Finance Minister Dr N Marie Wilson presented the TVK government’s first Budget. The presentation took place in the presence of Chief Minister Vijay, marking the first budget event under the new TVK administration.