సొంత దేశంలోనే ఒక మనిషి జీవితం కటిక చీకటైపోయింది. సినిమా కథలను తలపించేలా, సరిహద్దు గ్రామంలోని కొట్టంలో ఏళ్ల తరబడి ఇనుప గొలుసుల బంధీగా మారాడు. మాట మరిచిపోయి, గతాన్ని కోల్పోయి, గేదెల మధ్య నరకం అనుభవించిన ఒక తమిళ యువకుడు.. రెండు దశాబ్దాల తర్వాత మళ్లీ తన తల్లి ఒడికి చేరుకున్న వైనం కంటతడి పెట్టిస్తోంది.
అది 2003వ సంవత్సరం. తమిళనాడులోని కోయంబత్తూరు సమీపంలో ఉన్న ఒక చిన్న గ్రామంలో 16 ఏళ్ల ప్రకాశం తన తమ్ముడితో గొడవపడి కోపంతో ఇంట్లోంచి బయటకు వచ్చేశాడు. ఆ క్షణంలో వేసిన ఒక్క అడుగు అతడి జీవితాన్ని ఏకంగా 22 ఏళ్ల పాటు చీకటిమయం చేస్తుందని ఆ టీనేజ్ కుర్రాడు ఊహించలేదు. ప్రయాణం దారి తప్పి, ఆఖరికి తమిళనాడు నుంచి ఏకంగా 2,500 కిలోమీటర్ల దూరంలో ఉన్న పంజాబ్ సరిహద్దు గ్రామానికి చేరుకున్నాడు.
పంజాబ్‌లోని అమృతసర్ జిల్లా, భారత్-పాకిస్తాన్ సరిహద్దుకు కేవలం 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న జస్రౌర్ గ్రామం అతడికి నరకకూపంగా మారింది. అక్కడి ఒక పశువుల ఫామ్ యజమాని అతడిని బానిసగా మార్చుకున్నాడు. పగలేమో పాతిక గేదెల పేడ ఎత్తడం, కొట్టాలు శుభ్రం చేయడం.. రాత్రి కాగానే ఆరుబయట ఉన్న ఇనుప నులక మంచానికి గొలుసులతో కట్టేయడం! వానొచ్చినా, చలిపెట్టినా ఆ తడి దుప్పటితోనే పశువుల మధ్య పడుకునేవాడు. ఒంటిపై దుస్తులు మురికిపట్టి, మనిషి కంటే పశువులే శుభ్రంగా ఉన్నాయా అనేలా తయారయ్యాడు. చేతిలో రూపాయి లేదు, సరిగా తిండి లేదు, మాట్లాడేందుకు మనిషి లేడు.. అలా 15 ఏళ్లు దారుణమైన వెట్టిచాకిరీ అనుభవించాడు. 2022లో ప్రకాశం అనే మనిషి గొలుసులతో బంధించి ఉన్న ఒక చిన్న వీడియో స్థానికంగా వైరల్ అయ్యింది. దాని ఆధారంగా 'అప్నా ఫర్జ్ సేవా సొసైటీ' అనే స్వచ్ఛంద సంస్థ సభ్యులు అక్కడికి చేరుకుని అతడికి విముక్తి కల్పించారు. కానీ, అప్పటికే 15 ఏళ్ల నరకం వల్ల అతడి మానసిక స్థితి పూర్తిగా దెబ్బతింది. సొంత పేరు, ఊరు కూడా చెప్పలేని స్థితి. ఆ తర్వాత ఆసుపత్రిలో సుదీర్ఘ చికిత్స అందించగా, నెమ్మదిగా అతడికి మాటలు, పాత జ్ఞాపకాలు రావడం ప్రారంభమయ్యాయి. తమిళనాడు, కోయంబత్తూరు, అరుప్పుకొట్టై వంటి పదాలు అతడి నోటి నుంచి రావడం అధికారులకు పెద్ద ఆధారంగా మారింది. సామాజిక కార్యకర్తలు, విలేకరుల సహాయంతో ప్రకాశం ఇచ్చిన ఆధారాలను బట్టి తమిళనాడులోని అతడి కుటుంబ ఆచూకీ కనుగొన్నారు. కొడుకు ఎప్పటికైనా తిరిగి వస్తాడనే ఆశతో 22 ఏళ్లుగా కంటిమీద కునుకు లేకుండా గడిపిన సుందరి అనే తల్లికి ఈ వార్త అమృతంలా అనిపించింది. వీడియో కాల్‌లో కొడుకుని చూసి ఆమె భోరున విలపించింది. తమిళనాడు ప్రభుత్వ యంత్రాంగం, పంజాబ్ అధికారులు వేగంగా స్పందించి, ప్రకాశంను బంధవిముక్తుడిని చేసి పునరావాస పథకాల కింద సాయం అందించారు. 22 ఏళ్ల క్రితం కంటిపాపలాంటి కొడుకుని కోల్పోయిన ఆ తల్లి, ఇప్పుడు ఆ కొడుకు చేయి పట్టుకుని మళ్లీ సొంతూరు బాట పట్టింది.పాక్ సరిహద్దులో 15 ఏళ్ల 'గొలుసుల' నరకం!
Video: పసిబిడ్డలపై పైశాచికత్వం.. నగ్నంగా కట్టేసి నరకం చూపించారు
వెలుగులోకి తెచ్చిన చిన్న వీడియో.. నెమ్మదిగా తేరుకున్న జ్ఞాపకాలు
రాజు క్షమాభిక్ష.. 57 మంది మృతి! ఒక్క రాత్రిలో మారిన దేశ తలరాత
22 ఏళ్ల నిరీక్షణ.. కన్నీటి కథకు సుఖాంతం!