Udhayanidhi Stalin: ఉదయనిధి స్టాలిన్ విడుదల.. మద్రాస్ హైకోర్టు ఆదేశాలతో

నటి త్రిషపై డబుల్ మీనింగ్ వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో అరెస్ట్ అయిన తమిళనాడు మాజీ ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్‌ విడుదల అయ్యారు. మద్రాస్ హైకోర్టు ఆదేశాలతో సెంగిపట్టి పోలీసులు ఉదయనిధిని విడుదల చేశారు. దాదాపు గంటన్నరపాటు ఉదయనిధిని పోలీసులు విచారించారు. ఈ లోపు స్టేషన్ వద్దకు పెద్ద ఎత్తున డీఎంకే పార్టీ శ్రేణులు తరలివచ్చారు. ఇక స్టేషన్ నుంచి బయటకు వచ్చిన స్టాలిన్ కు డీఎంకే కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. వారికి అభివాదం చేస్తూ ఉదయనిధి స్టాలిన్ వెళ్లిపోయారు.

Advertisement

సినీ నటి త్రిషను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై ఉదయనిధి స్టాలిన్ ను తన నీలాంకారై నివాసం నుంచి పోలీసులు అరెస్టు చేశారు. అక్కడి నుంచి ఆయన్ను తంజావూరుకు తీసుకెళ్లారు. ఈ క్రమంలో ఉదయనిధి తరఫున లాయర్లు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. వెంటనే ఆయన్ను విడుదల చేయాలని ఆదేశాలు ఇవ్వాల్సిందిగా కోర్టును కోరారు. దాంతో ఉదయనిధిని ప్రశ్నించిన వెంటనే విడుదల చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇక ఈ వ్యవహారంపై తమిళనాడు మాజీ సీఎం, డీఎంకే అధినేత స్టాలిన్ తీవ్రంగా స్పందించారు.

Advertisement

ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. "అహంకారం వినాశనానికి దారి తీస్తుంది.. ఆ అహంకారం హద్దులు దాటి కొనసాగితే, ఆ వినాశనాన్ని మరింత వేగవంతం చేస్తుంది.. పతనమవుతారు" అని హెచ్చరించారు. సీఎం విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కేలా నియంతలా వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు. విజయ్ రీల్స్ సీఎం అని అభివర్ణించారు. తన కుమారుడు ఉదయనిధి ఎవరిపైనా అభ్యంతరకర వ్యాఖ్యలు చేయలేదని, ఒకవేళ అలా చేసినట్లు నిరూపిస్తే తక్షణమే క్షమాపణలు చెబుతాడని తెలిపారు. బడ్జెట్ సమావేశాలకు ముందు ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ ను అసెంబ్లీకి రాకుండా అడ్డుకునేందుకే ఈ నాటకమని కీలక వ్యాఖ్యలు చేశారు.

Advertisement

మరోవైపు ఉదయనిధి స్టాలిన్ వ్యవహారంలో టీవీకే ప్రభుత్వం తీసుకున్న చర్యలపై డీఎంకే నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఉదయనిధి ఎవరినీ ఉద్దేశించి తప్పుగా మాట్లాడలేదని తెలిపారు. టీవీకే ప్రభుత్వం కావేరీ జలాల సాధన, మేకెదాతు డ్యామ్ నిర్మాణాన్ని అడ్డుకోవడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. సీఎం విజయ్ ను 'డమ్మీ సీఎం' గా అభివర్ణించారు.