గవర్నర్లుగా మోదీ కేబినెట్ లోని ముగ్గురు మంత్రులు, TDPకి పదవి ఫిక్స్..!?

ఢిల్లీ కేంద్రంగా కీలక రాజకీయ మంత్రాంగం కొనసాగుతోంది. కేంద్ర మంత్రి వర్గ విస్తరణకు రంగం సిద్ధం అవుతోంది. ఈ నెల 20 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలకు ముందే కేబినెట్ ప్రక్షాళనతో పాటుగా బీజేపీ కొత్త కార్యవర్గం నియామకం పూర్తి చేయాలని భావిస్తున్నారు. కొందరు మంత్రులకు పార్టీ బాధ్యతలు.. శాఖల మార్పుతో పాటుగా కొత్త వారికి అవకాశం దక్కనుంది. ఇదే సమయంలో ప్రస్తుతం సీనియర్లుగా ఉన్న ముగ్గురికి గవర్నర్ గా బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. టీడీపీకి మరో గవర్నర్ పదవి ఖాయంగా కనిపిస్తోంది.

Advertisement

ఈ నెలలో కేంద్రంలో రాజకీయంగా కొత్త సమీకరణలు చోటు చేసుకోనున్నాయి. కీలక బిల్లులను ఈ నెల 20 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశ పెట్టేందుకు డిసైడయ్యారు. ఈ క్రమంలో భాగంగానే బీజేపీ జాతీయ కార్యవర్గం.. కేంద్ర మంత్రివర్గ ప్రక్షాళనకు తుది కసరత్తు కొనసాగుతోంది. బీహార్ మాజీ సీఎం నితీష్ కుమార్, రాఘవ చద్దా సహా పలువురికి కేంద్ర మంత్రి వర్గంలో అవకాశం కల్పించాల్సి ఉంది.

Advertisement

శివసేన ఉద్ధవ్ థాక్రే వర్గం నుంచి ఆరుగురు ఎంపీలు .. 20 మందికి పైగా ఎంపీలు తృణమూల్ కాంగ్రెస్ నుంచి విడిపోయి బయటకు వచ్చారు. వారిలో కొందరికి మంత్రివర్గంలో అవకాశం దక్కనుంది. ఆర్దిక, విద్య, రైల్వే, విమానయాన, వ్యవసాయ శాఖలు కొత్త వారికి అప్పగించనున్నారు. శక్తికాంత్ దాస్ లేదా పీయూష్ గోయల్ కు అర్దిక శాఖ అప్పగించి... నిర్మలా సీతారామన్ కు విద్యాశాఖ అప్పగిస్తారని ప్రచారం సాగుతోంది.

కాగా, ప్రస్తుతం కేంద్ర మంత్రులుగా ఉన్న ముగ్గురికి గవర్నర్లుగా అవకాశం ఖాయమైందని ఢిల్లీ వర్గాల సమాచారం. మనోహర్ లాల్ ఖట్టర్, పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ, మహేంద్ర నాధ్ పాండే లకు గవర్నర్లుగా అవకాశం ఇస్తారని తెలుస్తోంది. ఇదే సమయంలో ఎన్డీఏ లో భాగస్వామిగా ఉన్న తెలుగు దేశంకు మరో గవర్నర్ పదవి ఖాయమైందని సమాచారం. ఇప్పటి కే టీడీపీ కోటాలో మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు గవర్నర్ గా అవకాశం దక్కించుకున్నారు.

Advertisement

రెండో పదవి సైతం ఇవ్వటానికి బీజేపీ నాయకత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. రెండో పదవి టీడీపీ నుంచి బీసీ వర్గానికి ఇస్తారని సమాచారం. అందులో యనమల, కేఈ క్రిష్ణమూర్తి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. అయితే.. బీసీ మహిళ కు అవకాశం దక్కే ఛాన్స్ ఉందని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. గవర్నర్ పదవి ఖరారైతే.. ఎవరిని ఎంపిక చేస్తారనేది చంద్రబాబు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. దీంతో.. కేంద్ర మంత్రివర్గ ప్రక్షాళనతో పాటుగా గవర్నర్ల నియామకం పైనా తుది కసరత్తు కొనసాగుతోంది.

English Summary

Union Cabinet reshuffle is likely to see three sitting Union Ministers appointed as Governors, with major changes expected.