ఈ20 పెట్రోల్ వివాదం: కోర్టుకెక్కిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ!

ఈ20 పెట్రోల్ పాలసీ వివాదం నేపథ్యంలో సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారంపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ న్యాయ పోరాటానికి దిగారు. తనపై వస్తున్న తప్పుడు సమాచారాన్ని, నకిలీ సోషల్ మీడియా పోస్టులను తొలగించాలని కోరుతూ నితిన్ గడ్కరీ బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆయన ఏకంగా రూ.11 కోట్ల నష్టపరిహారాన్ని కూడా డిమాండ్ చేశారు. తన ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా ఉన్న అభ్యంతరకర కంటెంట్‌ను వెంటనే తొలగించాలని ఆయన ధర్మాసనాన్ని కోరారు.

Advertisement
E20 Petrol: తిరుగుబాటు మొదలైంది, ఆగస్టు 4న పార్లమెంట్ మార్చ్!
Advertisement

ఈ20 పెట్రోల్ పాలసీకి సంబంధించి సోషల్ మీడియాలో తనపై తప్పుడు, తప్పుదోవ పట్టించే సమాచారం వ్యాప్తి చెందుతోందని నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. తన ప్రతిష్టను దెబ్బతీయడానికే ఇలాంటి కంటెంట్ ప్రచారం జరుగుతోందని ఆయన ఆరోపిస్తున్నారు. అందుకోసం ఏఐ, డీప్‌ఫేక్ టెక్నాలజీని ఉపయోగించి ఫేక్ వీడియోలను సృష్టించారని గడ్కరీ అన్నారు. ఇలాంటి నిరాధారమైన కామెంట్స్, కంటెంట్‌ను గూగుల్, మెటా, ఎక్స్ వంటి ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల నుంచి వెంటనే తొలగించేలా ఉత్తర్వులు ఇవ్వాలని నితిన్ గడ్కరీ న్యాయస్థానాన్ని విజ్ఞప్తి చేశారు.

ఆగస్టు 5న విచారణ
ఈ కేసులో తదుపరి విచారణ ఆగస్టు 5న బొంబాయి హైకోర్టులో జరగనుంది. గత విచారణ సందర్భంగా కేసులో ప్రతివాదులుగా ఉన్న కొన్ని పక్షాలకు పిటిషన్ కాపీలు ఇంకా అందలేదని కోర్టు దృష్టికి వచ్చింది. ఈ క్రమంలో స్పందించిన న్యాయస్షానం.. కేసుతో సంబంధం ఉన్న అన్ని పక్షాలకు పిటిషన్ కాపీలను అందించాలని గడ్కరీ తరఫు న్యాయవాదులను ఆదేశించింది.

Advertisement
బండ్లు అవుట్: రాజుకున్న నిప్పు- కేంద్రానికి సెగ: ఈ నంబర్ కు వాట్సప్ చేస్తే

తన పేరు, ఫోటోలను ఉపయోగించి సోషల్ మీడియాలో అనేక పోస్టులు వైరల్ అయ్యాయని నితిన్ గడ్కరీ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పోస్టులు ఆయనను నేరుగా E20 పెట్రోల్ పాలసీతో ముడిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ పోస్టులు పూర్తిగా అవాస్తవమైనవని, తప్పుదోవ పట్టించేవని, తన ప్రతిష్టకు భంగం కలిగించేవని గడ్కరీ వాదిస్తున్నారు. ఈ20 పెట్రోల్‌కు 20 శాతం ఇథనాల్ కలిపే ప్రణాళిక పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ పరిధిలో ఉందని ఆయన కోర్టుకు తెలిపారు. తాను రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రిని అని.. ఈ విధానాన్ని రూపొందించడంలో గానీ, అమలు చేయడంలో గానీ తనకు ఎలాంటి పాత్ర లేదని ఆయన అన్నారు.

Advertisement

ప్రభుత్వం తీసుకొచ్చే విధానాలపై ఎలాంటి విమర్శలు, చర్చలు అయినా జరగవచ్చని.. వాటిని అణచివేయడం తన ఉద్దేశం కాదని నితిన్ గడ్కరీ చెప్పుకొచ్చారు. అయితే తప్పుడు సమాచారం, ఉద్దేశపూర్వకంగా పరువు తీసే కంటెంట్‌పై చట్టపరమైన చర్యలు అవసరమని ఆయన అన్నారు. కొంతకాలంగా సోషల్ మీడియాలో ఈ20 పెట్రోల్ పాలసీ చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గడ్కరీ దాఖలు చేసిన పిటిషన్ పై బాంబే హైకోర్టు ఆగస్టు 5న ఇచ్చే తీర్పు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లకు, డీప్‌ఫేక్ వాడేవారికి కీలకంగా మారనుంది.

English Summary

Union Minister Nitin Gadkari Files an Rs.11 Crore Defamation Suit in Bombay High Court Agains Fake E20 petrol posts and AI deepfakes. Hearing set for August 5.