బెంగళూరు ప్యాలెస్ రోడ్డులో కింగ్ కోబ్రా ప్రత్యక్షం: అసలే ఫుల్ ట్రాఫిక్

బెంగళూరు అనగానే ఐటీ ఉద్యోగులు, ఆకాశాన్నంటే భవనాలతో పాటు కిలోమీటర్ల స్తంభించిపోయే ట్రాఫిక్ జామ్‌లు గుర్తుకు రావడం సహజం. నిత్యం వాహనాలతో కిక్కిరిసిపోయే సిలికాన్ సిటీ రహదారులపై ప్రయాణించడమంటే సర్కస్ ఫీట్లు చేయాల్సి ఉంటుంది చాలా సందర్భాల్లో. సాధారణంగా మెట్రో పనులు, ట్రాఫిక్ సిగ్నల్స్ పని చేయకపోవడం, బాటిల్ నెక్ రోడ్లు, ఇరుకైన రహదారులు, అప్పుడప్పుడూ భారీ వర్షాల వల్ల ఇక్కడ ట్రాఫిక్ నిలిచిపోతుంటుంది.

Advertisement

బెంగళూరులో ఓ ప్రధాన రహదారిపై ఓ నాగపాము కారణంగా వాహనాలు నిలిచిపోయిన విచిత్ర ఉదంతం ఇది. నగరంలో అత్యంత రద్దీతో కూడుకుని ఉండే ప్యాలెస్ రోడ్డుపై రద్దీగా ఉండే సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ భారీ నాగపాము రోడ్డు మధ్యలోకి వచ్చి తిష్ట వేసింది. వాహనాల రాకపోకలు సాగుతున్నా ఏమాత్రం బెదరకుండా, రోడ్డు మధ్యలోనే పడగ విప్పి రాజసాన్ని ప్రదర్శించింది. ఆ పాము ఉన్న తీరు చూస్తే సాయంత్రం వేళ నిశ్శబ్దంగా ధ్యానం చేసుకుంటున్నట్లు అనిపించింది.

Advertisement

రోడ్డు మధ్యలో భీకరంగా పడగ విప్పి, బుసలు కొడుతున్న ఆ సర్పరాజాన్ని చూసి వాహనదారులు ఒక్కసారిగా బ్రేకులు వేశారు. అకస్మాత్తుగా సంభవించిన ఈ పరిణామంతో ప్యాలెస్ రోడ్డులో కొన్ని కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. కార్లు, ద్విచక్ర వాహనాల హారన్ల శబ్దాలు మిన్నుముట్టినా ఆ పాము మాత్రం అక్కడి నుంచి కదల్లేదు. బెంగళూరులో ట్రాఫిక్ జామ్ కావడానికి వాహనాలే అవసరం లేదని, ఒక పాము పడగ విప్పితే చాలంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు దీనిపై విభిన్నంగా స్పందిస్తున్నారు.

ఈ సమాచారం అందుకున్న వెంటనే ట్రాఫిక్ పోలీసులు ప్యాలెస్ రోడ్డుకు చేరుకున్నారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. వన్యప్రాణి సంరక్షణ నిపుణులు, స్నేక్ క్యాచర్లకు సమాచారం ఇచ్చారు. వారు ఆ నాగుపామును సురక్షితంగా రక్షించారు. దానిని పట్టుకుని జనసంచారం లేని చోట వదిలిపెట్టారు. ఆ తర్వాతే పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేయాల్సి వచ్చింది. దీంతో ప్యాలెస్ రోడ్డులో వాహనాల రాకపోకలు యథాతథంగా సాగాయి.

Advertisement

బెంగళూరులో ప్యాలెస్ గ్రౌండ్స్, కబ్బన్ పార్క్, లాల్‌బాగ్ వంటి గ్రీన్ కారిడార్స్ ఉన్నాయి. ముఖ్యంగా ప్యాలెస్ రోడ్డు పరిసర ప్రాంతాల్లో దట్టమైన చెట్లు అధికం. దీని వల్ల సరీసృపాల సంచారం సహజంగానే ఎక్కువగా ఉంటుందీ రోడ్డులో. వర్షాకాలం లేదా అధిక ఉష్ణోగ్రతలు నమోదైన సందర్భాల్లో అవి ఇలా రోడ్లపైకి వస్తుంటాయి. ఎలుకలు, కప్పల వేటలో భాగంగా కూడా ఇవి అప్పుడప్పుడు రద్దీ రహదారులపైకి వచ్చేస్తుంటాయి.

ఇలాంటి వన్యప్రాణులు నివాస ప్రాంతాల్లో గానీ, రహదారులపై గానీ కనిపిస్తే ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని వన్యప్రాణి విభాగం సూచిస్తోంది. పాములను స్వయంగా తరిమేందుకు ప్రయత్నించడం, దానికి దగ్గరగా వెళ్లి విన్యాసాలు చేయడం లేదా సెల్ఫీలు తీసుకోవడం వంటి ప్రమాదకర పనులు చేయకూడదు. పాము కనిపించిన వెంటనే బీబీఎంపీ అటవీ విభాగం హెల్ప్‌లైన్ నంబర్ 080-22221188 కు కాల్ చేసి సమాచారం అందించాలని తెలిపింది.

English Summary

Watch: A Cobra Chose the Middle of the Road for Evening Meditation in Bengaluru Traffic Interrupted. A cobra on Palace Road in Bengaluru led to a traffic disruption for about 30 minutes. Police responded, managed the roadside situation, and escorted the snake to safety.