VBSA Bill: పవర్స్ అన్నీ ఢిల్లీ చేతుల్లోకి? UGC రద్దు?


భారతదేశ ఉన్నత విద్యా నియంత్రణ వ్యవస్థను పూర్తిగా మార్చివేసే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన 'విక్షిత భారత్ శిక్షా అధిష్ఠాన్' (VBSA) బిల్లు-2025 పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముందే తీవ్ర వివాదాస్పదంగా మారింది. దేశంలోని ఉన్నత విద్యా రంగ నియంత్రణ సంస్థలైన యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC), ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (AICTE), నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (NCTE)ల స్థానంలో ఒకే ఒక సర్వోన్నత సంస్థగా ఈ విబిఎస్ఏ (VBSA)ను ఏర్పాటు చేయాలని బిల్లు ప్రతిపాదిస్తోంది.

Advertisement

అయితే, ఈ ప్రతిపాదనపై కేవలం విపక్షాలే కాకుండా, కేంద్రంలోని బీజేపీ మిత్రపక్షాలైన ఎన్డీఏ కూటమి ప్రభుత్వాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాలు కూడా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తుండటంతో ఈ బిల్లుపై జాతీయ స్థాయిలో పెద్ద చర్చ నడుస్తోంది.

Advertisement

ఈ బిల్లును పరిశీలిస్తున్న ఉమ్మడి పార్లమెంటరీ కమిటీ (JPC)కి పలు రాష్ట్రాలు ఇప్పటికే తమ లిఖితపూర్వక అభ్యంతరాలను సమర్పించాయి. ముఖ్యంగా కేంద్రంలో బీజేపీకి అత్యంత కీలకమైన మిత్రపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ (TDP) నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ బిల్లుపై తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఈ బిల్లు వల్ల ఉన్నత విద్యపై రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండే శాసన అధికారాలు పూర్తిగా నిర్వీర్యమైపోతాయని ఏపీ ఆందోళన వ్యక్తం చేసింది.

పురందేశ్వరి చేతుల్లో కొత్త విద్యా చట్టం.. ఒకే దేశం, ఒకే విద్యా కమిషన్!
Advertisement

రాష్ట్ర విశ్వవిద్యాలయాలకు డిగ్రీలు మంజూరు చేసే ప్రక్రియలో రాష్ట్రాలను కాదని కేంద్రం నేరుగా జోక్యం చేసుకోవడం వల్ల రాజ్యాంగపరమైన ఘర్షణలు (Constitutional Friction) తలెత్తుతాయని హెచ్చరించింది. ఏపీతో పాటు బీజేపీ పాలిత మధ్యప్రదేశ్, మిత్రపక్షం నేతృత్వంలోని మేఘాలయ, కాంగ్రెస్ పాలిత తెలంగాణ రాష్ట్రాలు కూడా ఈ బిల్లు కేంద్ర ప్రభుత్వానికి మితిమీరిన అధికారాలు కట్టబెడుతూ, రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని తగ్గిస్తోందని ఆరోపించాయి.

బిల్లులో వివాదాస్పద క్లాజులు.. వర్సిటీల గుబులు!

బనారస్ హిందూ యూనివర్సిటీ (BHU) వంటి ప్రతిష్టాత్మక కేంద్ర విశ్వవిద్యాలయాలతో పాటు అస్సాం, మహారాష్ట్ర, జమ్మూ కాశ్మీర్ వర్సిటీలు కూడా జెపిసి (JPC) ముందు తమ అభ్యంతరాలను ఉంచాయి. ఈ బిల్లులోని క్లాజ్ 45, 47లను ప్రధాన లోపాలుగా వర్సిటీలు వేలెత్తి చూపుతున్నాయి. క్లాజ్ 45 ప్రకారం కేంద్ర ప్రభుత్వం జారీ చేసే ఏ పాలసీ ఆదేశాలకైనా ఈ కొత్త విద్యా నియంత్రణ సంస్థ లొంగి ఉండాల్సి వస్తుంది.

Advertisement
UGC Equity Regulations 2026:యూజీసీ కొత్త రూల్స్‌ పై సుప్రీంకోర్టు షాక్..!!

అలాగే క్లాజ్ 47 ప్రకారం ఈ సర్వోన్నత విద్యా సంస్థను సైతం కేంద్రం ఏడాది పాటు సస్పెండ్ చేసే అధికారం పొందుతుంది. దీనివల్ల స్వతంత్రంగా పనిచేయాల్సిన విద్యా నియంత్రణ సంస్థలు కేవలం ప్రభుత్వంలో ఒక భాగంగా మారిపోతాయని, వర్సిటీల స్వయంప్రతిపత్తి (Autonomy) పూర్తిగా దెబ్బతింటుందని BHU ఆందోళన వ్యక్తం చేసింది. అంతేకాకుండా, యూజీసీ, ఏఐసీటీఈ వంటి పెద్ద సంస్థలను ఒకేసారి రద్దు చేయడం వల్ల విద్యావ్యవస్థలో పెద్ద గందరగోళం ఏర్పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Advertisement

'వెరీ బ్యాడ్ శిక్షా యాక్ట్' అంటూ కాంగ్రెస్ విమర్శలు

మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఈ బిల్లుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతోంది. కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ ఈ బిల్లును "వెరీ బ్యాడ్ శిక్షా యాక్ట్" (Very Bad Shiksha Act) గా అభివర్ణించారు. ఈ బిల్లు ద్వారా ఉన్నత విద్యపై రాష్ట్రాలకు ఉన్న హక్కులను కేంద్రం లాక్కుంటోందని, ఇది రాజ్యాంగ ఉల్లంఘనే అని ఆయన ఆరోపించారు. గతంలో జాతీయ విద్యా విధానం (NEP 2020) ప్రకారం గ్రాంట్స్ (నిధులు) ఇచ్చేందుకు ప్రత్యేక కౌన్సిల్ ఉండాలని చెప్పిన కేంద్రం.. ఇప్పుడు ఆ నిధుల పంపిణీ అధికారాలను నేరుగా విద్యా మంత్రిత్వ శాఖ చేతుల్లోకి తీసుకునేలా బిల్లును రూపొందించిందని విమర్శించారు.

Advertisement

కేంద్ర ప్రభుత్వం డిఫెన్స్ ఏంటి?

రాష్ట్రాలు, వర్సిటీల నుంచి వస్తున్న తీవ్ర విమర్శలపై కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ వివరణ ఇచ్చింది. ఉన్నత విద్యా రంగాన్ని మరింత పారదర్శకంగా మార్చడానికి, జాతీయ విద్యా విధానం-2020 లక్ష్యాలకు అనుగుణంగా పాలనను సులభతరం చేయడానికే ఈ బిల్లును తెస్తున్నట్లు స్పష్టం చేసింది. క్లాజ్ 45, 47 లపై స్పందిస్తూ.. ఆధునిక నియంత్రణ చట్టాల్లో అత్యవసర సమయాల్లో కేంద్రానికి ఇలాంటి అధికారాలు ఉండటం సాధారణమేనని, ఈ నిబంధనలను ఎప్పుడూ ఏకపక్షంగా వాడబోమని, కేవలం జవాబుదారీతనం కోసమే వీటిని పొందుపరిచామని కేంద్రం సమర్థించుకుంది. ప్రస్తుతం బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి నేతృత్వంలోని జాయింట్ పార్లమెంట్ కమిటీ ఈ బిల్లును పరిశీలిస్తోంది. జూలై 20 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఈ విబిఎస్ఏ బిల్లుపై అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర స్థాయిలోనే రాజకీయం నడిచే అవకాశం కనిపిస్తోంది.

English Summary

The proposed VBSA Bill 2025, aimed at replacing UGC and AICTE with a single apex body, faces intense opposition from NDA allies, opposition states, and top universities.