ఫ్యాక్ట్ ఫైల్: పెట్రోల్ డీజిల్ ధరలకు రెక్కలెందుకొచ్చాయో తెలుసా..?


ఇంధన ధరలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. సామాన్యుడిపై భారం విపరీతంగా పడుతోంది. దీంతో సామాన్యుడు తన వాహనాన్ని ఇంట్లోనే వదిలి ప్రభుత్వరవాణాన సంస్థలను ఆశ్రయిస్తున్నాడు. పెరుగుతున్న పెట్రో ధరలపై ఇటు అధికారపక్షం అటు విపక్షం ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. పెట్రోల్ ధరల పెరుగుదలకు కారణం మీరంటే మీరే అని ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నారు. పెరుగుతున్న పెట్రో ధరలకు నిరసనగా విపక్షాలు దేశవ్యాప్తంగా బంద్‌కు కూడా పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో పెరుగుతున్న ధరలకు అసలు కారణం ఏమిటి... అనేది ఒకసారి చూద్దాం.

పెట్రోల్ డీజిల్ ధరలు ఎందుకు ఆకాశానంటుతున్నాయి?

సెప్టెంబర్ 11న ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరు రూ.80.87, ముంబైలో రూ.88.26కు చేరుకుని కొత్త రికార్డు సృష్టించాయి. అదే 20 ఏళ్ల క్రితం అంటే 1998 సెప్టెంబర్‌లో ఇదే ఢిల్లీలో లీటరు పెట్రోల్‌ రూ. 23.94 ఉన్నింది. నేటికి ఆ ధరలు 238శాతం పెరిగాయి. అంటే ఏడాదికి సరాసరిగా 12శాతంతో పెరుగుతూ వచ్చాయి. ఇంధన ధరలు పెరిగేందుకు ప్రధానంగా మూడు కారణాలు కనిపిస్తాయి. గత కొన్ని నెలలుగా ముడిచమురు ధరలు అమాంతం పెరుగుతూ వస్తున్నాయి. రెండోది డాలరుతో రూపాయి మారకం విలువ పడిపోతూ వస్తోంది. సెప్టెంబర్ 11 నాటికి ఇది రూ.72.80కు చేరుకుంది. మూడోది ఇంధన ధరలపై విధించే వ్యాట్. పెట్రో ధరలు పెరుగుతుంటే అందుకు ధీటుగా వ్యాట్ కూడా పెరుగుతోంది.

పెట్రోల్ ధర పెరుగుదలపై ప్రజల స్పందన...!
పెట్రో ధరలు ఎలా నిర్ణయిస్తారు?

ఇంధన ధరలను నాలుగు అంశాలు ప్రభావితం చేస్తాయి. దాని ద్వారానే ధరలు నిర్ణయం ఉంటుంది.

a)రిఫైనరీలనుంచి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఒక ధరతో కొనుగోలు చేస్తాయి. ఇది ఎగుమతి అయ్యే ముడి చమురు ధర, రూపాయి విలువపై ఆధారపడి ఉంటుంది.

b)పెట్రోల్ పంపులకు పెట్రోల్ డీజిల్‌ను చేరవేసేందుకు అయ్యే రవాణా ఛార్జీలపై ఆధార పడి ఉంటుంది. ఇక్కడ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు తమ మార్జిన్ వేసుకుని డీలర్లకు సరఫరా చేస్తాయి.

c)పెట్రోల్ డీజిల్‌ ధరలు జీఎస్టీ పరధిలోకి రావు కనుక కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకం విధిస్తుంది.

d)డీలర్ కమిషన్ ఇంధన ధరలపై ఉండటంతో పాటు రాష్ట్రం విధించే వ్యాట్ కూడా ప్రభావం చూపుతుంది. వ్యాట్ ఆయారాష్ట్రాలను బట్టి ఉంటుంది.

పెట్రోల్‌కు మనం ఖర్చు చేసే డబ్బు ఎవరికి వెళుతుంది..?

పెట్రోల్‌కు మనం ఇచ్చే డబ్బులో సగం ముడిచమురు కొనుగోలు, రిఫైనరీకి వెళుతుంది. ఇక మిగతా సగం పన్నులు కమిషన్ల రూపంలో వెళుతుంది. ఇందులో సింహభాగం కేంద్ర ప్రభుత్వానికి ఎక్సైజ్ డ్యూటీ రూపంలో లీటరుకు రూ.19.48 వెళుతుంది. రెండో అంశం వ్యాట్. ఇది రాష్ట్రానికి రాష్ట్రానికి మారుతూ ఉంటుంది. చాలా వరకు రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం విధించే సెంట్రల్ ఎక్సైజ్ సుంకానికంటే... ఎక్కువగానే వ్యాట్‌ను విధిస్తున్నాయి. మూడోది డీలర్ కమిషన్.

ఉదాహరణకు ఒక వినియోగదారుడు సెప్టెంబర్ 10న ఢిల్లీలో లీటర్ డీజిల్‌కు రూ. 80.73తో కొనుగోలు చేసి ఉంటే... అందులో రూ.40.45 ఇండియన్ ఆయిల్‌కు వెళుతుంది. రూ.19.48 ఎక్సైజ్ సుంకం రూపంలో కేంద్ర ప్రభుత్వానికి వెళుతుంది. ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యాట్ రూపంలో రూ.17.16 వెళుతుంది. మిగతాది అంటే రూ. 3.64 పెట్రోల్ పంపు డీలరుకు కమిషన్ రూపంలో వెళుతుంది.

వివిధ నగరాల్లో పెరిగిన పెట్రోల్ ధరలివే, ఏపీ, రాజస్థాన్‌లో స్వల్పంగా తగ్గింపు

యూపీఏ హయాంలోనే పెట్రో ధరలు పెరిగాయా..?

యూపీఏ హయాంలోనే ఇంధన ధరలు పెరిగాయని బీజేపీ సర్కార్ చెబుతోంది. ఇందుకు సమాధానం అవును అని చెప్పొచ్చు, కాదు అని కూడా చెప్పొచ్చు. పదేళ్ల యూపీఏ పాలనలో పెట్రోల్ ధరలు ఏడాదికి సరాసరిగా 11.2శాతం పెరిగాయి. అదే ఎన్డీఏ హయాం వచ్చేసరికి గత నాలుగేళ్లలోనే ఏడాదికి సరాసరిగా ధరలు 3.25శాతం పెరిగాయి. అయితే ఇది పూర్తి సమాచారం ఇవ్వదు. రీటైల్ ధరను నిర్ణయించే ముడి చమురు ధర ఇక్కడ తెలియదు. మన్మోహన్ సింగ్ 2004లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పుడు ముడిచమురు ధర బ్యారెల్‌కు 36 డాలర్లుగా ఉండేది. 2011కు వచ్చేసరికి అదే ధర బ్యారెల్‌కు 111 డాలర్లకు ఎగబాకింది. అయినప్పటికీ నాటి యూపీఏ హయాంలో పెట్రోల్ ధర లీటరుకు రూ.76.06 మాత్రమే ఉన్నింది. ఈ ధర 2013 సెప్టెంబరులో ఉన్నింది.

ప్రస్తుతం ముడిచమురు ధర బ్యారెల్‌కు 68డాలర్లు ఉన్నప్పటికీ ఢిల్లీలో పెట్రోల్ ధర రూ.80.87కు చేరుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ధరలలో ఇంత భారీ స్థాయిలో వ్యత్యాసం రావడానికి గల కారణం మోడీ సర్కార్ నవంబర్ 2014 నుంచి జనవరి 2016 మధ్య ఎక్సైజ్ సుంకాన్ని ఏకంగా తొమ్మిది రెట్లకు పెంచడమే కారణం. ఇది ఎవరూ కాదనలేని సత్యం.

పెట్రోల్ డీజిల్ ధరలపై ఏ రాష్ట్రాలు అధిక పన్ను విధిస్తున్నాయి..?

రాష్ట్ర రాజధాని నగరాల్లో ఇంధనంకు సంబంధించి రీటైల్ ధరలు గమనిస్తే...మహారాష్ట్ర సర్కార్ 39.12 శాతం వ్యాట్ విధిస్తోంది. అదే మధ్యప్రదేశ్‌లో 35.78శాతం ఉండగా.. పంజాబ్‌లో 35.12 శాతంగా వ్యాట్ ఉంది. గోవా ప్రభుత్వం అత్యల్పంగా 16.66 శాతం వ్యాట్ విధిస్తుండగా.. మిజోరాం ప్రభుత్వం 18.88శాతం విధిస్తోంది. అరుణాచల్ ప్రదేశ్ 20శాతం వ్యాట్ విధిస్తోంది. ఇదిలా ఉంటే రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఆదివారం రోజున వ్యాట్ తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. మంగళవారం మమతా బెనర్జీ బెంగాల్‌లో ఇంధనం ధరలపై వ్యాట్ తగ్గిస్తున్నట్లు ప్రకటించారు.

మన పొరుగు దేశాల్లో ఇంధన ధరలు ఎలా ఉన్నాయి

భారత్‌లో పెట్రోలు కొనుగోలు చేయాలంటే అత్యధిక ధర చెల్లించాల్సిందే. అదే పొరుగు దేశాల్లో అంటే భారత సరిహద్దులు పంచుకుంటున్న మయన్మార్ దేశంలో లీటరు పెట్రోల్ ధర రూ.41.99గా ఉంది. భారత కరెన్సీ ప్రకారం లీటరు పెట్రోలు ధరలు పొరుగు దేశాల్లో ఈ విధంగా ఉన్నాయి.

పాకిస్తాన్: రూ. 54.33, భూటాన్: రూ.63.71, నేపాల్: రూ. 69.55, శ్రీలంక: రూ.70.99, బంగ్లాదేశ్: రూ.76.06, చైనా: రూ.79.60

Have a great day!
Read more...

English Summary

Amid violent protests across the country over raging fuel prices, the government and the Opposition are busy blaming each other.Confused by the volley of tricky information doled out by political parties?On September 11, petrol touched it highest-ever price of Rs 80.87 per litre in Delhi and Rs 88.26 per litre in Mumbai. Exactly 20 years ago, in September 1998, you would have paid just Rs 23.94 for a litre of petrol in Delhi. That's an increase of 238 per cent in 20 years. That comes to about an average increase of 12 per cent per year.