పాకిస్తాన్ పై మెరుపుదాడులు: బాంబుల వర్షం- భారీ విధ్వంసం

పొరుగు దేశాలైన పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరాయి. పాకిస్తాన్ అంతర్జాతీయ సరిహద్దులను దాటి, ఆ దేశ భూభాగంలోకి చొచ్చుకెళ్లి ఉగ్రవాద సంస్థ ఐసిస్-కే స్థావరాలపై తాలిబన్ ప్రభుత్వ ఆర్మీ భారీ వైమానిక దాడులు నిర్వహించింది. తమదేశ పౌరులపై దాడులకు వ్యూహాలు రచిస్తున్న ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకుని ఈ ఆపరేషన్ చేపట్టినట్లు వెల్లడించారు. ఐసిస్ కే క్యాంప్ లన్నింటినీ మట్టుబెడతామని తేల్చి చెప్పింది.

Advertisement

రెండు రోజుల క్రితం ఆఫ్ఘనిస్తాన్‌పై పాకిస్తాన్ వైమానిక దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే. దీన్ని భారత్ సైతం తప్పు పట్టింది. దీనికి ప్రతీకారంగానే ఈ కౌంటర్ అటాక్ జరిగినట్లు తెలుస్తోంది. పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తున్ ఖ్వా ప్రావిన్స్ లపై ఈ ఆకస్మిక సైనిక చర్య చేపట్టింది ఆఫ్ఘనిస్తాన్. అత్యాధునిక డ్రోన్ విమానాలు నేరుగా ఉగ్రవాదులు ఆశ్రయం పొందుతున్న రహస్య స్థావరాలపై బాంబుల వర్షం కురిపించినట్లు తాలిబన్ అధికారిక వార్తా సంస్థ టోలో న్యూస్ తెలిపింది.

Advertisement

ముఖ్యంగా ఖైబర్ పఖ్తున్ ఖ్వా రీజియన్ లోని సరన్ ప్రాంతంలో ఉగ్రవాదులు తమ సేఫ్ హెవెన్‌గా వాడుకుంటోన్న ఓ పాఠశాల భవనంపై తాలిబాన్ డ్రోన్ దాడులు నిర్వహించింది. దీంతో ఆ భవనం పూర్తిగా నేలమట్టమైంది. ఈ దాడిలో పలువురు తీవ్రవాదులు హతం అయ్యారు. సాధారణ పౌరులకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తాలిబాన్ కమాండర్లు వెల్లడించారు.

రెండు రోజుల కిందటే ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు దాటి పాకిస్తాన్ సైన్యం జరిపిన వైమానిక దాడులు జరిపింది. దీనికి సమాధానంగానే తాలిబాన్లు ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నారు. పాక్ జరిపిన ఆ దాడుల వల్ల ఆఫ్ఘనిస్తాన్ భూభాగంలో మహిళలు, చిన్న పిల్లలతో సహా సుమారు 29 మంది అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోయారని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల విభాగం తన నివేదికలో పేర్కొంది. మృతుల సంఖ్య 38 దాటి ఉంటుందని ఆఫ్ఘన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి హమ్ దుల్లా ఫిద్రత్ స్పష్టం చేశారు.

Advertisement

ఆఫ్ఘనిస్తాన్ ఉగ్రవాదులకు సురక్షిత స్థావరంగా మారిందని పాకిస్తాన్ నిరంతరం ఆరోపిస్తుండగా, ఉగ్రవాదం అనేది పాక్ స్వయంగా సృష్టించుకున్న అంతర్గత శాంతిభద్రతల సమస్య అని తాలిబాన్ బలంగా తిప్పికొట్టింది. ఈ తాజా సరిహద్దు డ్రోన్ దాడుల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ప్రత్యక్ష యుద్ధ వాతావరణం నెలకొంది. సరిహద్దు నియంత్రణ రేఖ వెంబడి ఇరుపక్షాలు భారీగా బలగాలను మోహరిస్తుండటంతో, ఈ ఉద్రిక్తతలు ఎలాంటి ఘర్షణలకు దారితీస్తాయోననే కలవరం వ్యక్తమవుతోంది.

ఈ దాడులపై రష్యా స్పందించింది. శాంతియుత వాతావరణంలో చర్చల ద్వారా తమ దీర్ఘకాలిక వివాదాలను పరిష్కరించుకోవాలని ఇరు దేశాలను సూచించింది. సరిహద్దు ప్రాంతాలపై పాకిస్థాన్ జరిపిన వైమానిక దాడులను విషాదకరమైన సంఘటనగా రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ అభివర్ణించింది. సాధారణ పౌరులు మరణించడం పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. వివాదాస్పద సమస్యలను రాజకీయ, దౌత్య మార్గాల ద్వారా పరిష్కరించుకోవాలని పేర్కొంది.

English Summary

Afghanistan Launches Precision Airstrikes on ISIS in Pakistan After Deadly Border Attacks strategic retaliation. The strategic retaliation followed growing international condemnation of Pakistan's persistent pattern of externalising its internal failures through violent cross-border aggression.