విరుచుకుపడ్డ ఇరాన్. యూఎస్ ఎయిర్ బేస్‌పై మిసైళ్లతో అటాక్..

టెహ్రాన్‌పై అమెరికా జరిపిన దాడులకు ఇరాన్ అత్యంత శక్తిమంతమైన బాలిస్టిక్ క్షిపణులతో సమాధానమిచ్చింది. ఇరాన్ సైన్యానికి చెందిన పవర్‌ఫుల్ విభాగం 'ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్' (IRGC) గురువారం మధ్యాహ్నం రంగంలోకి దిగి పశ్చిమ ఆసియాలోని అమెరికా వ్యూహాత్మక స్థావరాలపై విరుచుకుపడింది. ఉత్తర జోర్డాన్‌లోని అమెరికాకు చెందిన 'అల్-అజ్రాక్' ఎయిర్ బెస్ పై ఇరాన్ సైన్యం ఏకంగా 10 బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించి ముట్టడించింది. వెస్ట్ ఆసియాలోని అమెరికా కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌ను తాము పూర్తిగా ధ్వంసం చేశామని ఐఆర్‌జీసీ అధికారిక ప్రకటనలో పేర్కొంది. ఇరాన్ సరిహద్దుల నుంచి దూసుకొచ్చిన క్షిపణులతో జోర్డాన్ గగనతలంలో ఒక్కసారిగా సైరన్లు మోగడం తీవ్ర కలకలం రేపింది.

Advertisement

రెండు విడతలుగా ఇరాన్ విధ్వంసం..

అమెరికా దూకుడుకు బుద్ధి చెప్పేందుకే తాము రెండు విడతలుగా ఈ ప్రతీకార దాడులు (Punitive Response) చేపట్టినట్లు ఇరాన్ ప్రభుత్వ అధికారిక మీడియా వెల్లడించింది. మొదటి దశలో భాగంగా కువైట్, బహ్రెయిన్‌లలో ఉన్న నాలుగు కీలకమైన అమెరికా సైనిక స్థావరాలను ఇరాన్ లక్ష్యంగా చేసుకుంది. కువైట్‌లోని ఆరిఫ్‌జాన్, అలీ అల్ సలేమ్ స్థావరాలతో పాటు బహ్రెయిన్‌లోని జుఫైర్, షేక్ ఈసా మిలిటరీ కేంద్రాలపై క్షిపణులు, ఆత్మాహుతి డ్రోన్లతో విరుచుకుపడి అక్కడి మౌలిక వసతులను దెబ్బతీసింది. అమెరికా గనుక మళ్లీ ఇరాన్ జోలికి వస్తే, ప్రాంతీయంగా ఉన్న మరిన్ని యూఎస్ సైనిక స్థావరాలను బూడిద చేస్తామని, వాటికి రక్షణ లేకుండా చేస్తామని ఐఆర్‌జీసీ హెచ్చరించింది.

Advertisement

అణు ప్లాంట్ సమీపంలో అమెరికా దాడులు.. రేడియేషన్ భయాలు!

మరోవైపు, ఇరాన్‌కు చెందిన ఏకైక క్రియాశీల అణు విద్యుత్ కేంద్రమైన 'బుషెహర్' (Bushehr) పరిసరాలపై అమెరికా వైమానిక దాడులకు తెగబడిందని ఇరాన్ ఆరోపించింది. రష్యన్ సాంకేతిక నిపుణుల పర్యవేక్షణలో నడుస్తున్న ఈ అణు ప్లాంటు పరిసరాల్లో భారీ పేలుళ్లు సంభవించాయని, ఇరాన్ దక్షిణ నగరమైన చాబహార్‌లో దాడుల కారణంగా విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయిందని అంతర్జాతీయ మీడియా పేర్కొంది.

ఇటీవల జరిగిన దాడుల్లో క్షిపణి శకలాలు తగిలి అణు ప్లాంట్ సిబ్బంది ఒకరు మరణించగా, సమీప భవనాలు దెబ్బతిన్నాయి. అణు కేంద్రం సమీపంలో దాడులు జరగడం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆందోళన రేకెత్తించినప్పటికీ, ప్రస్తుతం ప్లాంట్ నుంచి ఎలాంటి రేడియేషన్ లీకేజీ కాలేదని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (IAEA) స్పష్టం చేసింది.

Advertisement

స్వేచ్ఛ కోసమే దాడులు: యూఎస్

ఇరాన్‌పై తాము జరుపుతున్న దాడులను అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) సమర్థించుకుంది. వ్యూహాత్మక హార్ముజ్ జలసంధి (Strait of Hormuz) గుండా ప్రయాణించే అంతర్జాతీయ వాణిజ్య నౌకలు, పౌర సిబ్బందిపై ఇరాన్ నిరంతరం దాడులకు పాల్పడుతోందని అమెరికా ఆరోపించింది.

అంతర్జాతీయ నౌకాయాన స్వేచ్ఛను కాపాడటానికి, అమెరికా అధ్యక్షుడు ఇచ్చిన ఆదేశాల మేరకే తాము ఇరాన్ సామర్థ్యాన్ని దెబ్బతీసేందుకు అదనపు వైమానిక దాడులు ప్రారంభించినట్లు సెంట్‌కామ్ ప్రకటించింది. ఇరు దేశాల రణగర్జనలతో మధ్యప్రాచ్యం మరో మహా యుద్ధానికి వేదికవుతుందా అనే భయాందోళనలు ప్రపంచ దేశాల్లో వ్యక్తమవుతున్నాయి.

English Summary

Iran IRGC launched 10 ballistic missiles targeting the US Al-Azraq air base in Jordan, marking the second phase of retaliation. Meanwhile, US airstrikes near Iran's Bushehr nuclear plant have raised global tensions