పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్- అమెరికా మధ్య కీలక ఒప్పందం జరగనుంది. ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన హార్మూజ్ జలసంధి తెరుచుకునేందుకు మార్గం సుగమం అయినట్లు తెలుస్తోంది. హార్మూజ్ జలసంధిని తిరిగి ప్రారంభించడం ద్వారా ప్రపంచ వాణిజ్య మార్కెట్లలో స్థిరత్వం రానుంది. దాంతో ధరలు తగ్గే అవకాశం ఉంది. ఈ విషయంపై యూనైటెడ్ స్టేట్స్ ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ కీలక వ్యాఖ్యలు చేశారు. హార్మూజ్ జలసంధి రీ ఓపెన్ పై బుధవారం నాటికి ఇరాన్ తో ఒప్పందం కుదిరే అవకాశం ఉందని తెలిపారు.
"ఇరానీయులతో మేము చర్చలు జరుపుతున్నాం. ఈ అంశంపై ఇరాన్ తో ఈరోజు కానీ రేపు కానీ ఒప్పందం కుదిరే అవకాశం ఉంది. దాంతో ఈ యుద్ధ తీవ్రత సాధారణ స్థితికి వచ్చే అవకాశం ఉంది" అని బెస్సెంట్ అన్నారు. సీఎన్ బీసీ వార్తా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన ఈ కీలక విషయాలను వెల్లడించారు. మరి హార్మూజ్ జలసంధిని వినియోగించుకున్న నేపథ్యంలో వాణిజ్య నౌకలపై ఇరాన్ ఏమైనా టోల్ వసూలు చేస్తుందా..? అన్న ప్రశ్నకు బెస్సెంట్ స్పందిస్తూ.. ఫ్రీడమ్ ఆఫ్ మూవ్ మెంట్ అని పేర్కొన్నారు. అంటే స్వేచ్ఛాయుతమైన రాకపోకలు ఉంటాయని స్పష్టం చేశారు.
యూనైటెడ్ స్టేట్స్ ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ వ్యాఖ్యల నేపథ్యంలో ప్రపంచ మార్కెట్ లో చమురు ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 3 శాతానికి తగ్గి బ్యారెల్ కు సుమారు 80 డాలర్ల వద్దకు చేరినట్లు తెలుస్తోంది. ఇదిలాఉంటే ఇరాన్ పై సైనిక దాడులకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బ్రేక్ ఇచ్చినట్లు పేర్కొన్నారు. మరోవైపు అమెరికాపై ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ కీలక ఆరోపణలు చేశారు. నిర్మాణంలో ఉన్న తమ అణు విద్యుత్ కేంద్రంపై అమెరికా వైమానిక దాడులు నిర్వహించిందన్నారు. ఈ మేరకు ఖమేనీ అంత్యక్రియలకు హాజరైన ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ఓ సందేశాన్ని ఆయన విడుదల చేశారు.