ఐఎస్ఐ కొత్త కుట్ర: బ్రిటన్, కెనడాలోని భారతీయులకు హై అలర్ట్!

బ్రిటన్, కెనడాలో నివసిస్తున్న భారతీయుల భద్రతకు సంబంధించి భారత గూఢచార సంస్థలు తీవ్ర హెచ్చరిక జారీ చేశాయి. గూఢఛార నివేదికల ప్రకారం.. పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ, ఖలిస్తాన్ అనుకూల శక్తులు ఇండియాకు, ప్రధాని మోదీకి అనుకూలంగా వ్యవహరించే వారిపై దాడులకు కుట్ర పన్నుతున్నాయి. నిఘా వర్గాల ప్రకారం.. ఇటీవల కాలంలో బ్రిటన్, కెనడాలోని భారతీయులపై విద్వేష నేరాలు, హింసాత్మక ఘటనలు పెరిగాయి. ఖలిస్తాన్ అనుకూల శక్తులు ఈ దాడులకు పాల్పడుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి. గతంలో ఇలాంటి ఘటనలు చెదురుముదురుగా జరిగేవి.. కానీ ఇప్పుడు అవి మరి వ్యవస్థీకృతంగా మారవచ్చనే భయాలు నెలకొన్నాయి. ఈ దాడులను అడ్డుకునేందుకు భారత భద్రతా సంస్థలు ఆ దేశాల భద్రతా సంస్థలతో కలిసి సమన్వయంతో పనిచేస్తున్నాయి.

Advertisement

నిఘా అధికారులు ఏమంటున్నారంటే?
ఖలిస్తాన్ ఉద్యమానికి మద్దతు ఇచ్చే ఐఎస్ఐ.. బ్రిటన్, కెనడాలోని భారతీయులపై దాడులు చేసేందుకు కార్యకలాపాలను ముమ్మరం చేయాలని ఐరోపాలో పనిచేస్తున్న తన నెట్వర్క్ కు ఆదేశాలు జారీ చేసిందని ఓ ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారి వెల్లడించారు. ఆ అధికారి ప్రకారం.. ఈ ఘటనలు ఒక ప్లాన్ లో భాగంగా జరిగే అవకాశం ఉందని అనుమానిస్తున్నారు. "ఐఎస్ఐ భారతీయలపై వరుస సమన్వయ దాడులకు ప్రణాళిక రచిస్తోంది. ఈ శక్తులు భారత్ కు అనుకూలంగా వ్యవహరించేవారిని లేదా ప్రధాని మోదీ మద్దతుదారులను లక్ష్యంగా చేసుకోవచ్చు. దీనిని ఒక సాకుగా ఉపయోగించుకుని ఇలాంటి దాడులు చేయవచ్చు." అని ఆ అధికారి పేర్కొన్నారు. ఆ అధికారి వెల్లడించిన వివరాల ప్రకారం.. ఖలిస్తాన్ ఉద్యమం ఊపందుకోకపోవడం పట్ల కలిగిన నిరాశ ఫలితంగానే ఐఎస్ఐ వ్యూహంలో ఈ మార్పు వచ్చింది. లక్ష్యం కేవలం భారతీయులు మాత్రమే కాదని.. ఖలిస్తాన్ సంబంధిత కేసులపై దర్యాప్తు జరిపి చర్యలు తీసుకుంటున్న భారతీయ ఏజెన్సీలు కూడా ఉంటాయని ఆయన పేర్కొన్నారు.

Advertisement

ఖలిస్తాన్ కు లభించని మద్దతు.. నిరాశలో పాక్ నిఘా సంస్థ
హింసాత్మక దాడులు చేయడానికి ఐఎస్ఐ తన గ్యాంగ్‌స్టర్ నెట్‌వర్క్‌ను ఉపయోగించుకోవచ్చని మరో అధికారి వెల్లడించారు. ఈ దిశగా యూరప్, ఇండియాలో పనిచేస్తున్న మాడ్యూళ్లను యాక్టివ్ చేయాలని ఆదేశాలు జారీ చేయబడ్డాయి. స్థానిక గ్యాంగ్‌స్టర్ల ద్వారా ఇండియాలో దాడులు చేయడమే ప్రణాళిక. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఇటీవలి కాలంలో బ్రిటన్, కెనడాలో ఖలిస్తాన్ ఉద్యమానికి మద్దతు గణనీయంగా తగ్గింది. గతంలో స్థానిక జనాభాలోని ఓ వర్గం ఈ ఉద్యమం పట్ల సానుభూతితో ఉండేది, కానీ ఇప్పుడు పరిస్థితి వేగంగా మారుతోంది. ఖలిస్తాన్ ఉద్యమం, దానికి అనుబంధంగా ఉన్న గ్యాంగ్‌స్టర్ నెట్‌వర్క్‌లు ఇప్పుడు తాము ప్రకటించిన లక్ష్యానికి బదులుగా దోపిడీ, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, ఆయుధాల స్మగ్లింగ్ వంటి నేర కార్యకలాపాలలో నిమగ్నమై ఉన్నాయని ప్రజలు భావిస్తున్నారు.

Advertisement

బ్రిటన్, కెనడాలో నివసిస్తున్న భారతీయ సంతతికి చెందిన చాలా మంది ప్రజలు శాంతియుత జీవితాన్ని కోరుకుంటున్నారని అధికారులు అంటున్నారు. ఖలిస్తాన్ అనుకూల శక్తుల హింసాత్మక కార్యకలాపాలు సామాజిక సామరస్యాన్ని దెబ్బతీయడమే కాకుండా, భారతీయ సమాజ ప్రతిష్టను కూడా దెబ్బతీస్తున్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కెనడా ప్రధాన మంత్రి మార్క్ కార్నీల మధ్య జరిగిన సమావేశాల అనంతరం ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడటంతో, ఖలిస్తాన్ అనుకూల నెట్‌వర్క్‌లపై చర్యలు తీసుకునేందుకు భారత ఏజెన్సీలకు అవకాశం లభించింది. ఎన్ని ప్రణాళికలు రచించినా విఫలం కావడంతో విసుగు చెందిన ఐఎస్ఐ,ఖలిస్తాన్ అనుకూల ఉగ్రవాద నెట్‌వర్క్‌లు ఇప్పుడు తమ దృష్టిని భారత దర్యాప్తు సంస్థలు, విదేశాల్లోని భారతీయులను లక్ష్యంగా చేసుకున్నాయని నిఘా అధికారులు చెబుతున్నారు.

English Summary

ISI Khalistan Plot, Indian intelligence agencies issue a severe warning: Pakistan's ISI and pro-Khalistan groups are plotting coordinated attacks against Indians and PM Modi supporters in the UK and Canada.