ఇజ్రాయెల్ భారీ కుట్ర.. ఇరాన్ అగ్రనేతల హత్యకు ప్లాన్?

మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలకు ముగింపు పలికేలా అమెరికా, ఇరాన్ దేశాల మధ్య శాంతి చర్చలు జరుగుతున్న సమయంలో ఇజ్రాయెల్ వ్యవహరించిన తీరుకు సంబంధించిన ఓ సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే ఈ దేశాల మధ్య అవగాహన ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. తుది ఒప్పందం ఖరారు దిశగా ప్రయత్నాలు కొనసాగుతున్న తరుణంలో ఈ సంచలన విషయం వెలుగుచూసింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఇరు దేశాల మధ్య ప్రారంభమైన చర్చల ప్రక్రియలో ఇరాన్ కు చెందిన ఇద్దరు అగ్రనేతలను ఇజ్రాయెల్ హత్య చేయవచ్చని అమెరికా తీవ్రంగా భయపడినట్లు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. ప్రస్తుత, మాజీ అమెరికా అధికారుల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఈ కథనాన్ని ప్రచురించారు.

Advertisement

ఈ నివేదిక ప్రకారం.. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ, ఆ దేశ పార్లమెంట్ స్పీకర్ మహ్మద్ బాకర్ గాలిబాఫ్‌ల భద్రతపై అమెరికా అధికారులు తీవ్ర ఆందోళన చెందారు. ఏప్రిల్ నుంచి ప్రారంభమైన కాల్పుల విరమణ, శాంతి చర్చల్లో ఈ ఇద్దరు నేతలు ఇరాన్ దేశం తరఫున అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నారు. ఒకవేళ వీరిద్దరిపై ఇజ్రాయెల్ దాడి చేసి ఉంటే.. జరుగుతున్న శాంతి చర్చలు పూర్తిగా విఫలమై.. ప్రాంతీయంగా మళ్లీ హింస చెలరేగే ప్రమాదం ఉందని అమెరికా భావించింది. అందువల్ల అమెరికా ఈ ప్రాంతంలోన పలు దేశాలను సంప్రదించి.. రాబోయే ముప్పు గురించి ఇరాన్‌ను హెచ్చరించాల్సిందిగా కోరింది.

Advertisement

యుద్ధ సమయంలో ఇరాన్ అగ్రనేతలు ఇద్దరినీ ఇజ్రాయెల్ లక్ష్యంగా పరిగణించినప్పటికీ.. చర్చలు ప్రారంభమైన తర్వాత వారిపై ఎలాంటి దాడి జరిగినా దౌత్యపరమైన ప్రయత్నాలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని అమెరికా అధికారులు పేర్కొన్నారు. ముఖ్యంగా ఇజ్రాయెల్ హిట్ లిస్ట్‌లో ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహ్మద్ బాకర్ గాలిబాఫ్ పేరు మొదటి స్థానంలో ఉందని నివేదిక స్పష్టం చేసింది. ఈ విషయం తెలియగానే.. మహ్మద్ బాకర్ గాలిబాఫ్‌పై ఎలాంటి సైనిక చర్యలు చేపట్టవద్దని అమెరికా.. ఇజ్రాయెల్‌కు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

అబ్బాస్ అరాగ్చీ, మహ్మద్ బాకర్ గాలిబాఫ్ ఇద్దరి పేర్లూ ఇజ్రాయెల్ టార్గెట్ లిస్ట్‌లో ఉన్నప్పటికీ.. అమెరికా-ఇరాన్ చర్చలు ప్రారంభం కావడంతో వారి పేర్లను తాత్కాలికంగా ఆ జాబితా నుంచి తొలగించినట్లు పేర్కొంది. అలాగే ఏప్రిల్‌లో ఇరాన్ నేతలు పాకిస్థాన్ పర్యటనకు వెళ్లడానికి ముందు తమ భద్రతకు సంబంధించి పాకిస్థాన్, ఖతార్ దేశాల ద్వారా అమెరికా నుంచి హామీలను కోరారు. ఈ పర్యటన సమయంలో ఇజ్రాయెల్ తమపై దాడి చేయవచ్చని ఇరాన్ అనుమానించగా.. పాకిస్థాన్ అప్రమత్తమై ఇరాన్ ప్రతినిధి బృందం ప్రయాణిస్తున్న విమానానికి తమ దేశ సరిహద్దు నుంచి ఇస్లామాబాద్ వరకు యుద్ధ విమానాలతో గట్టి భద్రతను కల్పించింది.

English Summary

US feared Israel might assassinate Iran Foreign Minister Abbas Araghchi and Speaker Mohammad Baqer Qalibaf during crucial ceasefire and peace talks in April.