అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త వైమానిక దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల వేళ పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు మరింత దట్టమవడమే కాకుండా, ఉద్రిక్తతలు పరాకాష్టకు చేరాయి. టెహ్రాన్ వీధుల్లో సోమవారం ఉదయం ప్రారంభమైన ఖమేనీ అంతిమయాత్ర ఒక అగ్నిపర్వతాన్ని తలపించింది.
ఇరాన్ ఆధునిక చరిత్రలోనే అత్యంత భారీ ప్రజా సమూహంగా నమోదైన ఈ ప్రదర్శనలో లక్షలాది మంది ఇరానియన్లు వీధుల్లోకి వచ్చి అమెరికా, ఇజ్రాయెల్‌లకు వ్యతిరేకంగా తీవ్ర ఆగ్రహాన్ని ప్రదర్శించారు. ఈ సందర్భంగా శోభాయాత్రలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్, రక్షణ మంత్రి పీట్ హెగ్‌సెత్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహులను లక్ష్యంగా చేసుకుని ప్రతీకార నినాదాలు హోరెత్తాయి.
యూరోన్యూస్ కథనం ప్రకారం, ఈ అంత్యక్రియల వేళ ఇరాన్ మత పెద్ద, ప్రసంగీకుడు మొహమ్మద్ రసౌలీ తీవ్ర ఉద్వేగభరితమైన, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఖమేనీ భౌతికకాయం వద్ద ప్రార్థనలకు ముందు ఆయన ప్రసంగిస్తూ, "మా ఇమామ్‌ను, మా నాయకుడిని చంపిన వాడిని మేము ఎందుకు చంపకూడదు? మీ హంతకుడిని మేము చంపకపోతే అది మాకు అవమానకరం. ప్రపంచంలోనే అత్యంత అధముడైన ఆ వ్యక్తి (ట్రంప్) ఇంకా ఎందుకు బతికున్నాడు?" అంటూ ప్రజలను ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలకు అక్కడి గుంపు నుంచి పెద్ద ఎత్తున చప్పట్లు, మద్దతు లభించింది. శోభాయాత్ర పొడవునా "కిల్ ట్రంప్" (ట్రంప్‌ను చంపేయండి) అని రాసి ఉన్న బ్యానర్లు, ట్రంప్ పేరు గుండా దూసుకెళ్తున్న బుల్లెట్ చిత్రాలు, అలాగే "దేర్ విల్ బి బ్లడ్" (ఇక రక్తపాతమే) అనే నినాదాలతో కూడిన ప్లకార్డులు దర్శనమిచ్చాయి. మరోవైపు, ఇరాన్ అగ్రనాయకత్వం, సైనిక అధికారులు, వివిధ దేశాల ప్రతినిధులు ఒకే చోట ఖమేనీ అంత్యక్రియలకు హాజరవుతున్న తరుణంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంతర్జాతీయ మీడియా సంస్థ 'ఆక్సియోస్'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. వాషింగ్టన్ అనుకుంటే కేవలం "ఒక్క షాట్"తో ఇరాన్ బతికున్న అగ్రనాయకత్వాన్ని మొత్తం తుడిచిపెట్టగలదని ట్రంప్ పేర్కొన్నారు. అయితే, ప్రస్తుతానికి తాము అలాంటి చర్యకు సిద్ధంగా లేమని, ఇరాన్‌తో దౌత్యపరమైన చర్చల మార్గాలను తెరిచి ఉంచాలని భావిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. "వారంతా అక్కడే (అంత్యక్రియల్లో) ఉన్నారు. ఒక్క షాట్‌తో అందరినీ ముగించవచ్చు, కానీ మేము అలా చేయబోవడం లేదు.. ఎందుకంటే ఆ తర్వాత మేము చర్చలు జరపడానికి అక్కడ ఎవరూ మిగలరు" అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇరాన్ ప్రభుత్వ అధికారిక మీడియా ప్రెస్ టీవీ ప్రకారం, సోమవారం ఉదయం 6 గంటలకే టెహ్రాన్‌లోని గ్రాండ్ మొసల్లా కాంప్లెక్స్ నుండి ఖమేనీ అంతిమ ప్రారంభమైంది. దాదాపు 10 కిలోమీటర్ల మేర సాగే ఈ ప్రదర్శన పూర్తి కావడానికి 12 గంటల సమయం పడుతుందని అంచనా వేశారు. రష్యా, చైనా, ఇండియా, పాకిస్తాన్, టర్కీ, ఇరాక్ సహా పలు దేశాల అధినేతలు, ఉన్నతాధికారులు టెహ్రాన్ చేరుకుని నివాళులర్పించారు. మంగళవారం పవిత్ర నగరం కోమ్ (Qom) లో, బుధవారం ఇరాక్‌లోని నజాఫ్, కర్బలా పవిత్ర క్షేత్రాల్లో ఈ ఊరేగింపులు జరగనున్నాయి. చివరిగా జూలై 9, గురువారం నాడు మషద్‌లోని ఇమామ్ రెజా పవిత్ర క్షేత్రంలో ఖమేనీ అంత్యక్రియలు పూర్తి కానున్నాయి. ఖమేనీ మరణానంతరం ఆయన కుమారుడు మొజ్తబా ఖమేనీ ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌గా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. అయితే, ఇజ్రాయెల్ దాడుల ముప్పు ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో, భద్రతా కారణాల దృష్ట్యా ఆయన ఈ ఆరు రోజుల అంత్యక్రియల వేడుకలకు దూరంగా ఉండబోతున్నట్లు అల్ జజీరా నివేదించింది. ఫిబ్రవరి 28న జరిగిన వైమానిక దాడుల తర్వాత పశ్చిమాసియాలో రేగిన ఈ చిచ్చు.. రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందోనని అంతర్జాతీయ సమాజం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది.'ట్రంప్‌ను చంపడం మా బాధ్యత': హోరెత్తిన ప్రతీకార నినాదాలు
'ఒక్క దెబ్బతో అందరినీ లేపేయగలం.. కానీ!': ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
ఆరు రోజుల పాటు అంత్యక్రియల ప్రక్రియ.. భద్రతా కారణాలతో కొత్త లీడర్ దూరం!