పాకిస్థాన్‌కు 48 గంటల డెడ్ లైన్!

పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో పాకిస్థాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాగుతున్న ప్రజా నిరసనలు ఉగ్రరూపం దాల్చాయి. ఈ ప్రజా ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న జమ్మూకశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ(JKAAC) పాకిస్థాన్ ప్రభుత్వానికి 48 గంటల డెడ్‌లైన్ విధిస్తూ అల్టిమేటం జారీ చేసింది. తమ డిమాండ్లను తక్షణమే నెరవేర్చకపోతే.. జులై 9న పాక్ ఆక్రమిత కశ్మీర్ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని స్పష్టం చేసింది.

Advertisement

ప్రస్తుతం పీవోకేలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న ఆందోళనలు ఇప్పుడు తీవ్ర పోరాటంగా మారాయి. రావల్కోట్‌తో పాటు పలు ప్రధాన ప్రాంతాల్లో వేలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చిన పాకిస్థాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దిక్కులు పిక్కటిల్లేలా నినాదాలు చేశారు. ఈ నిరసనల నేపథ్యంలో అక్కడ పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది. పలు ప్రాంతాల్లో పోలీసులు, నిరసనకారుల మధ్య తీవ్ర ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో జరిగిన కాల్పులు ఒకరు మరణించగా.. పలువురు గాయపడినట్లు తెలుస్తోంది.

Advertisement

48 గంటల గడువు.. ఆపై ఉప్పెనే!
పాక్ ప్రభుత్వానికి 48 గంటల డెడ్ లైన్ విధించిన జమ్మూకశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ(JKAAC).. నిర్ణీత సమయంలోగా తమ సమస్యలపై ప్రభుత్వం స్పందించకుంటే జులై 9న చరిత్రలో నిలిచిపోయేలా పోరాటం చేపడతామని హెచ్చరించింది. తమ డిమాండ్లపై స్పష్టమైన నిర్ణయం వచ్చేవరకు ధర్నాలు, ఆందోళనలు ఆపేది లేదని కమిటీ స్పష్టం చేసింది. అంతే కాకుండా.. పీవోకేలోని స్థానికులతో పాటు విదేశాల్లో నివసిస్తున్న కాశ్మీరీ సమాజం అంతా జులై 9న జరగబోయే ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చింది.

Advertisement

అంతర్జాతీయ సంస్థలకు ఆహ్వానం
పీవోకేలోని ప్రస్తుత పరిస్థితులను, పాక్ ప్రభుత్వం చేస్తున్న అణచివేతను ప్రపంచానికి చూపించేందుకు జమ్మూకశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఐక్యరాజ్యసమితి, ఇస్లామిక్ సహకార సంస్థ, అంతర్జాతీయ మీడియా, గ్లోబల్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్లను జులై 9న పీవోకేకు వచ్చి ఇక్కడి వాస్తవ పరిస్థితులను స్వయంగా పరిశీలించాలని ఆహ్వానించింది. స్థానిక ప్రజల గొంతు నొక్కేందుకు పాక్ పాలకులు ప్రయత్నిస్తున్నారని జమ్మూకశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ ఆరోపించింది.

అసలేంటీ జమ్మూకశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ?
ఇది పీవోకేలో క్రియాశీలకంగా పనిచేస్తున్న వివిధ సామాజిక, వ్యాపార, విద్యార్థి, పౌర సంఘాల ఉమ్మడి వేదిక. పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్‌లో విపరీతంగా పెరిగిన ద్రవ్యోల్బణం, మితిమీరిన విద్యుత్ ఛార్జీలు, భారమైన పన్నుల వ్యవస్థ, నిత్యావసర వస్తువుల కొరత, స్థానిక ప్రజల హక్కుల కోసం ఈ సంస్థ నిరంతర పోరాటాలు, నిరసనలను చేస్తోంది.

Advertisement

ఇండియాను సహాయం కోరిన నిరసనకారులు
ఈ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో నిరసనల నాయకుడు సర్దార్ అమన్ ఖాన్ ఎల్ఓసీ (LoC) అవతలి వైపు ఉన్న ప్రజలకు, అలాగే ఇండియాకు ఓ కీలక విజ్ఞప్తి చేశారు. పాక్ ఆక్రమిత్ కశ్మీర్‌లో ఆహారపదార్థాలు, మందులు, ఇతర అత్యవసర వస్తువుల కొరత తీవ్రంగా ఉందని.. ఆర్థిక ఆంక్షలు, పాక్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల సామాన్య ప్రజలు రోజువారీ అవసరాల కోసం అల్లాడిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే మానవతా దృక్పథంతో భారత్ తమను ఆదుకోవాలని ఆయన కోరారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం పీవోకేలో పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనల వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

English Summary

Protests in POK as JKAAC issues a 48-hour ultimatum to the Pak government. Activists call for a massive protest on July 9 and seek humanitarian aid from India