పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఏమాత్రం తగ్గడం లేదు. ఇరాన్- అమెరికా మధ్య భీకర దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా ఇరాన్ పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ ప్రధాన లక్ష్యం ఇరాన్ పై యుద్ధాన్ని గెలవడమేనని అన్నారు. అలాగే ఇరాన్ నుంచి న్యూ క్లియర్ ఆయుధాలను దూరం చేయడమేనని స్పష్టం చేశారు. ఇక ఇరాన్ లో కాల్పుల విరమణను పునరుద్ధరించడంపై తమకు ఎలాంటి ఆలోచన లేదని ట్రంప్ తేల్చి చెప్పారు. ఇరాన్ పై దాడులతోనే ఆ దేశం చర్చలకు వస్తుందని పేర్కొన్నారు. క్యాంప్ డేవిడ్ ప్రాంతంలో ఇవాళ నిర్వహించిన కేబినెట్ మీటింగ్ లో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇరాన్ పై తాము విజయం సాధించామని పూర్తి విశ్వాసం ఉందని ట్రంప్ స్పష్టం చేశారు. ఇరాన్ విషయంలో తాము చాలా బాగా వ్యవహరిస్తున్నామని తెలిపారు. అలాగే ఇరాన్ తో కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకుంటారా..? అని రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు ట్రంప్ స్పందిస్తూ.. ఇరాన్ న్యూక్లియర్ ఆయుధాలను విడిచిపెడితే ఆలోచిస్తామని పేర్కొన్నారు. ఇరాన్ వద్ద అణ్వాయుధాలు ఉన్నంత వరకూ ఆ దేశంతో సీజ్ ఫైర్ ఉండబోదని మరోసారి స్పష్టం చేశారు. ఇప్పటికే ఇరాన్ అనేక విధాలుగా సర్వం కోల్పోయిందని కానీ తమతో యుద్ధం చేస్తూనే ఉందని తెలిపారు.
దండం పెడతాం అడ్డుకోండి సారూ.. ట్రంప్ ముందుకు ఊహించని విజ్ఞప్తి!
తాము ఇరాన్ పై మరింత బలంగా దాడులు చేస్తామని ట్రంప్ అన్నారు. ఒకానొక సమయంలో ఇక మా వళ్ల కాదు అనేంతలా ఇరాన్ పై దాడులు ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు. ఇరానియన్లపై తనకు ఓపిక నశించిందని తెలిపారు. ఇరాన్ చర్చలు కావాలని అంటుంది.. కానీ సీజ్ ఫైర్ ను ఆ దేశమే బ్రేక్ చేస్తుందని మండిపడ్డారు. రోజురోజుకూ ఇరాన్ బలహీనపడుతోందని ట్రంప్ పేర్కొన్నారు.
మరోవైపు ప్రపంచ వాణిజ్యానికి కీలకంగా ఉన్న హార్మూజ్ జలసంధిలో ఉద్రిక్తతలు అలాగే కొనసాగుతున్నాయి. అమెరికా సైన్యం సాయంతో హార్మూజ్ ను దాటేందుకు యత్నించిన రెండు చమురు ట్యాంకర్లపై ఇరాన్ దాడికి పాల్పడిందని సమాచారం అందుతోంది. ఈ మేరకు హార్మూజ్ జలసంధి మూసివేత ఇంకా కొనసాగుతూనే ఉందని ఇరాన్ తన స్పష్టమైన వైఖరిని తెలిపింది. మరోవైపు అమెరికా మాత్రం రవాణాకు హార్మూజ్ జలసంధి అందుబాటులోనే ఉందని చెబుతోంది.