H1B Visa: ట్రంప్‌కు బిగ్ షాక్! అమెరికా కోర్టు సంచలన తీర్పు..

విదేశీ ఐటీ నిపుణులకు, ముఖ్యంగా భారతీయ టెక్కీలకు అమెరికా న్యాయస్థానం ఊరటనిచ్చే సంచలన తీర్పును వెలువరించింది. హెచ్-1బీ వీసాలపై డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం విధించాలనుకున్న లక్ష డాలర్ల భారీ రుసుమును పునరుద్ధరించాలని దాఖలు చేసిన పిటిషన్‌ను అమెరికా ఫెడరల్ అప్పీల్స్ కోర్టు కొట్టివేసింది. కాంగ్రెస్ ముందస్తు అనుమతి లేకుండా ఇంతటి భారీ రుసుమును నిర్బంధ పన్నులా విధించే అధికారం ప్రభుత్వానికి లేదంటూ దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును అప్పీల్స్ ధర్మాసనం సమర్థించింది. దీంతో ట్రంప్ సర్కార్ కఠిన వీసా నిబంధనలకు పెద్ద బ్రేక్ పడింది.

Advertisement

Indian Passport: అంతర్జాతీయ ర్యాంకుల్లో భారత పాస్ పోర్ట్ మరింత పతనం..!
Advertisement

అధికారం లేకున్నా నిర్ణయం తీసుకోవడంపై ఆగ్రహం

ఈ కేసుకు సంబంధించి దాదాపు 20 డెమోక్రటిక్ రాష్ట్రాల అటార్నీ జనరళ్లు కోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం.. కార్యనిర్వాహక వర్గానికి ఇటువంటి పన్నులు లేదా రుసుములు మోపే అధికారాన్ని పార్లమెంట్ స్పష్టంగా ఇచ్చిందో లేదో నిరూపించడంలో ట్రంప్ యంత్రాంగం విఫలమైందని స్పష్టం చేసింది. ప్రభుత్వం తన పరిధిని దాటి వ్యవహరించిందని, పిటిషనర్ల వాదనలోనే బలముందని కోర్టు తేల్చిచెప్పింది. లక్ష డాలర్ల ఫీజు నిలిపివేత వల్ల ఎవరికీ ఎలాంటి నష్టం జరగదని, పైగా ఇది చట్టవిరుద్ధమని వ్యాఖ్యానించింది.

Advertisement
H1B: ట్రంప్ షాక్, ఏటా కోట్లలో జీతం ఉంటేనే వీసా!

భారతీయ టెక్కీలకు, ఐటీ కంపెనీలకు ఊరట

స్థానిక అమెరికన్ల ఉద్యోగాలను విదేశీయులు తక్కువ జీతాలకే కైవసం చేసుకుంటున్నారనే నెపంతో ట్రంప్ గతేడాది ఒక ప్రకటన ద్వారా ఈ భారీ రుసుము ప్రతిపాదనను తెచ్చారు. నిజానికి అమెరికాలోని టెక్ దిగ్గజాలన్నీ భారతదేశం, చైనా నుంచి వచ్చే అత్యంత ప్రతిభావంతులైన ఐటీ నిపుణులపైనే ఎక్కువగా ఆధారపడతాయి. సాధారణంగా హెచ్-1బీ వీసాల కోసం కంపెనీలు 2,000 నుంచి 5,000 డాలర్లు చెల్లిస్తుండగా, ఒక్కసారిగా లక్ష డాలర్లు చేయడంతో టెక్ రంగానికి అశనిపాతంగా మారింది. ఇప్పుడు కోర్టు తీర్పుతో ఐటీ కంపెనీలు, లక్షలాది మంది భారతీయ సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఊపిరి పీల్చుకున్నారు.

English Summary

US federal court rejects Trump administration attempt to revive 100000 dollar H1B visa fee, bringing huge relief to Indian techies and IT firms. .