రెండో ప్రపంచ యుద్ధం నాటి ఆచారం బంద్.. అమెరికాలో మారబోతున్న టైం!


అమెరికాలో దశాబ్దాలుగా సాగుతున్న గడియారాల ముళ్లు మార్చే సంప్రదాయానికి త్వరలోనే తెరపడనుంది. ఏడాదికి రెండుసార్లు సమయాన్ని గంట ముందుకు, వెనక్కి జరుపుతూ ప్రజలను అయోమయానికి గురిచేసే 'డేలైట్ సేవింగ్ టైమ్' (DST) విధానాన్ని ఇకపై శాశ్వతం చేయాలని యూఎస్ ప్రతినిధుల సభ సంచలన నిర్ణయం తీసుకుంది. మంగళవారం జరిగిన ఓటింగ్‌లో ఈ బిల్లుకు అనుకూలంగా 308-117 ఓట్లతో భారీ మెజారిటీ లభించింది. ఈ బిల్లుకు గనుక సెనేట్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చి, అధ్యక్షుడు సంతకం చేస్తే.. అమెరికన్లు మళ్లీ మళ్లీ తమ వాచ్‌లలో టైమ్‌ను మార్చుకోవాల్సిన అవసరం ఉండదు.

Advertisement

సాధారణంగా అమెరికాలో వేసవి కాలంలో పగటి వెలుతురును గరిష్టంగా ఉపయోగించుకోవడానికి, విద్యుత్‌ను ఆదా చేయడానికి గడియారంలో సమయాన్ని ఒక గంట ముందుకు జరుపుతారు. దీనిని 'డేలైట్ సేవింగ్' అంటారు. మళ్లీ శీతాకాలం రాగానే ఆ గంటను వెనక్కి జరిపి పాత సమయాన్ని (ప్రామాణిక సమయం) అనుసరిస్తారు. మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో ప్రారంభమైన ఈ విధానం, ఆ తర్వాత రద్దయి, రెండో ప్రపంచ యుద్ధం (1942) సమయం నుంచి మళ్లీ అమల్లోకి వచ్చింది. ఆ తర్వాత 1969లో దీనికి చట్టబద్ధత కల్పించారు. అప్పటి నుంచి ఇప్పటివరకు అమెరికన్లు ఏటా రెండుసార్లు ఈ సమయాల మార్పుతో సతమతమవుతున్నారు.

Advertisement

శాశ్వత మార్పు వల్ల లాభాలేంటి?

ఈ మార్పును గట్టిగా సమర్థిస్తున్న ఫ్లోరిడా ప్రతినిధి గస్ బిలిరాకిస్ మాట్లాడుతూ.. ఏడాదికి రెండుసార్లు ఇలా సమయాన్ని మార్చడం వల్ల ప్రజల జీవనశైలి దెబ్బతింటోందని అన్నారు. ఈ విధానాన్ని శాశ్వతంగా ఉంచడం వల్ల సాయంత్రం వేళల్లో ప్రజలకు అదనంగా మరో గంట పగటి వెలుగు దొరుకుతుందని, దీనివల్ల వ్యాపారాలు పుంజుకోవడంతో పాటు పర్యాటక రంగానికి ఎంతో మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు. శ్వేతసౌధం (వైట్ హౌస్) కూడా ఈ ప్రతిపాదనను స్వాగతించింది. ఇది ప్రజలందరికీ ఉపయోగపడే మంచి సంస్కరణ అని, బిల్లు తన వద్దకు వస్తే అధ్యక్షుడు ఖచ్చితంగా సంతకం చేస్తారని స్పష్టం చేసింది.

Advertisement
Post Box ఎరుపు రంగులోనే ఎందుకు ఉంటుంది?

అమెరికా ప్రజలు కూడా దాదాపుగా ఇదే కోరుకుంటున్నారు. ఇటీవల జరిగిన ఒక సర్వేలో 56 శాతం మంది ప్రజలు సాయంత్రం పూట అదనపు వెలుగునిచ్చే ఈ డేలైట్ విధానాన్నే శాశ్వతంగా ఉంచాలని కోరగా, కేవలం 40 శాతం మంది మాత్రమే పాత ప్రామాణిక సమయానికి మొగ్గు చూపారు.

వ్యతిరేకిస్తున్న వారేమంటున్నారు?

అయితే ఈ బిల్లును కొందరు ప్రజాప్రతినిధులు గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా పెన్సిల్వేనియా ప్రతినిధి మేరీ గే స్కాన్లాన్ మాట్లాడుతూ.. శీతాకాలంలో ఉదయం పూట చాలా ఆలస్యంగా సూర్యోదయం అవుతుందని, ఈ విధానం వల్ల చలికాలంలో ఉదయాన్నే పాఠశాల బస్సుల కోసం ఎదురుచూసే పిల్లలు, ఉద్యోగాలకు వెళ్లే తల్లిదండ్రులు దట్టమైన చీకట్లోనే ప్రయాణాలు చేయాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది మరింత ప్రమాదకరంగా మారుతుందని హెచ్చరించారు.

Advertisement
US PASSPORT: 250 ఏళ్ల వేడుక స్పెషల్, అమెరికా కొత్త పాస్‌పోర్ట్ లిమిటెడ్ ఎడిషన్

మరోవైపు, దేశంలో అద్దెలు, నిత్యావసరాలు, ఆరోగ్య ఖర్చులు పెరిగిపోతుంటే.. పార్లమెంటు ఇలాంటి వాటిపై సమయం వృధా చేయడం ఏంటని ప్రతినిధి జిమ్ మెక్‌గవర్న్ ప్రశ్నించారు. ఏదేమైనా, ఈ బిల్లు చట్టంగా మారాలంటే సెనేట్ ఆమోదం కూడా తప్పనిసరి. గతంలో ఇలాంటి బిల్లు సెనేట్ దాటినా హౌస్‌లో ఆగిపోయింది. మరి ఈసారి సెనేట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

English Summary

The US House has passed a bill to make Daylight Saving Time permanent, potentially ending the decades-old practice of changing clocks twice a year.