US Visa: 60 శాతానికి పైగా తగ్గిన వీసాలు, సీఐఎస్ రిపోర్ట్

అగ్రరాజ్యం అమెరికాలో ఉన్నత విద్య నభ్యసించి, అక్కడ ఉపాధి పొందాలని కలలుకనే భారతీయ విద్యార్థులకు ఊహించని షాక్ తగిలింది. దశాబ్దాలుగా యుఎస్ విశ్వవిద్యాలయాలలో సందడి చేసే భారతీయ, చైనా విద్యార్థుల సంఖ్యలో ఒక్కసారిగా భారీ కోత పడింది. 2025 విద్యా సంవత్సరానికి సంబంధించి అమెరికా జారీ చేసిన ఎఫ్‌-1 (F-1) స్టూడెంట్ వీసాల సంఖ్య దారుణంగా పడిపోయింది. 'సెంటర్ ఫర్ ఇమ్మిగ్రేషన్ స్టడీస్' (సీఐఎస్) విడుదల చేసిన సరికొత్త అధ్యయన నివేదిక ఈ చేదు నిజాన్ని వెల్లడించింది. విదేశీ విద్యార్థుల రాకపై అమెరికా అనుసరిస్తున్న కఠిన వైఖరితో మన యువత ఆశలపై నీళ్లు చల్లినట్లయింది.

Advertisement

60 శాతానికి పైగా తగ్గిన భారతీయుల వీసాలు!

ప్రతి ఏటా విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందు మే నుంచి ఆగస్టు మధ్య కాలంలోనే ఎక్కువ సంఖ్యలో విద్యార్థి వీసాలను యుఎస్ ఎంబసీలు జారీ చేస్తాయి. అయితే 2025 నాటి ఈ నాలుగు నెలల కాలంలో మన దేశానికి చెందిన విద్యార్థులకు లభించిన వీసాల సంఖ్య ఘోరంగా పడిపోయింది. సాధారణంగా గతంలో ఈ వ్యవధిలో సగటున 55,000 కంటే ఎక్కువ వీసాలు వస్తుండగా, 2025లో కేవలం 22,149 ఎఫ్‌-1 వీసాలు మాత్రమే లభించాయి. ఒక్క 2024తో పోల్చినా ఇది దాదాపు 62 శాతం తక్కువ కావడం గమనార్హం. భారత్‌తో పాటు చైనా విద్యార్థులకు సైతం లభించే వీసాల సంఖ్యలో 34 శాతం కోత పడింది.

Advertisement

H1B visa: నాలుగు కంపెనీలపై నిషేధం విధించిన అమెరికా..

జాబ్ ఆప్షన్లపై ప్రత్యక్ష ప్రభావం!

వీసాలు తగ్గడం కేవలం చదువుకే కాకుండా, కోర్సు పూర్తయిన తర్వాత అమెరికాలో లభించే ఉద్యోగ అవకాశాలకు కూడా పెద్ద దెబ్బ కానుంది. అమెరికాలో డిగ్రీ పూర్తి చేసిన విదేశీ విద్యార్థులకు అక్కడే కొంతకాలం పనిచేసుకునే వెసులుబాటు ఉండేది. ముఖ్యంగా సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్ రంగాలలో పనిచేసే వారిలో మన భారతీయ, చైనా విద్యార్థులే 68 శాతానికి పైగా ఉండేవారు. ఇప్పుడు వీసాలు భారీగా తగ్గడంతో, భవిష్యత్తులో ఐటీ, టెక్ రంగానికి విదేశీ నైపుణ్యం కలిగిన ఉద్యోగుల కొరత ఏర్పడే అవకాశాలు ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Advertisement
కోర్టుకెక్కిన 25 రాష్ట్రాలు. ట్రంప్‌నకు దిమ్మతిరిగే షాక్! భారత్‌కు ఊరట..

జాతీయ భద్రత, హెచ్-1బీ వివాదాలే కారణమా?

విదేశీ విద్యార్థుల వీసాల తగ్గింపు వెనుక అమెరికా జాతీయ భద్రత, స్థానిక నిరుద్యోగిత అంశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పరిశోధనా రంగాల్లో చేరే విదేశీ విద్యార్థుల ద్వారా సాంకేతిక పరిజ్ఞానం ఇతర దేశాలకు చేరిపోతుందనే ప్రచారం అంతర్గతంగా సాగుతోంది. దీనికితోడు, రెగ్యులర్ హెచ్-1బీ వీసా పరిమితులను దాటి స్టూడెంట్ వీసాల ద్వారా విదేశీయులు వర్క్ పర్మిట్లు పొందుతున్నారనే వాదనను అమెరికా పాలకులు తెరపైకి తెచ్చారు. అమెరికా పౌరులకే స్థానిక ఉద్యోగాల్లో మొదటి ప్రాధాన్యం ఇవ్వాలనే వ్యూహంలో భాగంగానే ఎఫ్‌-1 వీసాల మంజూరులో ఈ కఠిన ఆంక్షలు విధించినట్లు తెలుస్తోంది.

English Summary

US F-1 student visas issued to Indian nationals witnessed a sharp 60% decline in 2025. CIS report highlights tightened norms, OPT impact, and national security concerns as key factors behind the drop. 2025 విద్యా సంవత్సరానికి సంబంధించి అమెరికా జారీ చేసిన ఎఫ్‌-1 (F-1) స్టూడెంట్ వీసాల సంఖ్య దారుణంగా పడిపోయింది. 'సెంటర్ ఫర్ ఇమ్మిగ్రేషన్ స్టడీస్' (సీఐఎస్) విడుదల చేసిన సరికొత్త అధ్యయన నివేదిక ఈ చేదు నిజాన్ని వెల్లడించింది.