రుణాలు చెల్లిస్తా, భారత్ వచ్చేముందు జైట్లీని కలిశా!: విజయ్ మాల్యా సంచలనం


లండన్: తాను భారతీయ బ్యాంకులకు ఉన్న అప్పులు మొత్తం తీర్చేస్తానని విజయ్ మాల్యా తెలిపాడు. రుణాలు తీసుకున్న అంశాన్ని అతను సమర్థించుకున్నాడు. భారత్ విడిచే ముందు తాను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీతో మాట్లాడానని చెప్పారు. రుణాలు చెల్లించే విషయమై జైట్లీతో చర్చించానని అన్నారు.

విజయ్ మాల్యా ఏం చెప్పారంటే

బకాయిల చెల్లింపుల సమస్యను పరిష్కరించుకోవాలని తాను అనుకుంటున్నానని, ఇందుకోసం కర్ణాటక హైకోర్టును కూడా కోరానని తెలిపాడు. ఆయన మాట్లాడుతూ... '‌బకాయిల చెల్లింపులపై కర్ణాటక హైకోర్టులో ఒక అంశాన్ని ప్రతిపాదించాను. ఈ విషయమై ఈ ఏడాది జూన్‌ 22న కర్ణాటక హైకోర్టులో ఓ దరఖాస్తు దాఖలు చేశాను. కోర్టు అధీనంలో ఉన్న నా ఆస్తులను అమ్మేందుకు అనుమతి ఇవ్వాలని కోరాను. వాటిని విక్రయించి రుణదాతలకు డబ్బులు చెల్లిస్తానని చెప్పాను. దీనిపై న్యాయమూర్తులు సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నాను. అందరికీ బాకీ చెల్లిస్తా' అని అన్నాడు.

మాల్యా వ్యాఖ్యలను ఖండించిన జైట్లీ

విజయ్ మాల్యా వ్యాఖ్యలను అరుణ్ జైట్లీ ఖండించారు. మాల్యాకు తాను ఎప్పుడు కూడా అపాయింటుమెంట్ ఇవ్వలేదని తేల్చి చెప్పారు. ఓసారి పార్లమెంటు ఆవరణలో హడావుడిగా తనతో మాట్లాడాడని చెప్పారు. రుణాల సెటిల్మెంట్ అంశాన్ని నేరుగా బ్యాంకులతోనే మాట్లాడాలని తాను సూచించాని అన్నారు.

పేరు చెప్పకుండా మాల్యా

విజయ్ మాల్యా 2016 మార్చిలో భారత్ వదిలి వెళ్లారు. అప్పుడు కూడా జైట్లీయే ఆర్థికమంత్రిగా ఉన్నారు. తాను భారత ఆర్థికమంత్రిని కలిశానని చెప్పిన మాల్యా.. ఆ పేరును మాత్రం చెప్పలేదు. తాను భారత్ వదిలి వెళ్లేముందు అని చెప్పినందున అప్పుడు ఉన్నది జైట్లీనే. జైట్లీని కలిసి వెళ్లానని మాల్యా చెప్పడం సంచలనంగా మారింది.

జైలును మూడుసార్లు పరిశీలించిన యూకే జడ్జి

పలు బ్యాంకులకు వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టి బ్రిటన్‌లో తలదాచుకుంటున్న విజయ్ మాల్యాను భారత్‌కు పంపే అంశంపై లండన్‌ కోర్టులో గత కొంతకాలంగా విచారణ జరుగుతోంది. భారత్‌లో జైళ్లు సరిగ్గా లేవని, గాలి వెలుతురు కూడా ఉండదని మాల్యా ఆరోపించారు. దీంతో మాల్యాను ఉంచే జైలు వీడియోను సమర్పించాల్సిందిగా కోర్టు భారత అధికారులను సూచించింది. ఇటీవలే ఆ వీడియోను అధికారులు లండన్‌ కోర్టుకు పంపించారు. బుధవారం విచారణలో కోర్టు ఆ వీడియోను పరిశీలించింది. లండన్‌లోని వెస్ట్ మినిస్టర్ కోర్టులో విచారణ జరిగింది. మాల్యాను ఉంచనున్న ముంబై జైలు వీడియోను యూకే జడ్జి మూడుసార్లు పరిశీలించారు.

Have a great day!
Read more...

English Summary

Embattled liquor tycoon Vijay Mallya said Wednesday he met the Finance Minister before leaving India. The 62-year-old former Kingfisher Airline boss, who arrived to appear before the Westminster Magistrates' Court in London, told reporters that he had met the minister and offered to settle the issue with the banks.