పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఇరాన్- అమెరికా మధ్య యుద్ధ వాతావరణం మరోసారి తారాస్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో పశ్చిమాసియాలో ఉన్న అమెరికా పౌరులు వెంటనే ఆ ప్రాంతాన్ని వీడాలని అమెరికా అడ్వైజరీ జారీ చేస్తోంది. పశ్చిమాసియా దేశాల్లోని అమెరికన్ పౌరులు వెంటనే ఆ దేశాల్ని వీడాలని అమ్మాన్, జెరుసలేం, బాగ్దాద్ లోని అమెరికన్ దౌత్య కార్యాలయాలు అడ్వైజరీ జారీ చేశాయి. ఇరాన్- అమెరికా మధ్య పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారితే తమ ప్రాంతాలను వీడేందుకు అమెరికన్ పౌరులు సిద్ధంగా ఉండాలని అందులో పేర్కొంది.
విమానాలకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలని అలాగే స్థానిక అధికారులు జారీ చేసే భద్రతా పరమైన నియమ నిబంధనలను పాటించాలని ఆయా దేశాల్లోని అమెరికన్ దౌత్య కార్యాలయాలు కీలక ప్రకటనలు చేశాయి. పశ్చిమాసియాలోని పలు దేశాల్లో గగనతలాలు తాత్కాలికంగా మూసివేత, ప్రయాణాల్లో అంతరాయం తదితర సమస్యలు ఉన్నాయి. దాంతో అమెరికన్ పౌరులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని.. పరిస్థితి చేయి దాటితే అక్కడి నుంచి బయట పడేందుకు మార్గాలను సిద్ధం చేసుకోవాలని అమెరికా దౌత్య కార్యాలయాలు చెబుతున్నాయి.
ఈ మేరకు పశ్చిమాసియాలోని కీలక ఎయిర్ పోర్ట్ లు అయిన ఎర్ బిల్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్, బాగ్దాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్, బస్ రా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్, సులేమానియా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్స్ లోని ఫ్లైట్స్ వివరాలను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలని అధికారులు వెల్లడిస్తున్నారు. మరికొద్ది గంటల్లో ఇరాన్ పై అమెరికా భారీ స్థాయిలో దాడులు జరిపే అవకాశం ఉందని అందుకు అనుగుణంగానే ముందస్తు చర్యల్లో భాగంగా అమెరికన్ దౌత్య కార్యాలయాలు ఇలాంటి అడ్వైజరీలు జారీ చేస్తున్నట్లు సమాచారం అందుతోంది.
అమెరికాతో శాంతి ఒప్పందానికి ఇరాన్ ససేమిరా అనడంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్ పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మరోసారి అత్యంత భీకరమైన దాడులు చేసేందుకు అమెరికా సైన్యం సిద్ధం అవుతున్నట్లు సమాచారం.