19 ఏళ్ల కుర్రాడు రాసిన వీలునామా.. కోట్లు విలువైన ఆస్తిని ఎవరికిచ్చాడంటే?

సాధారణంగా వృద్ధాప్యంలోనో లేదా కుటుంబం విడిపోయే స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే ఎవరైనా తమ ఆస్తిపాస్తుల గురించి వీలునామా రాస్తుంటారు. అది కూడా తమ పిల్లలకో, భార్యకో లేదా సొంత కుటుంబ సభ్యులకో చెందేలా రాస్తారు. కానీ, చైనాలోని షాంఘైకి చెందిన 19 ఏళ్ల ఓ కాలేజీ విద్యార్థి మాత్రం అందరికంటే భిన్నంగా ఆలోచించాడు. టీనేజ్ వయసులోనే తన పేరిట ఉన్న రూ. 28.1 కోట్ల (20 మిలియన్ యువాన్లు) విలువైన ఆస్తిని సొంత తల్లిదండ్రులకు కాకుండా.. తన ప్రాణ స్నేహితుడికి రాసిస్తూ లీగల్ నోటరీ చేయించాడు. ఈ విచిత్ర నిర్ణయం వెనుక ఉన్న అసలు కారణాలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.

Advertisement

దక్షిణ చైనా మార్నింగ్ పోస్ట్ కథనం ప్రకారం.. 'లీ' అనే 19 ఏళ్ల విద్యార్థికి చిన్నప్పుడే తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత వారిద్దరూ వేర్వేరు వ్యక్తులను పెళ్లి చేసుకున్నారు. లీ పేరిట ఒక లగ్జరీ ఫ్లాట్, బ్యాంకుల్లో కోట్ల రూపాయల సేవింగ్స్ మొత్తాలను బదిలీ చేసినప్పటికీ.. అతన్ని పెంచే బాధ్యతను మాత్రం ఇద్దరూ విస్మరించారు. చిన్నతనం నుంచే తల్లిదండ్రుల ప్రేమకు దూరమవ్వడంతో.. లీ మానసికంగా ఒంటరైపోయాడు. తనను కన్నవారైనా.. వారితో ఎలాంటి ఎమోషనల్ బాండింగ్ లేకుండా పెరిగాడు.

Advertisement

దీనికి తోడు లీకి 'ఎక్స్‌ట్రీమ్ స్పోర్ట్స్' ఆడటం అలవాటు. నిరంతరం ప్రాణాలతో చెలగాటం ఆడే క్రీడల్లో పాల్గొంటూ ఉండటంతో.. తన భవిష్యత్తుపై అతనికి నమ్మకం లేకుండా పోయింది. ఒకవేళ తనకు ఏదైనా ప్రమాదం జరిగితే, తాను చట్టబద్ధంగా వీలునామా రాయకపోతే.. చైనా వారసత్వ చట్టం ప్రకారం ఆస్తి మొత్తం తల్లిదండ్రులకు వెళ్తుంది. ఆ తర్వాత ఆ డబ్బు తనకెంతో అపరిచితులైన తన తల్లిదండ్రుల కొత్త భాగస్వాములకు (Stepparents) చెందుతుంది. ఇది లీకి అస్సలు ఇష్టం లేదు. అందుకే, చిన్నప్పటి నుంచి తన కష్టసుఖాల్లో తోడుగా ఉంటూ, తాను ప్రాణంకంటే ఎక్కువగా నమ్మే బాల్య స్నేహితుడిని తన సర్వాస్తులకు ఏకైక వారసుడిగా ప్రకటిస్తూ చట్టబద్ధంగా వీలునామా రాసేశాడు.

Advertisement

చట్టం ఏం చెబుతోంది?

చైనా వారసత్వ చట్టం ప్రకారం ఒక వ్యక్తికి పెళ్లి కాకుండా, పిల్లలు లేకపోతే.. అతని ఆస్తి మొదటి హక్కుదారులైన తల్లిదండ్రులకే చెందుతుంది. అయితే, అదే చట్టంలో ఒక వ్యక్తి తన సొంత కుటుంబ సభ్యులు కాకుండా బయటి వ్యక్తులకు కూడా వీలునామా ద్వారా ఆస్తిని రాసిచ్చే వెసులుబాటు ఉంది. ఈ నిబంధనను వాడుకుని లీ 'చైనా వీలునామా రిజిస్ట్రేషన్ సెంటర్' లో తన మరణశాసనాన్ని అధికారికంగా నోటరీ చేయించుకున్నాడు.

ఈ రిజిస్ట్రేషన్ సెంటర్ ఆఫీస్ మేనేజర్ హువాంగ్ హైబో దీనిపై స్పందిస్తూ.. లీ రాసిన వీలునామా చట్టబద్ధంగా చెల్లుతుందని తెలిపారు. అయితే, భవిష్యత్తులో లీకి ఏదైనా ప్రమాదం జరిగి వీలునామా అమలులోకి వచ్చినప్పుడు.. ఆ బాల్య స్నేహితుడు తనకు ఆస్తి దక్కిన విషయం తెలిసిన 60 రోజులలోపు లీగల్‌గా ఆ వారసత్వాన్ని అంగీకరించాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ 60 రోజుల్లోగా ఒప్పుకోకపోతే, ఆ ఆస్తిని అతను తిరస్కరించినట్లుగా భావించి చట్టం వేరే నిర్ణయం తీసుకుంటుందని అధికారులు స్పష్టం చేశారు. ఏదేమైనా.. ఆస్తి కంటే అప్యాయతే గొప్పదని, నమ్మకానికి మించిన ఆస్తి లేదని ఈ 19 ఏళ్ల కుర్రాడి నిర్ణయం నిరూపించింది.

English Summary

A 19-year-old student from Shanghai legally leaves his entire 20 million yuan (Rs 28.1 crore) estate to his childhood friend instead of his divorced parents.