58మంది చనిపోవడానికి కారణమిదే!: కేసీఆర్ విచారం, రూ.5 లక్షల ఎక్స్‌గ్రేసియా


కొండగట్టు: జగిత్యాల జిల్లా కొండగట్టులో మంగళవారం ఘోర ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో దాదాపు 58మంది వరకు మృతి చెందారు. మృతుల్లో ఏడుగురు చిన్నారులు, పాతిక మంది మహిళలు ఉన్నారు. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 70 మంది ఉన్నారు. మృతులు పెద్దపల్లి, జగిత్యాల జిల్లాలకు చెందినవారు.

ప్రమాదానికి అతివేగం, డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నారనే అనుమానాలు, రెగ్యులర్ రూట్లో కాకుండా షార్ట్ కట్ రూట్లో రావడం, డౌన్ కావడంతో న్యూట్రల్ గేర్ వేసుకొని రావడం కారణాలుగా తెలుస్తోంది. స్పీడ్ బ్రేకర్ వద్ద వేగానికి బస్సు పైకి ఎగిరింది..

ఊపిరి ఆడకపోవడం వల్లే ఎక్కువమంది మృతి

ఇంతమంది చనిపోవడానికి ఊపిరి ఆడకపోవడమే కారణంగా చెబుతున్నారు. బస్సు లోయలో పడిన సమయంలో ఒకరిపై ఒకరు పడటంతో ఉక్కిరిబిక్కిరి అయి ఊపిరి ఆడక ఎక్కువమంది చనిపోయి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఘటనా స్థలంలోనే ఇరవై మందికి పైగా చనిపోయారు. ఆసుపత్రిలో మరికొందరు ప్రాణాలు కోల్పోయారు.

కొండగట్టు వద్ద ఘోర ప్రమాదం: లోయలో పడ్డ బస్సు

ప్రమాదం జరగ్గానే స్థానిక యువత సహాయం

ప్రమాదం జరిగిన వెంటనే దగ్గరలోని యువకులు, పోలీసు, రెవెన్యూ సిబ్బంది సహాయచర్యలు చేపట్టారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న జిల్లా కలెక్టర్‌ శరత్‌, ఎస్పీ సింధూశర్మ వెంటనే సంఘటన స్థలం చేరుకుని, సహాయక చర్యలను పర్యవేక్షించారు. శనివారంపేట నుంచి జగిత్యాల వస్తున్న జగిత్యాల డిపోకు చెందిన బస్సు కొండగట్టు ఘాట్ రోడ్డులో అదుపు తప్పి లోయలోపడింది.

మెయిన్ రోడ్డు పైకి రావడానికి నిమిషం ముందు ప్రమాదం

కొండగట్టు పుణ్యక్షేత్రానికి మంగళవారం ఎక్కువ మంది భక్తులు వస్తుంటారు. రద్దీ నేపథ్యంలో భక్తులు ఆర్టీసీ బస్సులో తిరిగి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. కొండపై నుంచి కిందకి వస్తున్న బస్సు మరో నిమిషంలో మెయిన్ రోడ్డు పైకి చేరుకునే సమయంలో ఈ ఘటన జరిగింది.

ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి

ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించేందుకు డ్రైవర్‌ స్టీరింగ్‌ తిప్పడంతోనే బస్సు అదుపుతప్పి లోయలో పడిందని కొందరు చెబుతున్నారు. గాయపడ్డ వారికి జగిత్యాల ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

మృతుల కుటుంబాలకు నష్టపరిహారం

కొండగట్టు ప్రమాదంపై ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో ప్రాణనష్టంపై ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం ప్రకటించారు. ఘటనాస్థలంలో వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కాగా, మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. కొండగట్టు ప్రమాదంపై ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Have a great day!
Read more...

English Summary

Forty pilgrims are feared dead and several others were injured when a state-run Road Transport Corporation (RTC) bus fell off a ghat road of a hill into a gorge in Telangana’s Jagitial district on Tuesday.