భారీగా డబ్బు తీసుకున్నట్లు అంగీకారం: జగ్గారెడ్డిపై 8సెక్షన్ల కింద కేసులు, 25 వరకు రిమాండ్


జగ్గారెడ్డిపై 8సెక్షన్ల కింద కేసులు

హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి(తూర్పు జయప్రకాశ్ రెడ్డి) తన భార్యాపిల్లల పేరు మీద అక్రమ పాస్ పోర్టులు పొందారని నార్త్ జోన్ డీసీపీ సుమతి వెల్లడించారు. భార్యాపిల్లల పేరుతో ఇతరులను అమెరికాకు తీసుకెళ్లి వారిని అక్కడే వదిలి వచ్చారనే ఆరోపణలపై జగ్గారెడ్డిని సోమవారం రాత్రి పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

మానవ అక్రమ రవాణా?: ఆ ఫ్యామిలీని అమెరికాలోనే వదిలేశారు, జగ్గారెడ్డి అరెస్ట్

సోమవారం ఉదయం జగ్గారెడ్డికి గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం నార్త్ జోన్ డీసీపీ కార్యాలయానికి తరలించారు.

అక్రమంగా పాస్ పోర్టులు..

ఈ సందర్భంగా నార్త్ జోన్ డీసీపీ సుమతి ఈ కేసుకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. 2004లో జగ్గారెడ్డి తనతోపాటు భార్య, పిల్లల పేరు మీద పాస్ పోర్టులు తీసుకుని వేరొకరిని అమెరికా తీసుకెళ్లినట్లు గుర్తించామని డీసీపీ సుమతి తెలిపారు. ఆయనతోపాటు వెళ్లింది తెలంగాణకు చెందిన వారు మాత్రం కాదని చెప్పారు. కాగా, ఆ కుటుంబం గుజరాత్ రాష్ట్రానికి చెందినదిగా సమాచారం.

భారీగా డబ్బు తీసుకున్నట్లు జగ్గారెడ్డి అంగీకరించారు

సికింద్రాబాద్ మార్కెట్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ అంజయ్యకు వచ్చిన ఫిర్యాదు మేరకు దీనిపై కేసు నమోదు చేశామన్నారు. పాస్ పోర్టులో జగ్గారెడ్డి భార్య ఫొటో, పిల్లల పుట్టిన తేదీలు మార్పిడి జరిగిందని అన్నారు. అక్రమంగా తరలించిన ముగ్గురి నుంచి జగ్గారెడ్డి రూ.లక్షల్లో(15లక్షలు) వసూలు చేసినట్లు గుర్తించామని చెప్పారు. ఈ విషయాన్ని కూడా జగ్గారెడ్డి అంగీకరించారని డీసీపీ తెలిపారు. ఆయనపై అధికార దుర్వినియోగం కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

8సెక్షన్ల కింద కేసులు నమోదు

2004లో నకిలీ పత్రాలు, పాస్ పోర్టుతో మానవ అక్రమ రవాణా చేసిన కేసులో జగ్గారెడ్డిపై పోలీసులు 8 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. టాస్క్ ఫోర్స్ డీసీపీ కార్యాలయంలో 3గంటలపాటు జగ్గారెడ్డిని విచారించిన అనంతరం అదుపులోకి తీసుకున్నారు. గుజరాత్ కి చెందిన ముగ్గురిని తన కుటుంబసభ్యులుగా మార్చి అమెరికాకి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో జగ్గారెడ్డిపై ఐపీసీ 419, 490, 467, 468, 471, 370, పాస్ పోర్టు యాక్ట్ సెక్షన్ 12, ఇమ్మిగ్రేషన్ యాక్ట్ 24 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.

25 వరకు రిమాండ్

కాగా, మంగళవారం జగ్గారెడ్డికి వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం సికింద్రాబాద్ సిటీ కోర్టు 18వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ముందు జగ్గారెడ్డిని హాజరుపర్చారు. కోర్టులో ప్రవేశపెట్టగా.. జగ్గారెడ్డికి సెప్టెంబర్ 25 వరకు రిమాండ్ విధించింది.

ముందస్తు ఎన్నికల ముందే అరెస్ట్ ఎందుకు?

కాగా, టీఆర్ఎస్ పార్టీ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే తనపై అక్రమ కేసులు పెట్టిందని జగ్గారెడ్డి అన్నారు. సంగారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన బహిరంగ సభ కోసం ఏర్పాట్లు చేస్తున్నానని.. సభ ఫెయిల్ చేసేందుకే ఈ చర్యకు దిగారని మండిపడ్డారు. తాను ఎవరిని అక్రమంగా విదేశాలకు తీసుకెళ్లలేదని, రాజకీయంగా దెబ్బ తీసేందుకే ఎన్నికల సమయంలో తప్పుడు కేసులు పెట్టారని అన్నారు. 2004 నుంచి లేని తొందర ముందస్తు ఎన్నికల నేపథ్యంలో తనను అరెస్ట్ చేయడంతో అందరికీ అర్థమైందన్నారు.

Have a great day!
Read more...

English Summary

Hyderabad North Zone DCP Sumathi on Tuesday held a press meet over jagga reddy passport fraud case.