60కి పెరిగిన బస్సు ప్రమాదం మృతులు, హత్యాయత్నం కేసు నమోదు చేయాలని హెచ్చార్సీలో పిటిషన్


హైదరాబాద్/కొండగట్టు: కొండగట్టు బస్సు ప్రమాద ఘటనపై బుధవారం హెచ్ఆర్సీలో పిటిషన్ దాఖలైంది. బస్సు ప్రమాదానికి బాధ్యులైన వారిపై హత్యాయత్నం కేసులు నమోదు చేయాలని పిటిషనర్ కోరారు. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున సాయం అందేలా చూడాలని తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

మరోవైపు, కొండగట్టు బస్సు ప్రమాద కుటుంబాలకు రూ.50 లక్షలు ఇవ్వాలని అఖిలపక్షం నేతలు డిమాండ్ చేశారు. వారు బుధవారం బాధితులను పరామర్శించారు. ఈ ప్రమాదం ఏకంగా 12 గ్రామాల్లో విషాదం నింపింది. మృతుల సంఖ్య 60కి చేరుకుంది. కొండగట్టు వద్ద బస్సు 30 అడుగుల లోతున పడిపోయిన విషాద సంఘటన మంగళవారం చోటు చేసుకున్న విషయం తెలిసిందే.

58మంది చనిపోవడానికి కారణమిదే!: కేసీఆర్ విచారం, రూ.5 లక్షల ఎక్స్‌గ్రేసియా

బాధితులకు ఎల్ రమణ పరామర్శ

బస్సు ప్రమాదానికి గురైన ప్రాంతాన్ని తెలంగాణ టీడీపీ అధ్యక్షులు ఎల్ రమణ పరిశీలించారు. అక్కడి వారిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడారు. బాధిత కుటుంబాలకు రూ.20 లక్షల పరిహారం, గాయపడ్డ వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పారు. మృతుల కుటుంబాలకు టీడీపీ తరఫున రూ.25వేల చొప్పున ఆర్థికసాయం ఇచ్చారు. తెరాస ఎంపీ వినోద్ తదితరులు కూడా పరామర్శించారు.

60కి పెరిగిన బస్సు ప్రమాదం మృతులు
అంత్యక్రియలకు వర్షం అడ్డంకి

తెలంగాణలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పోస్టుమార్టం నిర్వహించిన మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించడం అడ్డంకిగా మారింది. జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం రాంసాగర్, హిమ్మత్‌పేట, శనివారంపేట గ్రామాలకు చెందిన వారిని వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు.

బస్సులో వంద మందికి పైగా

జగిత్యాల డిపోకు చెందిన బస్సు కొండగట్టు దేవాలయానికి ఆరు కిలో మీటర్ల దూరంలో ఉన్న శనివారంపేటకు నిత్యం రోజుకు మూడు ట్రిప్పులలో ప్రయాణికులను తీసుకు వెళ్తుంది. సాధారణంగా ప్రతీ మంగళవారం భక్తుల రద్దీ కొంచెం ఎక్కువగా ఉంటుంది. బస్సు ఉదయం 9.30 గంటలకు శనివారంపేట నుంచి బయల్దేరింది. అక్కడ సుమారు ఇరవై మందికి ఎక్కారు. ఆ తర్వాత మధ్యలో తిర్మలాపూర్‌, డబ్బు తిమ్మాయిపల్లి, రాంసాగర్‌, నాచుపల్లి మీదుగా కొండగట్టు దేవాలయ సమీపంలోని వై జంక్షన్‌కు 10.40 గంటలకు వచ్చింది. ఆయా గ్రామాల్లో ఎక్కిన వారితో అప్పటికే బస్సు పూర్తిగా నిండడంతో ఆలయం సమీపంలో ఐదారుగురు భక్తులు మాత్రమే ఎక్కారు. అప్పటికే డ్రైవరు, కండక్టరు సహా బస్సులోని వారి సంఖ్య 101 మందికి చేరింది.

బస్సు ఇలా అదుపు తప్పి ఉంటుంది

సకాలంలో బ్రేకులు పడకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చెబుతున్నారు. బస్సులో పరిమితికి మించి ప్రయాణీకులు ఉండటం, గుట్ట దిగే సమయంలో డ్రైవర్ బస్సును న్యూట్రల్‌లో నడుపుతుండటం వంటివి ప్రమాదానికి దారి తీసి ఉంటాయని అంటున్నారు. ప్రమాదస్థలానికి కొద్ది దూరంలోనే స్పీడ్ బ్రేకర్లు ఉన్నా బస్సు అదుపులోకి రాలేదు. దీనిని బట్టి చూస్తే బ్రేకులు పడకపోవచ్చునని అంటున్నారు. స్పీడ్ బ్రేకర్ల వద్ద కుదుపుకు గురైన ఆ తర్వాత వ్యాన్‌ను ఢీకొట్టి, క్షణాల్లో గుంతలోకి పల్టీ కొట్టిందని చెబుతున్నారు. మలుపులో బస్సు సుమారు 20 మీటర్ల దూరంలోనే ఎడమ వైపుకు మరలాల్సి ఉన్నా వ్యానును ఢీకొట్టిన తర్వాత స్టీరింగ్ పైన నియంత్రణ తప్పి ఉంటుందని, అదే వేగంతో అదుపు తప్పి ఉంటుందని అంటున్నారు.

Have a great day!
Read more...

English Summary

Did overcrowding of the Telangana State Road Transport Corporation (TSRTC) bus lead to the ghastly accident which claimed above 58 persons on the ghat road of the Kondagattu temple shrine in Kodimial mandal of Jagtial district on Tuesday?