తెలంగాణ‌లో కుదిరింది మ‌హాకూట‌మి...! ఇక ల‌క్ష్యం టీఆర్ఎస్ ఓట‌మి..!


తెలంగాణ‌లో కుదిరింది మ‌హాకూట‌మి...!

హైద‌రాబాద్: తెలంగాణలో రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు శ‌రవేగంగా మారిపోతున్నాయి. అదికార గులాబీ పార్టీని టార్గెట్ చేస్తూ పార్టీల‌న్నీ ఏక‌మౌతాయ‌ని ప్ర‌చారం జ‌రిగిన‌ప్ప‌టికి కార్య‌రూపం దాల్చ‌లేదు. టీడిపి జాతీయ అద్యక్షుడు చంద్ర‌బాబు నాయుడు తెలంగాణ ప‌ర్య‌ట‌న త‌ర్వాత రాజ‌కీయంగా వేడి పెరిగింది. అంతే స్థాయిలో పొత్తుల పై చ‌ర్చ‌లు వేగంగా జ‌రిగిపోతున్నాయి. అదికార టీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తూ తెలంగాణ‌లోని పార్టీల‌న్నీ ఐక్య‌తా రాగం పాడుతున్నాయి.ఇప్ప‌టికే కాంగ్రెస్, టీడిపి, సీపిఐ, జ‌న‌స‌మితి పార్టీల‌లో ఏకాభిప్రాయం కుదిరింది. దీంతో వ‌చ్చే ఎన్నిక‌లు ర‌స‌వ‌త్తరం కానున్నాయ‌నే సంకేతాలు వెలువ‌డుతున్నాయి.

తెలంగాణ‌లో పార్టీల మ‌ద్య ఏకాభిప్రాయం..!మ‌హాకూట‌మిగా ఏర్ప‌డ‌నున్న పార్టీలు..!

ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఎలాగైనా అదికారంలోకి రావాలనే లక్ష్యంతో ప్రతిపక్ష కాంగ్రెస్, టీడీపీ, సీపీఐలు మహాకూటమిగా ఏర్పడ్డాయి. తెలంగాణ‌ ఇది ఓ కొత్త చరిత్రగా ప‌రిగ‌ణించొచ్చు. సిద్ధాంతపరంగా పూర్తి భిన్న ధృవాలు అయిన కాంగ్రెస్, టీడీపీలు తొలిసారి కలసి పోటీ చేయనున్నాయి. రాజకీయాల్లో ఇది ఓ పెద్ద సంచలనం కానుంది. అయితే ఈ ప్రభావం తెలుగుదేశం పార్టీపై ఏ మేరకు ఉంటుందనే అంశంపై రకరకాల వాదనలు విన్పిస్తున్నాయి. తెలుగుదేశం అధిష్టానం తెలంగాణలో కాంగ్రెస్ తో కలసి ముందుకు సాగేందుకే నిర్ణయం తీసుకుంది. దీని వల్ల కాంగ్రెస్ పార్టీకి ఉంటే లాభమే తప్ప పెద్దగా నష్టం మాత్రం ఉండదు. అయితే టీడీపీ పరిస్థితి ఏంటి అనేది ఎన్నికల తర్వాత మాత్రమే తేలనుంది. అయితే ఈ కూటమిలోకి కోదండరాంకు చెందిన తెలంగాణ జన సమితి వస్తుందా? రాదా అన్నదానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. అయితే టిక్కెట్ల కేటాయింపు అంశంలో ఆయా పార్టీల మధ్య స‌యోద్య కోసం మ‌రోసారీ స‌మావేశం కానున్న‌రు మ‌హాకూట‌మి పెద్ద‌లు.

రాజ‌కీయేత‌ర శ‌క్తుల‌ను కూడా క‌లుపుకుంటాం..! గులాబీ పార్టీని ఎదిరిస్తాం అంటున్న నేత‌లు..!

ఇదిలా ఉండ‌గా కేవలం పార్టీలతోనే కాకుండా ఉద్యోగ, నిరుద్యోగ, ప్రజా, మహిళా సంఘాలతో కలసి వెళతామని టీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. పొత్తులపై ప్రాథమిక చర్చలే జరిగాయని, మేనిఫెస్టోను ఉమ్మడిగా ప్రజల ముందుంచుతామన్నారు. కేసీఆర్‌లో నియంతృత్వ పోకడలు పెచ్చుమీరాయని సీపీఐ నేత చాడ వెంకట్‌రెడ్డి విమర్శించారు. విపక్షాల పొత్తుతో కేసీఆర్‌కు చెక్‌ పెడతామని టీటీడీపీ నేత ఎల్‌ రమణ అన్నారు. దేశంలో ఆదర్శంగా నిలవాల్సిన తెలంగాణ ప్రభుత్వం ఎవ్వరితో చర్చలు జరపకుండా అసెంబ్లీని అర్దంత‌రంగా రద్దు చేశారని ఆరోపించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రతి పక్షాల గొంతు నొక్కుతోందన్నారు. మహాకూటమి నేతృత్వంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని నేతలు పేర్కొన్నారు.

జ‌గ్గారెడ్డి అరెస్ట్ అప్ర‌జాస్వామికం..! ముమ్మాటికి క‌క్ష్య‌పూరిత‌మే అంటున్న కాంగ్రెస్!

అదికార పార్టీ పైన జ‌గ్గారెడ్డి కేసుకు సంబంధించి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 2007 పాస్ పోర్టు కేసు వాంగ్మూలంలో ఆపద్ధర్మ సీఎం కెసీఆర్, మంత్రి హరీష్ రావుల పేర్లు కూడా ఉన్నాయని ఉత్తమ్ సంచలన ఆరోపణలు చేశారు. వీరితోపాటు మరికొంత టీఆర్ఎస్ నాయకుల పేర్లు కూడా ఉన్నాయని తెలిపారు. 2007 మే 22న అప్పటి సీఐడీ డీఎస్పీ గోపాలరాజు నిందితుడు మహ్మద్ రషీద్ అల్వీ అంగీకార వాంగ్మూలం నమోదు చేశారని తెలిపారు. అమెరికా వీసా పొందటానికి ఎంపీలు, ఎమ్మెల్యేలు సిఫారసు లేఖలు ఇఛ్చేవారని అందులో ఉందన్నారు. ఇలా లేఖలు ఇచ్చిన వారిలో కెసీఆర్ తోపాటు హరీష్ రావు సిఫార్స్ లేఖలు కూడా ఉన్నాయని తెలిపారు.

అదికారుల పార‌ద‌ర్శ‌కంగా వ్య‌వ‌హ‌రించాలంటున్న ఉత్త‌మ్..!!

అక్ర‌మ వీసా వ్య‌వ‌హారాల్లో కేసీఆర్, హ‌రీష్ ల‌కు కమీషన్లు ముట్టాయని ఉత్త‌మ్ ఆరోపిస్తున్నారు. 2005 అక్టోబర్ నుంచి 2006 ఫిబ్రవరి మధ్యలో ఎనిమిది మందికి వీసాలు ఇవ్వాలని కెసీఆర్ సిఫారసు లేఖలు ఇచ్చారని వాంగ్మూలంలో ఉందని తెలిపారు. ఈ వ్యవహారంలో ముందు కెసీఆర్, హరీష్ రావులను ఎందుకు అరెస్టు చేయలేదని డీజీపీని ప్రశ్నించినట్లు తెలిపారు. కెసీఆర్ కుటుంబానికి తొత్తులుగా వ్యవహరించే అధికారులకు హెచ్చరిస్తున్నామని ఉత్తమ్ ఘాటుగా వ్యాఖ్యానించారు. అంతేకాకుండా వాంగ్మూలంలోని ఓ పేరాను ఉత్తమ్ చదివి డాక్యుమెంట్ ఎవిడెన్స్ ను మీడియాకు వెళ్ల‌డించారు ఉత్త‌మ్. ఇదే వ్య‌వ‌హారం రాబోవు రోజుల్లో ఏ మ‌లుపు తిరుగుతుందో చూడాలి.

Have a great day!
Read more...

English Summary

political heat increased in telangana. all parties comes under one umbrella in telangana against trs party. all parties like congress, tdp, cpi, jana samithi farming as great coalition in telangana. all parties targeting trs party for next elections.