నన్ను బతిమాలారు, కేటీఆరే సీఎం, ఆయన్ను వ్యతిరేకించా అందుకే: కొండా సురేఖ


కొడుకును సీఎం చేయడమే కేసీఆర్ ప్లాన్: కొండా సురేఖ

వరంగల్: ఉద్దేశ్యపూర్వకంగానే తనను పక్కన పెట్టారని మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ బుధవారం తెరాస అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు, కేటీఆర్‌లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు, మూడు టిక్కెట్లు అడిగామన్నది పూర్తిగా అబద్దమని చెప్పారు. తమ కూతురు లేదా భర్తను భూపాలపల్లిలో పోటీ చేయించాలనుకున్నామని, కానీ తాము పార్టీ ముందు ఎలాంటి డిమాండ్లు పెట్టలేదని చెప్పారు.

23 దాకా ఆగుదాం, బహిరంగలేఖ రాసి మీ తప్పుచెప్తాం: కేసీఆర్‌పై కొండా సురేఖ

మంత్రి, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పదవుల హామీతోనే తనను పార్టీలోకి తీసుకున్నారని చెప్పారు. తాను అహంకారిని అయితే తన నియోజకవర్గం ప్రజలు తనను నాలుగుసార్లు ఎలా గెలిపిస్తారని ఆమె ప్రశ్నించారు. తనకు రాజకీయ భిక్ష పెట్టింది తెరాస కాదని విమర్శించారు. తెరాస రాజకీయ అవసరాల కోసం తనను బరిలోకి దింపారని చెప్పారు. తెరాస అధినేత కేసీఆర్‌ది నియంతృత్వ పోకడ అన్నారు. మంత్రులు కూడా నోరు విప్పే పరిస్థితి లేదని చెప్పారు.

ఈ ఎన్నికల్లో గెలిస్తే కేటీఆరే ముఖ్యమంత్రి

కేసీఆర్ చుట్టూ కోటరీ ఉందని కొండా సురేఖ అన్నారు. ఈ ఎన్నికలలో గెలిస్తే కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారని, ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ లోకసభకు వెళ్తారని ఆసక్తికర, సంచలన వ్యాఖ్యలు చేశారు. తెరాసకు వచ్చే ఎన్నికల్లో యాభై, అరవైకు మించి సీట్లు రావని జోస్యం చెప్పారు. తమకు అన్ని పార్టీల నుంచి ఆహ్వానాలు వస్తున్నాయని చెప్పారు. ఏ పార్టీలో చేరాలనే విషయాన్ని వినాయక చవితి తర్వాత చెబుతామని అన్నారు.

కొడుకును సీఎం చేయడమే కేసీఆర్ ప్లాన్

టీఆర్ఎస్ పార్టీలో ఓ వర్గం తమను టార్గెట్ చేస్తోందని కొండా సురేఖ ఆరోపించారు. తాము ఏ పార్టీలోకి వెళ్లేది త్వరలో ప్రకటన చేస్తామని తేల్చి చెప్పారు. కొడుకును ముఖ్యమంత్రి చేయడమే కేసీఆర్ ప్లాన్ అని ఆరోపించారు. నేను ఎప్పుడు కూడా ప్రజల్లోనే ఉంటానని చెప్పారు. తెరాస నేతలకు అహంకారం ఎక్కువ అన్నారు.

కేటీఆర్‌తో విభేదించా, అందుకే కావొచ్చు

తాను వ్యక్తిగతంగా కేటీఆర్‌తోనే విభేదాలు వచ్చాయని, తాను ప్రశ్నించానని కొండా సురేఖ చెప్పారు. అదే వారిని ఇబ్బంది పెట్టి ఉంటుందని అన్నారు. తాము గత ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీ చేయాలనుకున్నామని, కాను తమను తెరాస ఉపయోగించుకుందని ఆరోపించారు. బాల్క సుమన్ ఎంపీగా ఉన్నారని, అలాంటప్పుడు ఎమ్మెల్యే టిక్కెట్ ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు.

రాయబారం నెరిపారు, బతిమాలారు

మూడు నెలల పాటు తెరాస నేతలు రాయబారం నెరిపారని దాంతో తాము ఆ పార్టీలో చేరామని కొండా సురేఖ అన్నారు. వరంగల్ తూర్పులో నిల్చోవాలని చెప్పారని చెప్పారు. వారు బతిమాలితేనే తాము తెరాసలో చేరానని, మంత్రి పదవి కూడా ఇస్తానని చెప్పారని ఆవేదన వ్యక్తం చేశారు. తెరాసలో వాక్స్వాతంత్ర్యం లేదన్నారు. ఎవరూ మాట్లాడరన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరు మాట్లాడరని చెప్పారు. ఎమ్మెల్యేలు ఎవరూ వ్యక్తిగత ఇబ్బందుల గురించి చెప్పరన్నారు.

కేటీఆర్ కోటరీ, బహిరంగ లేఖ విడుదల చేస్తాం

కేటీఆర్ కోటరీకి ప్రాధాన్యత ఇస్తున్నారని కొండా సురేఖ విమర్శించారు. నటుడు బాబూ మోహన్‌కు టిక్కెట్ ఎందుకు ఇవ్వలేదో చెప్పాలన్నారు. కేసీఆర్ 105 మందిని ప్రకటించిన సమయంలో తాను కేటీఆర్, హరీష్ రావు, సంతోష్‌లకు ఫోన్ చేశానని చెప్పారు. తాము ఏ పార్టీలో చేరేది ఇంకా నిర్ణయించుకోలేదన్నారు. బహిరంగ లేక విడుదల చేసిన తర్వాత నిర్ణయం ప్రకటిస్తామన్నారు. పార్టీల నుంచి ఫోన్స్ వస్తున్నాయని, అవసరమైతే ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తామన్నారు.

Have a great day!
Read more...

English Summary

Former Minister Konda surekha speaks about TRS group politics lashes out at KT Rama Rao.