కొండగట్టు ప్రమాదంలో షాకింగ్, కొత్త కోణాలు: కాసుల కోసం బస్సు దారి మళ్లిందా?


కొండగట్టు: జగిత్యాల జిల్లా కొండగట్టు ఘాట్ రోడ్డులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో యాభై మందికి పైగా మృతి చెందారు. శనివారంపేట నుంచి జగిత్యాల వెళ్తున్న బస్సు కొండపై నుంచి కిందకు దిగుతున్న సమయంలో అదుపు తప్పి 30 అడుగుల లోయలో పడింది.

గుండెలు పిండేసే విషాదం, మాటలు రావట్లేదు: బస్సు ప్రమాదంపై మోడీ, కోవింద్, పవన్ కళ్యాణ్

మరో నిమిషంలో మెయిన్ రోడ్డు పైకి చేరుకుంటుందనే సమయంలోనే ఈ పెను ప్రమాదం సంభవించింది. బస్సు కొండపై నుంచి కిందకు దిగుతున్న సమయంలో స్పీడ్ బ్రేకర్ వద్ద అదుపు తప్పడంతో ప్రయాణీకులు కంగారుపడి ఓ వైపుకు ఒరగడంతో బస్సు లోయలో పడినట్లుగా చెబుతున్నారు.

ప్రమాదం కేసులో కొత్త కోణాలు

ఈ ప్రమాదానికి సంబంధించి కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. కాసుల కక్కుర్తి ఈ ప్రమాదానికి మరో కారణంగా చెబుతున్నారు. మామూలుగా దొంగలమర్రి నుంచి వెళ్లాల్సిన బస్సు కలెక్షన్ల కోసం కొండగట్టు మీదుగా మార్చారని తెలుస్తోంది. బస్సులో పరిమితికి మించి ప్రయాణీకులు ఎక్కారు. బస్సులో మొత్తం 102 మంది ఉన్నారు. బస్సుకు ఫిట్ నెస్ లేదని డ్రైవర్ కూడా ముందే చెప్పాడని అంటున్నారు. ఫిట్ నెస్ లేని బస్సును నడపలేనని కుటుంబ సభ్యులతోను అతను చెప్పారు. అయితే తామే ఒప్పించి పంపించామని కుటుంబ సభ్యులు అంటున్నారు. డ్రైవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.

బస్సు దారి తప్పిందా?

పలువురి వ్యాఖ్యలు కూడా అనుమానాలకు తావిస్తున్నాయి. ఈ బస్సు దారి తప్పి ఘాట్ రోడ్డులోకి వెళ్లిందనే వాదనలు వినిపిస్తున్నాయి. అసలు ఈ మార్గంలో ఆర్టీసీ బస్సులు ప్రయాణించే అవకాశమే లేదని చెబుతున్నారు. ఈటెల రాజేందర్ కూడా ఇదే విషయం చెప్పారు. ఈ రోడ్డు ఆర్టీసీ బస్సులు తిరిగేందుకు అనువైన మార్గం కాదని, అందువల్ల ఆర్టీసీ బస్సులు ఈ మార్గంలోకి రావని చెప్పారు. ఈ బస్సు మాత్రం ఎలా వచ్చిందో తెలియదని, విచారణ జరిపిస్తామన్నారు.

బస్సు బ్రేకులు ఫెయిలయి ఉంటాయని

బస్సు బ్రేకులు ఫెయిలైనందువల్లే ప్రమాదం జరిగినట్లుగా సమాచారం ఉందని ఆపద్ధర్మ మంత్రి మహేందర్ రెడ్డి తెలిపారు. జిల్లా అధికారులు అందరూ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. బస్సు ప్రమాద ఘటనపై విచారణ జరిపిస్తామని తెలిపారు. బాధ్యుల పైన కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. బస్సు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

బస్సుకు ఫిట్‌నెస్ ఉంది

బస్సులో ఎక్కువ మంది స్థానికులే ఉన్నారని ఆర్టీసీ డిపో మేనేజర్ చెప్పారు. కొద్దిమంది మాత్రమే భక్తులు ఉన్నారన్నారు. బస్సుకు ఫిట్‌నెస్ ఉందని చెప్పారు. డ్రైవర్ తప్పిదం వల్లే ప్రమాదం జరిగి ఉండవచ్చునని అన్నారు. బస్సు శనివారంపేట నుంచి బయలుదేరిందని, ఘటనపై విచారణ జరిపిస్తామన్నారు.

చికిత్స పొందుతూ డ్రైవర్ మృతి

కాగా, ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్‌కు కాళ్లు విరిగాయి. అనంతరం ఆయన చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ప్రమాదంలో యాభై నాలుగు మందికి పైగా మృతి చెందారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు. బస్సు ప్రమాద బాధితులకు ఆధునిక వైద్యం అందించాలని తెలంగాణ టీడీపీ అధ్యక్షులు ఎల్ రమణ అన్నారు. క్షతగాత్రులను హైదరాబాద్ తరలించాలని ఎంపీ కవిత అన్నారు. ఎస్పీ, కలెక్టర్లతో ఆమె మాట్లాడారు.

Have a great day!
Read more...

English Summary

A bus carrying pilgrims from a Hindu temple in the hills of south India plunged off a road Tuesday, killing at least 55 people including four children, officials said. At least 33 others were injured.