ఎక్కడ పోటీ చేద్దాం, ఎక్కడ గెలుస్తాం: తెలంగాణపై పవన్ కళ్యాణ్ ఆరా


హైదరాబాద్: తెలంగాణలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో అన్ని పార్టీలు పోటీకి సిద్ధమవుతున్నాయి. ప్రారంభంలో జనసేన పార్టీ మౌనంగా కనిపించింది. కానీ ఆ తర్వాత లెఫ్ట్ పార్టీ నేతలతో జనసేన చర్చలు జరిపింది. రేపో మాపో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లెఫ్ట్ పార్టీ నేతలతో సమావేశమై పొత్తును ఖరారు చేయనున్నారు.

మరోవైపు జనసేనాని పార్టీ నాయకులతోను సమావేశమవుతున్నారు. తద్వారా తెలంగాణలో పోటీపై కసరత్తు ప్రారంభించారు. పోటీ చేసే స్థానాలు, విజయావకాశాలపై మంగళవారం చర్చించారు. పలు జిల్లాల నేతలతో ఇప్పటికే సమావేశాలు నిర్వహించారు. గ్రౌండ్ రిపోర్ట్ గురించి ఆరా తీశారు.

పోటీ చేస్తే విజయావకాశాలు ఎలా ఉంటాయి, ఎక్కడ పోటీ చేస్తే గెలుస్తామనే అంశాలపై చర్చించినట్లుగా తెలుస్తోంది. జిల్లాల వారీగా నేతల అభిప్రాయాలు తీసుకుంటున్నారు.

మరోవైపు, తెలంగాణలో మహాకూటమికి అడుగులు పడుతున్నాయి. కాంగ్రెస్‌, టీడీపీ, సీపీఐ నేతలు పార్క్‌ హయత్‌ హోటల్లో మంగళవారం సమావేశమయ్యారు. మూడు పార్టీలు కలిసి మహాకూటమిని ఏర్పాటు చేస్తామని నేతలు ప్రకటించారు. ప్రజల కోసం ప్రతిపక్షాలన్నీ కలుస్తున్నట్లు తెలిపారు. ఇది మొదటి సమావేశమన్నారు.

అన్ని ప్రజా సంఘాలు, ఉద్యోగ, నిరుద్యోగ, మహిళా సంఘాలతో కలిసి వెళ్తామన్నారు. కేసీఆర్ దుర్మార్గపు పాలన చేస్తున్నారని, అన్ని ప్రతిపక్షాలను కలుపుకొని ఎన్నికలకు వెళ్తామన్నారు. కేసీఆర్‌ను గద్దె దించడమే లక్ష్యంగా పని చేస్తామని చెప్పారు. దేశంలో ఆదర్శంగా నిలవాల్సిన తెలంగాణ ప్రభుత్వం ఎవరితోనూ చర్చలు జరపకుండానే అసెంబ్లీని రద్దు చేసిందన్నారు.

Have a great day!
Read more...

English Summary

Jana Sena chief Pawan Kalyan concentrate on Telangana early elections. Jana Sena leaders are meeting with district leaders.