రాహుల్‌గాంధీ సందేశం, కేసీఆర్-హరీష్‌ల పేర్లు: మనుషుల అక్రమ రవాణాలోకి లాగిన రేవంత్


హైదరాబాద్: తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీష్ రావులపై తెలంగాణ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి బుధవారం నిప్పులు చెరిగారు. రాజకీయ కక్షతో కేసును తిరగదోడి హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులో తూర్పు జయప్రకాశ్ రెడ్డి (జగ్గారెడ్డి)ని అక్రమంగా ఇరికించారని ఆరోపించారు.

హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులో నిందితుడు రషీద్ అలీ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా కేసీఆర్, హరీశ్‌ రావులను విచారించాలని డిమాండ్ చేశారు. 2007 మే 22న నిందితుడు మహమ్మద్‌ రషీద్‌ అలీ సీఐడీకి ఇచ్చిన వాంగ్మూలంలో కేసీఆర్, హరీశ్‌ ‌రావు పేర్లు కూడా ఉన్నాయని సంచలన ఆరోపణలు చేశారు.

అధికారంలోకి వచ్చాక దెబ్బకు దెబ్బ, అంతకుమించి వేధిస్తాం, మీ సంగతి చూస్తాం: రేవంత్ వార్నింగ్

ఆ వాంగ్మూలంలో జగ్గారెడ్డి పేరు లేదు

రషీద్ అలీ ఇచ్చిన వాంగ్మూలంలో ఎక్కడ జగ్గారెడ్డి పేరు లేదని రేవంత్ రెడ్డి అన్నారు. అయినా మనుషుల అక్రమ రవాణా కేసులో ఆయనను అరెస్టు చేశారని ధ్వజమెత్తారు. 2007కు సంబంధించిన ఈ కేసులో గత ఏడాది ఆగస్ట్ 24న అప్పటి నాటి నగర కమిషనర్ మహేందర్ రెడ్డి ఛార్జిషీట్‌ వేశారని తెలిపారు.

నా నోటీసులపై స్పందిస్తా

అధికార పార్టీకి చెందిన నేతల పేర్లను తొలగించారని రేవంత్ ఆరోపించారు. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే జగ్గారెడ్డిని అరెస్ట్ చేశారన్నారు. విభజన చట్టంలోని సెక్షన్ 8 ప్రకారం జీహెచ్‌ఎంసీ పరిధిలో శాంతిభద్రతలను గవర్నర్‌ పర్యవేక్షించాల్సి ఉందని చెప్పారు. ఈ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలన్నారు. తనకు నోటిసు ఇచ్చిన అంశంపై పూర్తి వివరాలతో త్వరలో స్పందిస్తానని తెలిపారు.

రాహుల్ గాంధీ సందేశం పంపించారు

కేసులతో బెదిరిస్తే ఆ బెదిరింపులకు భయపడేది లేదని రేవంత్ ఓ టీవీ ఛానల్‌తో అన్నారు. కేసులపై చట్టపరంగా పోరాడుతామని చెప్పారు. అక్రమ కేసులకు భయపడాల్సిన పని లేదన్నారు. అందరి జాతకాలు చెబుతామన్నారు. ఓటమి భయంతో తెరాస నేతలు తమపై అక్రమ కేసులు పెడుతున్నారన్నారు. అక్రమ కేసులకు భయపడాల్సిన పని లేదని, క్షేత్రస్థాయిలో పోరాడాలని ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ సందేశం పంపించారన్నారు.

కేసీఆర్, హరీష్ రావులను తప్పించారు

జగ్గారెడ్డిని తొలుత గెలిపించింది కేసీఆరేనని, అప్పుడు ఎందుకు గెలిపించారో చెప్పాలని రేవంత్ నిలదీశారు. 2007లో నమోదైన కేసుపై 2017లో దుమ్ముదులిపి తెరపైకి తెచ్చారన్నారు. కేసీఆర్, హరీష్ రావులను తప్పించి జగ్గారెడ్డిని ఇరికించారన్నారు. ఎవరైనా మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోవాలన్నారు. తాము డీజీపీని కలిశామని, జగ్గారెడ్డికి అండగా ఉంటామని చెప్పారు. అక్రమ కేసుల్లో ఇరికిస్తున్నారని, కాంగ్రెస్ దీనిని గుర్తు పెట్టుకుంటుందని, వడ్డీతో సహా తిరిగిస్తామని హెచ్చరించారు.

Have a great day!
Read more...

English Summary

Telangana Congress leader and former MLA Revanth Reddy drags KCR and Harish Rao into human trafficking.