చందమామ అందాలు, ఆకాశంలో వింతలను చూడాలనుకునే వారికి, ఖగోళ ప్రేమికులకు, ఒక అద్భుతమైన అవకాశం రాబోతోంది. జులై 29న పౌర్ణమి రాత్రి ఆకాశంలో 'బక్ మూన్' (Buck Moon) ప్రత్యేక కాంతులతో దర్శనమివ్వనుంది. అయితే ప్రతీ ఏటా ఈ పౌర్ణమి వేళ జాబిల్లి కాస్త నారింజ, బంగారు లేదా ఎరుపు రంగు ఛాయల్లో కనిపిస్తుంటుంది. దాంతో నిజంగానే చందమామ రంగు మారిపోతుందా? లేక ఇదొక సహజ సిద్ధమైన వెలుగుల వింత? అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. దీని వెనుక ఉన్న అసలు ఖగోళ విజ్ఞానాన్ని ఇప్పుడు చూద్దాం.
నిజంగానే చందమామ రంగు మారుతుందా?
సమాధానం 'అవును'.. కానీ అది మన కంటికి కనిపించే రూపంలో మాత్రమే! జులై 29న చీకటి పడిన తర్వాత ఆకాశంలోకి తొంగిచూసే బక్ మూన్.. హొరైజన్ వద్ద ఉన్నప్పుడు నారింజ, ఎరుపు లేదా ఎర్రటి కాంతిలో కనిపిస్తుంది. అయితే చందమామ ఉపరితలంపై ఎలాంటి రంగు మార్పూ ఉండదు. అది తన సహజసిద్ధమైన వెండి వెలుగులతోనే ఉంటుంది. మరి మనకు రంగు మారినట్లు ఎందుకు కనిపిస్తుందంటే.. అదంతా మన భూమి చుట్టూ ఉండే వాతావరణం చేసే మాయే!
జాబిల్లి తూర్పున ఉదయిస్తున్నప్పుడు లేదా తక్కువ ఎత్తులో ఉన్నప్పుడు దాని నుంచి వచ్చే కాంతి మన కంటిని చేరడానికి భూమి వాతావరణంలోని చాలా ఎక్కువ పొరల గుండా ప్రయాణించాల్సి ఉంటుంది. ఈ ప్రయాణంలో గాలిలోని ధూళి కణాలు, నీటి ఆవిరి వల్ల నీలం, ఊదా వంటి తక్కువ వేవ్ లెంత్ ఉన్న రంగుల కాంతి చెదిరిపోతుంది. దీనిని సైన్స్‌లో 'రేలీ స్కాటరింగ్' అంటారు. దీనివల్ల ఎక్కువ వేవ్ లెంత్ ఉన్న ఎరుపు, నారింజ రంగు కాంతులు మాత్రమే నేరుగా మన కంటికి చేరతాయి. మనం రోజూ చూసే సూర్యాస్తమయం వేళ సూర్యుడు ఎర్రగా కనిపించడానికి కూడా ఇదే కారణం. వాతావరణ పరిస్థితులు, మనం ఉండే ప్రాంతంలోని గాలి నాణ్యత, కాలుష్యం స్థాయి ఆధారంగా చందమామ రంగు మారుతూ ఉంటుంది. కొందరికి ఇది పసిడి వర్ణంలో, మరికొందరికి దట్టమైన నారింజ లేదా ఎరుపు రంగులో కనిపిస్తుంది. అయితే నింగిలోకి చందమామ పైపైకి ఎదిగే కొద్దీ, కాంతి ప్రయాణించే వాతావరణ పొరల మందం తగ్గుతుంది. దాంతో క్రమంగా జాబిల్లి తన మునుపటి సాధారణ వెండి కాంతిని సంతరించుకుంటుంది. ఖగోళ క్యాలెండర్ ప్రకారం జులై 29న నిండు పూర్ణిమ. భారత కాలమానం ప్రకారం రాత్రి 8:05 గంటల సమయంలో ఇది పున్నమి శోభను సంతరించుకుంటుంది. సూర్యాస్తమయం అయిన వెంటనే తూర్పు ఆకాశంలో చందమామ ఉదయిస్తున్నప్పుడు చూడటం వల్ల ఆ ఎర్రటి, నారింజ రంగుల అద్భుత దృశ్యాన్ని స్పష్టంగా వీక్షించవచ్చు.ఆ రంగుల వెనుక ఉన్న అసలు సైన్స్!
భూమికి దూరమవుతున్న చంద్రుడు! 60 కోట్ల ఏళ్ల తర్వాత..
అందరికీ ఒకేలా కనిపిస్తుందా?
ఆకాశంలో అద్భుతం- డబుల్ బొనాంజా: కళ్ల ముందు తారాజువ్వల్లా రివ్వుమంటూ
బక్ మూన్ చూడటానికి సరైన సమయం ఏది?