Human Body: మనిషి శరీరంలో లోపాలు.. ప్రకృతి చేసిన సర్దుబాటు!

మానవ శరీరం అద్భుతమైన నిర్మాణమే కావచ్చు.. కానీ అది ఒక పర్‌ఫెక్ట్ ఇంజినీరింగ్ డిజైన్ మాత్రం కాదు. లక్షలాది సంవత్సరాలుగా సాగిన జీవ పరిణామ క్రమంలో కాలానికి అనుగుణంగా జరిగిన కొన్ని సర్దుబాట్ల వల్లే మన శరీరంలో కొన్ని లోపాలు ఉండిపోయాయని తాజా అధ్యయనం ఒకటి స్పష్టం చేసింది.

Advertisement

'ది కాన్వర్జేషన్', 'సైన్స్ డైలీ' పత్రికల్లో ప్రచురితమైన పరిశోధనల ప్రకారం.. మనం నిత్యం ఎదుర్కొనే నడుము నొప్పి, కాన్పు కష్టాలు, పంటి నొప్పులు, కొన్ని రకాల నరాల బలహీనతలకు మన పూర్వీకుల నుంచి వారసత్వంగా వచ్చిన శరీర నిర్మాణ మార్పులే కారణమని శాస్త్రవేత్తలు తేల్చారు. ప్రకృతి అనేది ఉన్న డిజైన్‌ను పూర్తిగా తుడిచేసి, కొత్తగా సున్నా నుంచి ఏదీ సృష్టించదని, పాత నిర్మాణాలపైననే చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ వెళ్తుందని ఈ అధ్యయనం వివరించింది.

Advertisement

అందుకే నడుము నొప్పి!

మానవ వెన్నెముక మొదట నాలుగు కాళ్లతో నడిచే జీవుల కదలికలకు అనుగుణంగా రూపాంతరం చెందింది. కానీ, మానవుడు రెండు కాళ్లపై నిటారుగా నడవడం ప్రారంభించినప్పుడు, పరిణామ క్రమం పాత వెన్నెముకనే నిటారుగా మార్చింది తప్ప కొత్త నిర్మాణాన్ని సృష్టించలేదు. నాలుగు కాళ్లపై సమానంగా బరువు పడాల్సిన వెన్నెముక కాస్తా.. రెండు కాళ్లపైకి మారేసరికి వెన్నుపూస భాగంపై తీవ్ర ఒత్తిడి పడటం మొదలైంది. ఫలితంగానే నేటి ఆధునిక మానవుడికి నడుము నొప్పి, స్లిప్ డిస్క్, పోస్చర్ సమస్యలు ఇంత సర్వసాధారణంగా మారాయి.

Advertisement

ప్రసవ వేదనకు కారణం ఇదే!

మానవ పరిణామ క్రమంలో మానవుడి మేధస్సు పెరిగే కొద్దీ పిల్లల తల పరిమాణం (పెద్ద మెదడు వల్ల) పెరుగుతూ వచ్చింది. అదే సమయంలో రెండు కాళ్లపై వేగంగా, సమర్థవంతంగా నడవడానికి వీలుగా పెల్విస్ పరిమాణం కాస్త ఇరుకుగా మారింది. ఒకవైపు పెద్ద తల ఉన్న శిశువు, మరోవైపు ఇరుకైన పెల్విస్ భాగం.. ఈ రెండింటి మధ్య జరిగిన పరిణామ సర్దుబాటు వల్లే మానవులలో ప్రసవ ప్రక్రియ ఇతర జీవాల కంటే చాలా క్లిష్టంగా, వేదనతో కూడుకున్నదిగా మారింది.

మారిన దవడలు.. రాని జ్ఞాన దంతాలు!

ఆహార అలవాట్లు మారడం వల్ల కాలక్రమేణా ఆధునిక మానవుడి దవడ పరిమాణం చిన్నదవుతూ వచ్చింది. కానీ, నోట్లోని పళ్ళ సంఖ్య మాత్రం మునుపటిలాగే 32 గా ఉండిపోయింది. దవడలో స్థలం సరిపోకపోవడం వల్లే చివరి వరుసలో వచ్చే జ్ఞాన దంతాలు సరిగ్గా రాక, చిగుళ్లలోనే ఇరుక్కుపోయి తీవ్రమైన నొప్పి, ఇన్ఫెక్షన్లకు కారణమవుతున్నాయి. చాలా సందర్భాల్లో వీటికి సర్జరీ చేసి తొలగించాల్సి వస్తోంది.

Advertisement

అలాగే మెదడు నుంచి స్వరపేటికకు వెళ్లే ఒక ముఖ్యమైన నరం నేరుగా వెళ్లకుండా, గుండెకు సంబంధించిన ప్రధాన రక్తనాళాల చుట్టూ తిరిగి చాలా పొడవైన మార్గంలో ప్రయాణిస్తుంది. ఇది కూడా ప్రాచీన శరీర డిజైన్ల వారసత్వమే తప్ప సమర్థవంతమైన ప్లాన్ కాదు. దీనివల్ల మెడ, ఛాతీ సర్జరీల సమయంలో ఈ నరం దెబ్బతినే ప్రమాదం ఎక్కువగా ఉంటోంది.

పరిణామ క్రమం అనేది కేవలం మనుగడకు, సంతానోత్పత్తికి తక్షణ అవసరాలను తీర్చడానికే ప్రాధాన్యత ఇస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అపెండిక్స్, చెవి కండరాల వంటి కొన్ని భాగాలు శరీరానికి పెద్దగా ఉపయోగపడకపోయినా.. అవి మనిషి బ్రతకడానికి పెద్దగా అడ్డుపడవు కాబట్టి లక్షల ఏళ్లుగా అలాగే సాగుతున్నాయి. మానవ శరీరంలో ఉన్న ఇలాంటి నిర్మాణ లోపాలను, సర్దుబాట్లను అర్థం చేసుకోవడం ద్వారా భవిష్యత్తులో మానవాళిని వేధించే పలు రోగాలకు, శారీరక సమస్యలకు మెరుగైన వైద్య పరిష్కారాలను కనుగొనవచ్చని పరిశోధకులు ముగించారు.

English Summary

Human Body: A new study reveals that common human ailments like lower back pain, difficult childbirth, and impacted wisdom teeth are biological compromises caused by millions of years of evolutionary changes