మనిషి చిరకాలం జీవించాలనేది యుగయుగాలుగా ఉన్న కల. వైద్య విజ్ఞానం రోజురోజుకూ విస్తరిస్తోంది, ప్రాణాంతక వ్యాధులకు కూడా ఆధునిక మందులు వచ్చేస్తున్నాయి. అసలు మనిషికి ఎలాంటి జబ్బులు రాకుండా, వయస్సుతో వచ్చే హార్మోన్ల సమస్యలన్నీ తొలగించేస్తే.. మనం ఎన్ని వందల ఏళ్లు బతకవచ్చు? ఈ ప్రశ్నకే రష్యాకు చెందిన 'స్కోల్‌టెక్' శాస్త్రవేత్తల బృందం వినూత్న సమాధానం వెతికింది. మన శరీరాన్ని ఎంత జాగ్రత్తగా కాపాడుకున్నా, సైన్స్ సహాయంతో ముసలితనాన్ని దాచేసినా మానవ జీవన కాలానికి ఒక సహజమైన హద్దు ఉందని తమ పరిశోధనల ద్వారా స్పష్టం చేశారు.
కణాల్లో జరిగే చిన్న పొరపాటే శాపంగా మారితే..!
మనం ఆరోగ్యంగా ఉండటానికి నిరంతరం మన శరీరంలో కణాలు విభజన చెందుతూ ఉంటాయి. ఇలా ప్రతిసారి కణాలు విభజన చెందినప్పుడు డిఎన్‌ఏలో అతి చిన్న మార్పులు లేదా పొరపాట్లు జరుగుతాయి. శరీరం వీటిని బాగు చేయడానికి ప్రయత్నించినప్పటికీ, కొన్ని తప్పులు కాలక్రమేణా కణాల్లో మిగిలిపోతాయి. వయస్సు పెరిగే కొద్దీ ఇలాంటి మార్పులు పెరుగుతూ పోయి చివరకు కణాల పనితీరును దెబ్బతీస్తాయి. సాంకేతికతతో అనారోగ్యాలను దూరం చేసినా, మన జన్యువుల్లో నిశ్శబ్దంగా పేరుకుపోయే ఈ లోపాలే మనిషి ఆయుష్షును ముగింపు వైపు నడిపిస్తాయని గణిత నమూనాల ద్వారా లెక్కగట్టారు.
మన శరీరంలోని చర్మం, కాలేయం వంటి భాగాలు దెబ్బతింటే కొత్త కణాలను త్వరగా తయారుచేసుకోగలవు. కానీ గుండె, మెదడు విషయంలో పరిస్థితి పూర్తి భిన్నం. మెదడులోని నాడులు, గుండెలోని ప్రధాన కణాలు తమంతట తాము కొత్తగా పునరుత్పత్తి కావడం చాలా అరుదు. దాంతో ఏళ్ల తరబడి వీటిలో డీఎన్‌ఏ లోపాలు అలానే ఉండిపోతాయి. వయస్సు పెరిగే కొద్దీ మిగిలిన అవయవాలు సహకరించినా.. ఈ గుండె, మెదడు కణాల్లో వచ్చే మార్పులే మనిషి మనుగడకు ప్రధాన పరిమితిగా మారుతాయని శాస్త్రవేత్తలు వివరించారు. ప్రమాదాలు, వ్యాధులు, హార్మోన్ లోపాలు లేని ఒక ఊహాజనిత మనిషిని సృష్టించి కంప్యూటర్ మోడల్ ద్వారా విశ్లేషించినప్పుడు విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. శరీరంలో ఏ లోపం లేకపోతే మనిషి వెయ్యి ఏళ్లకు పైగా బతికే అవకాశం ఉన్నప్పటికీ, కేవలం ఈ డీఎన్‌ఏ లోపాల కారణంగా సగటు మనిషి ఆయుష్షు 146 నుంచి 194 ఏళ్ల మధ్య మాత్రమే ఉంటుందని తేలింది. ఇందులో సగటున 156 సంవత్సరాలను గరిష్ట పరిమితిగా గుర్తించారు. అంటే ఏ రోగం లేకపోయినా 156 ఏళ్ల తర్వాత శరీరం సహకరించడం ఆగిపోతుందని ఈ స్టడీ చెబుతోంది. అయితే ఇది అందరూ కచ్చితంగా 156 ఏళ్లు బతుకుతారని చెప్పే జోస్యం కాదని, మానవ శరీరం పనిచేసే తీరును అర్థం చేసుకోవడానికి చేసిన ఒక సైంటిఫిక్ అధ్యయనం మాత్రమేనని పరిశోధకులు తెలిపారు. ముసలితనాన్ని ఆపడానికి అనేక రకాల బయోటెక్ కంపెనీలు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, మన శరీరంలో ఉండే సంక్లిష్టమైన కణాల వ్య వ్యవస్థను దాటి అమరత్వాన్ని సాధించడం సాధ్యం కాదని ఈ పరిశోధన నిరూపిస్తోంది. వైద్య రంగానికి ఇది కొత్త సవాలు విసిరినప్పటికీ, వయోభారాన్ని తగ్గించే మందుల తయారీకి ఈ ఫలితాలు ఎంతగానో ఉపయోగపడనున్నాయి.గుండె, మెదడు కణాలే అసలు అడ్డంకి!
Human Body: మనిషి శరీరంలో లోపాలు.. ప్రకృతి చేసిన సర్దుబాటు!
గరిష్టంగా 156 ఏళ్లు మాత్రమే.. అంతకంటే ఎక్కువ కష్టమే!
Kokushobi: ప్రపంచానికి ఈ కొత్త హెచ్చరిక దేనికి సంకేతం?
అమరత్వం ఒక భ్రమ మాత్రమేనా?