వింత అస్టరాయిడ్- భూమి కంటే మూడింతల వేగం: విస్తుపోయే నిజాలు

జపాన్ అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రయోగించిన హయబుసా 2 అంతరిక్ష నౌక మరో అద్భుతమైన మైలురాయిని అధిగమించింది. భూమికి సుమారు 10 కోట్ల కిలోమీటర్ల దూరంలో విశ్వంలో ప్రయాణిస్తున్న టోరిఫునే (Torifune) అనే గ్రహశకలం సమీపం గుండా ఈ నౌక విజయవంతంగా దూసుకెళ్లింది. ఈ ప్రయాణంలో టోరిఫునేకు సంబంధించిన అద్భుతమైన చిత్రాలను టెలిఫోటో కెమెరా ద్వారా బంధించి భూమికి పంపింది. ఈ అపూర్వ ఘట్టం అంతరిక్ష పరిశోధనలలో కీలకమైనదిగా మారింది.

Advertisement

ఈ ప్రయోగంతో జపాన్ ఓ నూతన అధ్యాయానికి తెర తీసింది. స్సేస్ క్రాఫ్ట్స్ చరిత్రలోనే ఓ ఫ్లై బై ఇంత వేగంగా ప్రయాణించడం, ఓ అస్టరాయిడ్ కు అతి సమీపానికి వెళ్లడం అనేది ఇప్పటి వరకు ఏ దేశం కూడా సాధించలేకపోయింది. ఆ కోణంలో ఈ ప్రయోగం ఓ రికార్డు సృష్టించింది. 450 మీటర్ల వెడల్పు ఉన్న ఈ ప్రమాదకర భారీ గ్రహ శిలను హయబుసా-2 తన ఆప్టికల్ నేవిగేషన్ టెలిఫోటో కెమెరా (ONC-T) ద్వారా ఎంతో స్పష్టంగా క్లిక్ మనిపించింది.

Advertisement

ఈ గ్రహశకలం.. వేరుశెనగ ఆకారంలో ఉండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. అందుకే దీనికి పీనట్ అస్టరాయిడ్ గా పిలుస్తారు అంతరిక్ష పరిశోధకలు. హయబుస 2 పంపిన తాజా ఫొటోలు, డేటా ద్వారా ఇంతకుముందు కంటే కూడా స్పష్టమైన సమాచారం లభించడంతో జపాన్ శాస్త్రవేత్తలు హర్షం వ్యక్తం చేస్తోన్నారు. సాధారణ చిత్రాలతో పాటు టోరిఫునే ఉపరితలంలో దాగి ఉన్న మరికొన్ని రహస్యాలను విశ్లేషించేందుకు శాస్త్రవేత్తలు అధునాతన కెమెరాలను ఉపయోగించారు.

ఇందులో భాగంగా మిడ్ ఇన్‌ఫ్రారెడ్ కెమెరా ద్వారా గ్రహశకలం ఉపరితల ఉష్ణోగ్రత, దాని ఉపరితల వాతావరణాన్ని అంచనా వేశారు. సూర్యరశ్మి తగిలే ప్రాంతాల్లో తీవ్రమైన వేడి, ఎండ తగలని ప్రాంతంలో అదే స్థాయిలో శీతల వాతావరణం ఉన్నట్లు ధృవీకరించారు. హయబుస 2 పంపిన ఇన్ ఫ్రారెడ్ ఫొటోలను విశ్లేషించిన అనంతరం ఈ నిర్ధారణకు వచ్చారు.

Advertisement

టోరిఫునే గ్రహశకలం సూర్యుని చుట్టూ ఒక భ్రమణ కాలాన్ని పూర్తి చేయడానికి 383 రోజులు తీసుకుంటుంది. అంటే భూపరిభ్రమణ కంటే ఇది అధిక సమయం. అలాగే తన చుట్టూ తాను తిరగడానికి అయిదు గంటల సమయం మాత్రమే తీసుకుంటుందీ అస్టరాయిడ్. ఈ విషయంలో భూ పరిభ్రమణ సమయం కంటే మూడింతలు వేగం అధికం. ఇది అపోలో కమ్యూనిటీకి చెందిన గ్రహశకలంగా పరిగణించారు. ఈ రకమైన గ్రహశకలాలు సూర్యుని చుట్టూ తిరిగే క్రమంలో భూమి కక్ష్యను దాటుకుంటూ ప్రయాణిస్తాయి.

హయబుసా 2 ప్రస్థానం 2014 డిసెంబర్‌లో ప్రారంభమైంది. అప్పటి నుండి ఈ అంతరిక్ష నౌక పన్నెండేళ్ల సుదీర్ఘ ప్రయాణంలో అనేక ఘనతలు సాధించింది. 2020 డిసెంబర్‌లో ర్యూగు అనే భారీ గ్రహశకలం ఉపరితలం నుండి నమూనాలను సేకరించిన ఘనత దీనికి ఉంది. ఆ గ్రహశకలం నమూనాలపై జరిపిన పరిశోధనల్లో జీవ ఆవిర్భావానికి అవసరమైన డీఎన్‌ఏ, ఆర్‌ఎన్‌ఏ రసాయన మూలాలు లభించడం విశేషం.

Advertisement

వాస్తవానికి టోరిఫునే గ్రహశకలం సమీపానికి వెళ్లడం అనేది హయబుసా 2 ప్లానింగ్ లో లేదు. ఈ గ్రహశకలం గురించి సమాచారం చాలా పరిమితంగా ఉండటం, దాన్ని అత్యంత ప్రమాదకరమైన సాహసయాత్రగా భావించడం వల్ల ఈ దిశగా హయబుసను ఆపరేట్ చేయలేదు. అయినప్పటికీ విశ్వంలో నూతన అంశాలను అన్వేషించేందుకు శాస్త్రవేత్తలు ఈ సవాలును స్వీకరించారు. అందులో విజయవంతం అయ్యారు.

టోరిఫునే విజయం అనంతరం ఈ రీసెర్ప్ స్పేస్ క్రాఫ్ట్ తన తదుపరి మిషన్ వైపు సాగుతోంది. దాదాపు 11 మీటర్ల పరిమాణం గలిగిన 1998 కేవై 26 అనే అతిచిన్న గ్రహశకలాన్ని చేరుకోవడమే దీని తదుపరి గమ్యం. 2031 నాటికి ఆ అస్టరాయిడ్ ను చేరుకుని, దాని కక్ష్యలో తిరుగుతూ ఉపరితలాన్ని ల్యాండ్ అవ్వాల్సిఉంది.

English Summary

JAXA Hayabusa2 Gets Up Close With Near-Earth Peanut Shaped Asteroid Torifune Risky Flyby Breathtaking Data. A Japanese spacecraft has gotten up close and personal with yet another asteroid, beaming home stunning new imagery of the distant space rock.