WhatsApp: అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్! యూజర్లకు భారీ షాక్

ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది వాడుతున్న ప్రముఖ మెసేజింగ్ యాప్ 'వాట్సాప్' (WhatsApp) సరికొత్త బిజినెస్ రూల్స్‌తో రంగంలోకి దిగుతోంది. మొన్నటికి మొన్న ప్రైవసీకి సంబంధించిన 'యూజర్‌నేమ్స్' ఫీచర్‌తో వార్తల్లో నిలిచిన వాట్సాప్.. ఇప్పుడు తన ప్లాట్‌ఫారమ్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వాడకంపై కొత్త బాదుడుకు తెరలేపింది. తమ సొంత 'మెటా AI' కాకుండా ఇతర పోటీ కంపెనీలైన చాట్‌జీపీటీ (ChatGPT), క్లాడ్ (Claude) వంటి ఏఐ బాట్లను వాడే వ్యాపార సంస్థల (Businesses) నుంచి భారీగా ఫీజులు వసూలు చేయాలని నిర్ణయించింది. ఈ కొత్త ధరల విధానం టెక్ ప్రపంచంలో సరికొత్త చర్చకు దారితీసింది.

Advertisement

అక్టోబర్ 1 నుంచి కొత్త భారం!

ప్రస్తుతానికైతే వాట్సాప్‌లో ఏఐ ఏజెంట్లను లేదా చాట్‌బాట్లను ఉపయోగించుకోవడానికి ఎలాంటి అదనపు రుసుము లేదు. కానీ, ఈ ఏడాది అక్టోబర్ 1వ తేదీ నుంచి సరికొత్త నిబంధనలు అమలు కాబోతున్నాయి. దీని ప్రకారం.. వాట్సాప్‌ బిజినెస్ అకౌంట్లలో థర్డ్ పార్టీ (ఇతర కంపెనీల) ఏఐ మోడల్స్ సహాయంతో కస్టమర్లతో జరిపే సంభాషణలకు, 'మెటా AI'తో చేసే చాట్ కంటే దాదాపు రెట్టింపు ధరను వసూలు చేయనున్నారు.

Advertisement

దీనివల్ల జీపీటీ (GPT), క్లాడ్ (Claude), క్వెన్ (Qwen), మిస్ట్రాల్ (Mistral), కిమి (Kimi) వంటి పాపులర్ ఏఐ మోడల్స్ ఆధారంగా తమ కస్టమర్ కేర్ చాట్‌బాట్లను డిజైన్ చేసుకున్న కంపెనీలు, వ్యాపార భాగస్వాములపై ఆర్థిక భారం విపరీతంగా పెరగనుందని టెక్ నిపుణులు చెబుతున్నారు.

గుత్తాధిపత్యంపై లీగల్ చిక్కులు?

తమ సొంత 'మెటా AI'కి తక్కువ చార్జీలు వేసి, ప్రత్యర్థి కంపెనీల ఏఐ మోడల్స్‌పై డబుల్ రేట్లు వడ్డించడం ద్వారా మార్కెట్లో మెటా సంస్థ గుత్తాధిపత్యాన్ని ప్రదర్శిస్తోందని లీగల్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. వాట్సాప్ తీసుకున్న ఈ తాజా నిర్ణయంపై భారతదేశంలోని కాంపిటీషన్ రెగ్యులేటర్లు (Antitrust Regulators) జోక్యం చేసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Advertisement

నిజానికి ఇలాంటి వ్యవహారంలో యూరోపియన్ యూనియన్ (EU) యాంటీట్రస్ట్ రెగ్యులేటర్లు ఇప్పటికే మెటా సంస్థకు మొట్టికాయలు వేశారు. వాట్సాప్‌లో ఓపెన్ ఏఐ కి చెందిన చాట్‌జీపీటీ, ఆంత్రోపిక్ కంపెనీకి చెందిన క్లాడ్ వంటి థర్డ్ పార్టీ సేవలను నిషేధించడం ద్వారా మెటా తన మార్కెట్ ఆధిపత్యాన్ని దుర్వినియోగం చేస్తోందని యూరోపియన్ కమిషన్ గతంలోనే తీవ్రంగా తప్పుపట్టింది. మరి ఈ లీగల్ సవాళ్లను దాటుకుని వాట్సాప్ తన కొత్త ఏఐ ధరల వ్యూహాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తుందో చూడాలి!

English Summary

Meta introduces a new WhatsApp pricing model charging businesses double for rival AI bots like ChatGPT and Claude compared to Meta AI, sparking major antitrust concerns.