తొలకరి చినుకులు పడగానే నేలంతా పచ్చదనం పరుచుకుంటుంది.. గాలిలో కొత్త మట్టి వాసన అలముకుంటుంది. అయితే, వర్షాకాలంలో అడవుల్లో మనకు కనిపించే సౌందర్యం వెనుక ఒక నిశ్శబ్ద అద్భుతం దాగి ఉంది. మొదటి వాన పడగానే కాలితో తొక్కితే నలిగిపోయేంత సున్నితమైన పుట్టగొడుగులు రాత్రికి రాత్రే నేల నుంచి మొలకెత్తుతాయి. చూడటానికి కొన్ని రోజులు మాత్రమే కనిపించే ఈ చిన్ని జీవులు.. అసలు అడవి బ్రతకాలన్నా, చెట్లు పచ్చగా వికసించాలన్నా అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తున్నాయని వాతావరణ, పర్యావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
చాలామంది పుట్టగొడుగులను కేవలం ఒక మొక్కగానో లేదా ఆహారంగానో చూస్తారు. కానీ, అసలు సిసలు భూగర్భ సామ్రాజ్యం నేల అడుగున ఉంటుంది. ఏడాది పొడవునా పీచు దారాల్లాంటి 'మైసీలియం' అనే వల రూపంలో నేలలో దాగి ఉండే ఈ శిలీంధ్రాలు, వర్షాకాలంలో లభించే తేమ, వెచ్చదనానికి ఒక్కసారిగా పుట్టగొడుగుల రూపంలో పైన ప్రత్యక్షమవుతాయి. ఏడు రంగుల్లో, విభిన్న ఆకారాల్లో అడవి నేలపై ప్రత్యక్షమయ్యే ఈ వింత జీవులు ప్రకృతి గీసిన ఒక సజీవ చిత్రం లాంటివి.
అడవిలో రాలిన ఎండిన ఆకులు, పడిపోయిన పెద్ద చెట్ల కొమ్మలు, కుళ్ళిపోతున్న కలపను భూమిలో కలిసిపోయేలా చేసే ఏకైక శక్తి ఈ పుట్టగొడుగులదే. ఒకవేళ ఇవే లేకపోతే అడవి అంతా కుళ్ళిన చెట్లతో నిండిపోయి, కొత్త మొక్కలు మొలకెత్తడానికి చోటు లేకుండా పోతుంది. పుట్టగొడుగులు ఆ పదార్థాలను విచ్ఛిన్నం చేసి, నైట్రోజన్, ఫాస్పరస్ వంటి విలువైన పోషకాలను తిరిగి మట్టిలోకి చేరుస్తాయి. ఇవి అడవికి అందించే సహజసిద్ధమైన ఎరువుగా పనిచేస్తాయి. పుట్టగొడుగులు కేవలం నేలను శుభ్రం చేయడమే కాకుండా, పెద్ద పెద్ద వృక్షాల వేళ్లతో ఒక ప్రత్యేక సంబంధాన్ని ఏర్పరుచుకుంటాయి. చెట్లకు నేల లోపల నుంచి నీటిని, ఖనిజాలను అందివ్వడంలో పుట్టగొడుగుల వేళ్లు సహాయపడితే.. ప్రతిఫలంగా చెట్లు కిరణజన్య సంయోగక్రియ ద్వారా తయారుచేసే చక్కెరలను ఇవి ఆహారంగా తీసుకుంటాయి. ఇలా ఒకదానికొకటి సహాయం చేసుకుంటూ అడవిలోని జీవవైవిధ్యాన్ని కాపాడుతుంటాయి. భారతీయ అడవుల్లో వందల రకాల వర్షాకాలపు పుట్టగొడుగులు కనిపిస్తాయి. వీటిలో కొన్ని రాత్రివేళల్లో చీకట్లో స్వయంగా వెలుగులు విరజిమ్మే గుణాన్ని కలిగి ఉంటే, మరికొన్ని పగడాలు, కప్పులు, పక్షుల గూళ్ల ఆకారంలో ఆశ్చర్యపరుస్తాయి. అయితే, అడవిలో కనిపించే అన్ని పుట్టగొడుగులు తినదగినవి కావు. కొన్ని అత్యంత విషపూరితంగా ఉంటాయి కాబట్టి, అవగాహన లేకుండా అడవి పుట్టగొడుగులను తాకడం లేదా ఆహారంగా తీసుకోవడం ప్రాణాలకే ప్రమాదమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేవలం కొద్దిరోజులే బతికే ఈ చిన్ని పుట్టగొడుగులే అడవికి అసలైన రక్షకులు!అడవులను శుభ్రం చేసే 'నేచురల్ రీసైక్లర్లు'
పొదుపు సంఘాల మహిళలకు భారీ సబ్సిడీ: ఏపీ మష్రూమ్ మిషన్ ప్రారంభం!
చెట్లతో చెలిమి.. భూమికి బలం!
నొప్పులు నాటిన ఆశలు.. రితాంజలి మష్రూమ్ ఫామ్ విజయగాథ
రాత్రివేళ మెరిసే కాంతులు.. వింత రూపాలు