ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ లో తీరని విషాదం: 39 ఏళ్లకే మాజీ ఆల్ రౌండర్ భారత్ లో కన్నుమూత

ఆఫ్ఘనిస్తాన్ క్రీడా ప్రపంచంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆ దేశ క్రికెట్ జట్టును ఉన్నత స్థాయికి చేర్చడంలో కీలక పాత్ర పోషించిన ప్రముఖ మాజీ ఫాస్ట్ బౌలర్, ఆల్ రౌండర్ షాపూర్ జద్రాన్ (Shapoor Zadran) కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గ్రేటర్ నోయిడాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తన 39వ పుట్టినరోజుకు సరిగ్గా ఒక రోజు ముందు తుదిశ్వాస విడిచారు. అ విషయాన్ని ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు ధృవీకరించింది.

Advertisement

షాపూర్ జద్రాన్ కొన్ని నెలలుగా హీమోఫాగోసైటిక్ లింఫోహిస్టియోసైటోసిస్ (HLH) అనే అత్యంత అరుదైన, ప్రాణాంతకమైన వ్యాధితో పోరాడుతున్నారు. దీని బారిన పడితే మనిషి రోగనిరోధక వ్యవస్థ మితిమీరిన వేగంతో పనిచేస్తుంది. ఫలితంగా శరీరంలోని కీలక అవయవాలను దెబ్బతింటాయి. స్వదేశంలో సరైన వైద్య సదుపాయాలు లేకపోవడంతో.. ఆఫ్ఘన్ డాక్టర్ల సూచనల మేరకు మెరుగైన చికిత్స కోసం ఆయనను భారత్ కు తీసుకువచ్చారు. నోయిడాలో ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. ఆయన ప్రాణాలను నిలపడానికి డాక్టర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.

Advertisement

ఆఫ్ఘన్ క్రికెట్ విజయాల రూపశిల్పి

తీవ్రమైన అంతర్గత ఘర్షణలు ఎదుర్కొంటున్న దేశంలో క్రికెట్ ను యువతకు పరియచం చేసిన మొదటితరం క్రికెటర్ గా గుర్తింపు పొందారు షాపూర్ జద్రాన్. 2009 నుంచి 2020 వరకు సుదీర్ఘ కాలం పాటు జాతీయ జట్టుకు ఎనలేని సేవలను అందించారు. దేశవ్యాప్తంగా క్రికెట్‌కు ఒక నూతన క్రేజ్ ను తీసుకువచ్చాడు. ఎడమచేతి వాటంతో అత్యంత వేగంగా బౌలింగ్ వేసే షాపూర్ దూకుడు ఆకట్టుకునేది.

కేరీర్ మొత్తం మీద షాపూర్ మొత్తం 80 అంతర్జాతీయ మ్యాచ్‌లను ఆడారు. ఇందులో 44 వన్డే ఇంటర్నేషనల్స్, 36 టీ20 మ్యాచ్‌లు ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్ జట్టు మొదటిసారిగా ఐసీసీ వన్డే ప్రపంచ కప్, టీ20 ప్రపంచ కప్ వంటి మెగా టోర్నమెంట్‌లలో ఆడేందుకు అర్హత సాధించడంలో కీలక పాత్ర పోషించారు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు వికెట్లు తీస్తూ, చిరస్మరణీయ విజయాలు అందించాడు.

Advertisement

గత ఏడాది అక్టోబర్ లోనే షాపూర్ మొదటిసారి తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. చికిత్స కొనసాగుతున్న సమయంలో, ఆఫ్ఘన్ క్రికెటర్లు మహ్మద్ నబీ, రషీద్ ఖాన్ గ్రేటర్ నోయిడా ఆసుపత్రికి స్వయంగా వెళ్లి ఆయనను పరామర్శించారు. ఆసుపత్రి బెడ్‌పై అత్యంత దయనీయ స్థితిలో ఉన్న తన ప్రియమైన సహచర మిత్రుడిని చూసి కన్నీళ్లు పెట్టుకుంటూ నబీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫొటో అప్పట్లో యావత్ క్రీడా సమాజాన్ని కదిలించింది.

షాపూర్ జద్రాన్ అకాల మరణం పట్ల అంతర్జాతీయ క్రీడా ప్రపంచంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వేలాది మంది అభిమానులు తీవ్ర సంతాపాన్ని తెలియజేస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు సైతం తీవ్ర విచారం వ్యక్తం చేసింది. దేశంలో క్రికెట్ పునాదులు బలోపేతం చేయడానికి ప్రాణాలొడ్డి శ్రమించిన ఓ గొప్ప యోధుడిని కోల్పోయామని నివాళి అర్పించింది.

English Summary

Afghanistan cricket mourns the passing of fast bowling legend Shapoor Zadran. He died in a hospital in Greater Noida, India, just a day before his birthday. His death has left the global cricketing community in shock, mourning a pioneer who helped shape Afghan cricket.